నూటొక్క జిల్లాల సినీ అందగాడు నూతన ప్రసాద్

ఆంధ్రప్రదేశ్ సినిమా

* నేడు ఆయన వర్ధంతి (మార్చి 30)

డా.జె.వి.ప్రమోద్ కుమార్ – పైడిమెట్ట
—————————————————–
            9490833108

తెలుగు చలన చిత్రపరిశ్రమ చరిత్రలో నూతన ప్రసాద్ ది ఒక ప్రత్యేక స్థానం. విభిన్న మైన మేనరిజమ్ తో తనకు ఒక గుర్తింపును సంపాదించు కున్నారు. నూతన ప్రసాద్. నూటొక్క జిల్లాల అందగాడుగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండి పోయారు. వీరి అసలు పేరు తదినాధ వరప్రసాద్. ఈయన 1970  80 దశకాలో తెలుగు సినీ రంగంలో హాస్య నటుడు, ప్రతి నాయకుడుగా ప్రసిద్ది చెందారు. బాపు రమణలు రూపొందించిన ‘రాజాధిరాజా’ చిత్రంలో “’కొత్త దేవుడండీ.., కొంగొత్త దేవుడండీ..’అంటూ నేను పోషించిన సైతాన్ పాత్ర నటుడిగా నాకెంతో తృప్తి నిచ్చింది” అనేవారు నూతన ప్రసాద్. వీరు 12 డిసెంబర్ 1945 న కైకలూరులో జన్మించారు. బందరులో ఐటిఐ చదివి నాగార్జున సాగర్, హైదరాబాద్ లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేసి ఎచ్.ఎ.ఎల్ లో సెటిల్ అయ్యారు. ఆ సమయంలోనే నటులు, దర్శకులు భాను ప్రకాష్ తో పరిచయం కావడంతో రంగస్థలంపై సుడిగాలి, గాలివాన, వలయం, కెరటాలు వంటి నాటకాల్లోనూ, నాటక రంగ ప్రయోక్త ఎ.అర్.కృష్ణ దర్శకత్వంలో ‘మాలపిల్ల’ నాటకం 101 సార్లు ప్రదర్శించారు. బాపు దర్శకత్వం వహించిన ‘అందాల రాముడు’ చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసి ‘ముత్యాల ముగ్గు’లో నిత్య పెళ్ళికొడుకులా వేషం వేసి ఆ పైన వేజెళ్ళ సత్యనారాయణ ‘చలి చీమలు’ చిత్రంతో నూతన ప్రసాద్ గా తన పేరు మార్చుకుని నూటొక్క జిల్లాల అందగాడిగా ప్రసిద్ది పొందారు. అప్పటి నుండి భానుమతి భర్తగా ‘బామ్మ బాట- బంగారు బాట’ చిత్రం వరకు  365 చిత్రాల్లో నటించారు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో ఏక్సిడెంట్ కావడంతో కొంత కాలం విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత దాదాపు 112 చిత్రాల్లో నటించారు. వీరు దాదాపు 20 చిత్రాల్లో జడ్జి పాత్రను పోషించారు. అదొక రికార్డ్. ‘సంసారం ఒక చదరంగం’ లో విలక్షణమైన హాస్యాన్ని నూతన ప్రసాద్ పండించారు. విజయ బాపినీడు చిత్రం ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ లో పోలీస్ ఆఫీసర్ గా ‘దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’ అన్న డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. విజయ, బొట్టు కాటుక, కాయ్ రాజా కాయ్, వసుంధర, ‘ఇంటింటి రామాయణం’ వంటి చిత్రాల్లో ప్రత్యేకించి ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. పరమ కర్కోటకుడుగా, బ్రోకర్ గా, ‘పూజకు పనికిరాని పువ్వు’ చిత్రంలో మూర్ఖత్వం, ప్రేమ, సెంటి మెంట్ నిండిన పాత్రలోనూ, ‘అహనా పెళ్ళంటా’ చిత్రంలో ప్రదర్శించిన నటన అపూర్వం. ‘ఆఖరి పోరాటం’ చిత్రంలో కేంద్ర మంత్రిగా అమ్రిష్ పురితో పోటీ పడి నటించారు. సుందరి సుబ్బారావు (1984), ప్రజాస్వామ్యం, నవ భారతం, వసుంధర చిత్రాల్లో ఈయన నటనకు గానూ రాష్ట్ర ప్రభుత్వం నుండి నంది పురస్కారం అందుకున్నారు. తండ్రీ కొడుకులైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున కాంబినేషన్లో వచ్చిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ చిత్రంలో ప్రతి నాయకునిగా ఆ ఇద్దరితో పోటీపడి నటించడం చెప్పుకో తగ్గ విశేషం. కె.రాఘవేంద్రరావు ‘అగ్గి పర్వతం’, దాసరి ‘తిరుగుబాటు’, ఇ.వి.వి ‘అబ్బాయి గారు’ వంటి చిత్రాల్లో వెరైటీ పాత్రలు పోషించారు. నేరాలు ఘోరాలు, హ్యాట్సాఫ్ వంటి కార్యక్రమాల ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. కొంత కాలం సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతికి కార్యదర్శిగా పనిచేశారు. 2005లో ఈయనకు ఎన్టీఆర్ పురస్కారం పొందిన ఈయన అనారోగ్యంతో 30 మార్చి 2011 న కన్ను మూశారు.¤

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *