– జిల్లా క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి వెల్ల‌డి

కాకినాడ‌ – తూర్పుగోదావరి
—————————————
జిల్లాలో ద‌శ‌ల వారీగా నిబంధ‌న‌ల మేర‌కు ప్ర‌జ‌ల‌కు కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు పూర్తి స్థాయి స‌న్న‌ద్ధ‌త‌తో ఉన్న‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వ మార్గ‌ద‌ర్శ‌కాల మేర‌కు వ్యాక్సిన్‌ను వాస్త‌వ ప‌రిస్థితుల్లో అందించ‌డంపై స‌న్న‌ద్ధ‌త స్థాయిని తెలియ‌జేసే డ్రై ర‌న్‌ను శ‌నివారం కాకినాడ రేచ‌ర్ల‌పేట ప‌ట్ట‌ణ ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రం, అపోలో ఆసుప‌త్రి, ర‌మ‌ణయ్య‌పేట‌లోని ఎస్ఆర్ఎంటీ ప్రాంతాల్లో నిర్వ‌హించారు. రేచ‌ర్ల‌పేట యూ-పీహెచ్‌సీ కేంద్రంలో డ్రైర‌న్ ప్ర‌క్రియ‌ను జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి, కాకినాడ న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్ త‌దిత‌రుల‌తో క‌లిసి క‌లెక్ట‌ర్ ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ జిల్లాలో ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో మూడు కేంద్రాల్లో డ్రైర‌న్ నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. వ్యాక్సిన్ బాక్సుల‌‌ను సెంట్ర‌ల్ స్టోరేజ్ పాయింట్ నుంచి భ‌ద్ర‌త మ‌ధ్య స‌రైన స‌మ‌యానికి, అవ‌స‌ర‌మైన ప‌రిమాణంలో నిర్దేశ ప్ర‌మాణాలు పాటిస్తూ టీకా వేసే ప్రాంతాల‌కు పంపించే ప్ర‌క్రియ చాలా కీల‌క‌మైన‌దని పేర్కొన్నారు. ఈ ద‌శ త‌ర్వాత వ‌రుస‌గా డేటా ఎంట్రీ, వ్యాక్సిన్ వేయ‌డం, టీకా వేయించుకున్న వ్య‌క్తిని ప‌రిశీల‌న‌లో ఉంచ‌డం ప్రక్రియ‌లో భాగంగా ఉంటాయ‌న్నారు. టీకా వేయించుకున్న వ్య‌క్తిని అర‌గంట పాటు వైద్యుల ప‌రిశీల‌న‌లో ఉంచుతార‌ని, అంతా బాగానే ఉంద‌నుకుంటే ఇంటికి పంపుతార‌న్నారు. టీకా వేశాక ద‌ద్దుర్లు రావ‌డం వంటి దుష్ఫ‌లితం ఎదురైతే వెంట‌నే అత్య‌వ‌స‌ర వైద్యం అందించేందుకు వైద్యులు, మందులు సిద్ధంగా ఉంటాయ‌న్నారు. జిల్లాలో వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చాక తొలుత దాదాపు 40 వేల మంది ఆరోగ్య కార్య‌క‌ర్త‌ల‌కు వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు తెలిపారు. త‌ర్వాత పోలీసు, పారిశుద్ధ్య విభాగాల సిబ్బందికి ఆపై 50 ఏళ్ల పైబ‌డిన వారికి ఇవ్వ‌నున్న‌ట్లు తెలిపారు. త‌ర్వాత రిజిస్ట్రేష‌న్ చేయించుకున్న ఇత‌రుల‌కు వ్యాక్సిన్ వేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. కొత్త స్ట్రెయిన్ విష‌యంలో భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని ప్ర‌తి ఒక్క‌రూ మాస్కు ధ‌రించ‌డం, చేతులను శుభ్రంచేసుకోవ‌డం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం మ‌ర‌వ‌కూడ‌ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు.

అపోహ‌లు వ‌ద్దు: డీఎంహెచ్‌వో
———————————————-
అన్ని విధాలా పూర్తి స్థాయిలో ప‌రీక్షించాకే కోవిడ్ వ్యాక్సిన్ వేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌వుతోంద‌ని, అందువ‌ల్ల ఎలాంటి భ‌యాందోళ‌న‌లు చెందాల్సిన అవ‌స‌రంలేద‌ని డీఎంహెచ్‌వో డాక్ట‌ర్ కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు పేర్కొన్నారు. వ్యాక్సిన్ వేసేందుకు 200 కేంద్రాల‌ను గుర్తించామ‌ని, తొలిద‌శ‌లో రెండు రోజుల పాటు ఒక్కో కేంద్రంలో రోజుకు 100 మందికి వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నామ‌న్నారు.  టీకా విష‌యంలో అపోహ‌లు అన‌వ‌స‌ర‌మ‌ని, కొత్త స్ట్రెయిన్ నుంచి కూడా ర‌క్ష‌ణ ల‌భిస్తుంద‌న్నారు. ఒక్కో కేంద్రంలో 25 మందికి డ‌మ్మీ వ్యాక్సినేష‌న్ చేసిన‌ట్లు జిల్లా ఇమ్యునైజేష‌న్ అధికారి (డీఐవో) డాక్ట‌ర్ అరుణ తెలిపారు. డ్రైర‌న్ ప్ర‌క్రియ‌ను ఆమె శ‌నివారం నిరంత‌రం పర్య‌వేక్షించారు. ‌కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య సిబ్బందితో ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక బృందాలు పాల్గొన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *