Sat. Mar 6th, 2021

Andhra Pradesh

  • గొల్లప్రోలులో అభ్యర్థుల పోటా పోటీగా ప్రచారం

    గొల్లప్రోలు – తూర్పు గోదావరి
    ——————————————-
    నగరపంచాయితి ఎన్నికల తేదీ దగ్గర పడు తుండటంతో గొల్లప్రోలులో ఆయా పార్టీల తరపున పోటీలో ఉన్న అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. నగరపంచాయితి పరిధిలో 20 వార్డులకు ఉండగా వైసీపీ, టిడిపి, తరపున అన్ని వార్డులకు అభ్యర్థులు పోటీ చేస్తుండగా జనసేన, బిజెపి అభ్యర్థులు మాత్రం కొన్ని వార్డులో మాత్రమే పోటీకి పరిమిత మయ్యారు. నామినేషన్ ఉపసంహరణ ప్రక్రియ బుధవారం సాయంత్రంతో ముగియడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇక ప్రచారంపై దృష్టి సారించారు. వైసీపీ తరఫున చైర్మన్ అభ్యర్ధిగా ఉన్న గుండ్రేటి మంగతాయారు, గండ్రేటి శ్రీ రామచంద్ర మూర్తి 16, 17, 18 వార్డులలో విస్తృతంగా పర్యటించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అలాగే టిడిపి తరపున చైర్మన్ అభ్యర్ధిగా ఉన్న మాదేపల్లి నాగినిచంద్ర గురువారం పాపయ్యచావిడి వీధిలో పర్యటించి తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. వైసీపి అభ్యర్థులకు మద్దతుగా సొసైటీ అధ్యక్షుడు జ్యోతుల భీముడు, మాజీ ఎంపిపి వర్ధనపు వీర్రాజు, మాజీ ఎంపిటిసి జ్యోతుల కృష్ణమూర్తి తదితరులు ప్రచారం నిర్వహించారు. అలాగే టిడిపి అభ్యర్థులకు మద్దతుగా మాజీ మార్కేట్ కమిటీ సభ్యుడు మాదేపల్లి వినీల్ వర్మ, కొడాలి బాబ్జీ తదితరులు ప్రచారం నిర్వహించారు.

Telangana

  • తెలుగు దేశం పార్టీలో బ్రతుకు మార లేదని సినీరంగంలో కెళ్ళిన మాజీ నక్సలైట్ స్వప్న

    మల్లూరు – ములుగు జిల్లా
    —————————————-
    ములుగు జిల్లా మంగపేట మండలంలోని మల్లూరు గ్రామానికి చెందిన మారబోయిన స్వప్న రాంబాబు ప్రస్తుతం సినీరంగంలో అడుగిడి సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటిస్తూ అంచెలు అంచెలుగా ఎదుగు తున్నారు. దీనికి ముందు గతంలో చిన్న వయసులోనే పోరు బాట పట్టి మావోయిస్టుల్లో చేరి 5 సంవత్సరాల పాటు ప్రజా ప్రతిఘటన దళంలో నక్సలైట్ గా పని చేసారు. 2005లో ఖమ్మం డిఎస్పీ దగ్గర ఆమె లొంగిపోయి ప్రభుత్వం ఇచ్చే రూ. 50,000 నగదు ప్రోత్సాహాన్ని అందుకున్నారు. అనంతరం పెళ్లయ్యాక గృహిణిగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తన కష్టాలను అదిగమించి రాజకీయంలో అడుగు పెట్టారు. తెలుగుదేశం పార్టీ మహిళా విభాగంలో అధ్యక్షురాలిగా పని చేసారు. పార్టీ కోసం శ్రమించినా తన బతుకు మారలేదని రాజకీయాల్ని విడచి పెట్టారు. తర్వాత టిక్ టాక్ లో “స్మైలీ స్వప్నగా” ఫేమస్ అయ్యి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అనంతరం ఆ గుర్తింపుతో ఓ మిత్రుని సలహా, సహకారంతో బుల్లి తెర రంగంలోకి ప్రవేశించారు. టీవీ సీరియల్లో నటిగా అవకాశం వచ్చి మొదటగా నాలుగు స్తంభాలు సీరియల్లో కానిస్టేబుల్ పాత్రతో  తన నటనను ప్రారంభించారు. ఇప్పటి వరకు ఆమె సుమారు 5 సీరియల్స్ లో  నటించారు. ఇటీవల ఓ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో  నటిస్తూనే మరో రెండు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో నటించడానికి అవకాశం వస్తే స్వప్న అంగీకరించారు.