* కరోనా కష్టాలను మైమరచిన జనం
* ఆనంద డోలికల్లో మునిగి తేలారు
* కొత్త ఆశలు, ఆశయాలు చిగురించాయ్

శంఖవరం, తూర్పుగోదావరి
—————————————–

ఈ కొత్త సంవత్సరం వేడుకలు సాటిలేని మేటి రీతిలో ఊరూరా, వీధి వీధినా, ఇంటింటా ఎంతో ఘనంగా జరిగాయి. అన్ని ఞసామాజిక వర్గాల ప్రజలు ఈ నూతన సంవత్సరం వేడుకల ఆనంద డోలికల్లో మునిగి తేలారు. కొత్త ఆశలు, కొంగొత్త ఆశయాలతో కొత్తేటిలోకి సరికొత్తగా ప్రవేశించారు. డిసెంబర్ 31 రాత్రి ప్రజలు నిద్రకు స్వస్తి పలికి మెలకువగా ఉండి అర్ధ రాత్రి 12 గంటల తర్వాత కొత్తేడాదికి ఘనంగా స్వాగతం పలికారు. తలారా స్నానాలతో కొత్త దుస్తుల్లో మెరిసి మురిసిపోతూ
ఒకరి కొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసారు. పరస్పరం బహుమతులు ఇచ్చి పుచ్చుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నారు. రాత్రి నుంచీ మందు, విందు, వినోదాలతో ఆనందించారు. కరోనా కష్టాలను మైమరచి, కొత్త సంవత్సరం వేడుకలను నిర్వహించ కూడదన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను తోసి రాజని తమదైన ఊహా జగత్తులో ఊరేగారు. నూతన సంవత్సర వేడుకల నిర్వహణ పాశ్చాత్య దేశాల సంస్కృతీ, సంప్రదాయం ఐనప్పటికీ ఆ ప్రాంతీయ ఆలోచనలను పక్కనపెట్టి ఈ వేడుకల్లో జోరు హుషారు పెంచారు. పారాహుషార్ అంటూ బంధువులు, ఇరుగు పొరుగు హితులు, సన్నిహితులు ఇండ్లకు వేడుకలకు కలియ దిరిగారు. ఇండ్లు, వాకిళ్ళు, రోడ్లు ముస్తాబులతో రంగులతో, రెడ్డి కార్పెట్ల సుస్వాగతంతో సరికొత్త కాంతులీనాయి. హేపీ న్యూ ఇయర్ అంటూ ప్లెక్సీలు, బ్యానర్లు సుస్వాగతం పలికాయి. కరోనా కష్టం, నష్టంలోనూ వ్యయానికి వెరవని ఖరీదైన నూతన సంవత్సర వేడుకలు మరింత రెట్టింపుతో తళుకులీనాయి. ఈ వేడుకలు జనుల మనస్సుల్లో నూతన ఉత్సాహాన్ని నింపాయి. వర్తమాన కాలానికి సాక్షీభూతంగా నిలిచాయి.

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం శంఖవరంలో ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ స్వగృహం ప్రాంగణం నూతన సంవత్సర వేడుకలకు నూతన శోభ నిచ్చింది. డిసెంబర్ 29 న ఆయన జన్మదినం. ఆ దినోత్సవ వేడుకలను రద్దు చేసుకున్న ఆయన నియోజక వర్గం ప్రజల సంతోషం కోసం గతంలో కంటే ఈ కొత్త ఏడాది వేడుకలను మరింత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. స్వంత ఊరు, మండలం, నియోజకవర్గం, జిల్లాతో పాటు జిల్లాయేతర ప్రాంతాల నుంచి ఆయన అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, ప్రజలు, ప్రముఖులు ఎమ్మెల్యేపై ప్రేమతో శంఖవరంలోని ఆయన స్వగృహానికి విచ్చేసి హృదయ పూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేకు ప్రజలు ఫల, పుష్ప గుచ్చాలు, పెన్నులు, పుస్తకాలు వంటి చిరు కానుకలను బహుకరించారు. మరికొందరు గజమాలలతో ఎమ్మెల్యేను సత్కరించి తమ ప్రేమాభిమానాలు ప్రకటించు కున్నారు. వేలాదిగా తరలి వచ్చిన జనావళి సౌకర్యం కోసం తన స్వగృహ ప్రాంగణంలో భద్రతతో, సౌకర్యాలతో కూడిన సకల ఏర్పాట్లు చేసారు. ఇక్కడ ఆహూతులకు సాదర స్వాగతం లభించింది. వారికి ఉదయం స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో అల్పాహారం, మధ్యాహ్నం పాత ఆస్పత్రి ప్రాంగణంలో చికెన్ బిర్యానీతో విందును షడ్రుచోపేతంగా ఏర్పాటు చేసారు. తనకు శుభాకాంక్షలు చెప్పి వెళ్ళే వారి చేతికి ఫల, పుష్పాలను చిరు కానుకలుగా ఎమ్మెల్యే అందించి ప్రతీ పౌరుని సగౌరంగా స్వయంగా సాగనంపారు. ఈ నూతన సంవత్సర వేడుకలు సత్సంప్రదాయ, సుహృద్భావ, సంతోషకర, ఆహ్లాదకరమైన వాతావరణంలో జరుగుతున్నప్పటికీ ప్రజలకు మనోరంజనం కలిగించేందుకు పాత ఆస్పత్రి ప్రాంగణంలో గానలహరి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.గాత్రం, సంగీతాభిమానులను గాన మాధుర్యంతో మరో సరికొత్త లోకాల్లో విహరింప చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *