* తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్

కాకినాడ – తూర్పుగోదావరి
——————————————-
ఈ 2021 సంవత్సరంలో అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు పర్చవలసి వున్నందున , ఆ దిశగా అధికారులు ప్రత్యేక దృష్టితో ప్రణాళికా బద్ధంగా పనిచేసే విధంగా కార్యక్రమం రూపొందించు కోవాలని కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు . శనివారం కలెక్టర్ తన కార్యాలయపు సమావేశ మందిరం నుండి జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ , జె.రాజకుమారిలతో కలిసి క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 7 వ తేదీ నాటికి లబ్ధిదారులకు సంతృప్తి పర్చే విధంగా పట్టాల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలన్నారు . జిల్లా వ్యాప్తంగా మొదట విడతగా 1 లక్షా 54 వేలు పట్టాలు అందిస్తున్న నేపద్యంలో దీనిని అమలు పర్చడానికి డివిజన్ స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించాలన్నారు . పట్టాల పంపిణీ కార్యక్రమం అనంతరం గృహనిర్మాణాలు చేపట్టవలసి వుందనీ వాటికి కావలసిన సామాగ్రి విషయంలో అప్రమత్తంగా వుండాలన్నారు . ముఖ్యంగా సామాగ్రి పెట్టె గోడౌన్లు లేఅవుట్ కు దగ్గరలోను , ఎటువంటి లోటు పాట్లు లేని విధంగా ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు . ఇప్పటికే పట్టాలు పొందిన లబ్ధిదారులు సంతృప్తికరంగా వున్నారని , ప్రభుత్వం నిర్దేశించిన మూడు ఎంపికలను వివరించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలన్నారు . సొంత స్థలం వున్న వారికి పొజిషన్ పట్టాలు ఇవ్వాలని, ఒక వేళ పట్టా పొందడానికి అర్హత లేక పొతే ఎందుకు అర్హత లేదో వ్రాత పూర్వకంగా ఆయా లబ్ధిదారులకు అందజేయాలన్నారు . ఉపాధిహామీ నిధులతో జరుగుతున్న ఇండ్ల పట్టాల లేఅవుట్ పనులను పూర్తిగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చేయాలని దీనిపై సామాజిక తనిఖీ వుంటుందని లేఅవుట్ పనులపై క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్ దిశా దశ నిర్దేశం చేసారు . గృహ నిర్మాణంలో రాష్ట్రంలోని 13 జిల్లాలలో ఐదు జిల్లాలకు చెల్లిస్తున్న మొత్తాన్ని ఒక్క తూర్పు గోదావరి జిల్లాలోనే ప్రభుత్వం వెచ్చిస్తోందని , దీని ప్రాధాన్యతను గుర్తించి అధికారులు పని చేయాలన్నారు . తిరస్కరించిన ధరఖాస్తులను ఎందుకు తిరస్కరించింది రికార్డు చేయాలన్నారు . జగనన్నతోడు , ప్రధానమంత్రి స్వానిధి , వైఎస్ఆర్ భీమా , చేయూత లాంటి పధకాలు అమలులో బ్యాంకర్లు , సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు . బ్యాంక్ సిబ్బంది కంటే సచివాలయం సిబ్బంది ఎక్కువ మంది వున్నారని , సంక్షేమ పథకాలు అమలులో గ్రామ , వార్డు సచివాలయ సిబ్బంది పని తీరును నిరంతరం పర్యవేక్షిస్తూ పెండింగ్ ధరఖాస్తులను పరిష్కరించాలన్నారు . జగనన్న తోడు లాంటి పధకాలు అమలు వలన అసంఘటిత రంగంలో వున్న వారిని సంఘటిత రంగంలోనికి తీసుకొచ్చేందుకు ఎన్ని అవకాశాలు వున్నాయని కలెక్టర్ సంక్షేమ పథకాల అమలుపై అనేక సూచనలు చేశారు . వైఎస్ఆర్ చేయూత పథకంలో పశువుల పంపిణీలో లబ్ధిదారులకు లబ్ధి చేకూర్చే విధంగా బ్యాంకు సహాకారం తీసుకోవాలన్నారు.

కోడి పందాల్ని నియంత్రించాలి
—————————————-
జిల్లాలో ఏ ప్రాంతంలోను కోడి పందాలు జరగకుండా పగడ్బందీ చర్యలు చేపట్టాలని క్షేత్రస్థాయి అధికారులకు కలెక్టర్ ఆదేశించారు . కోడి పందాలు నిషేదంపై కోర్టు ఆదేశాలు వున్నాయని వీటిని పాటించే విధంగా అధికారులు పనిచేయాలన్నారు . మండల స్థాయి లోని తాహసిల్దార్ , ఎమ్పిడిఓ , పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ , పశువైద్యాధికారితో కలిసి సమన్వయంతో పనిచేయాలన్నారు . ఏ ప్రాంతంలో కోడి పందాలు జరుగుతున్నాయనేది ముందుగానే గుర్తించి అలాంటి చోట్ల కఠిన నిబంధనలు పాటించడం తో పాటు 144 సెక్షన్ అమలు పర్చాలని అధికారులను సూచించారు . ఈ నెల 7 వ తేదీ నుండి కోడిపందాల పై రోజు వారీ నివేదికలు అందించాలని కలెక్టర్ అధికారులకు పలు సూచనలు చేశారు.

జిల్లాలో ఈ నెల 7 నుండి భూముల రీ సర్వే
———————————————————-
జిల్లాలో ఈ నెల 7 వ తేదీ నుండి భూముల స్వచ్ఛతీకరణ సర్వే ( ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ సర్వే ) పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ తెలిపారు . దీనిపై డివిజన్ స్థాయిలో శిక్షణ తరగతి నిర్వహించాలన్నారు . ఇప్పటికే సర్వే బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందనీ వీరంతా శిక్షణ పొంది సర్వే పనులు చేపట్టే విధంగా ప్రణాళిభద్రంగా పనిచేయాలనే జేసి లక్ష్మీశ తెలిపారు . ఈ సమావేశంలో జెసిజి.రాజకుమారి ఎస్ఆర్ జి ఎస్ పనులు అమలు జరుగుతున్న తీరును వివరించారు . డిఆర్ఓ సి . హెచ్.సత్తిబాబు ఉపాధ్యాయ నియోజకవర్గాల ఓటర్ల జాబితా తయారీ పై పలు సూచనలు చేశారు . ఈ సమావేశంలో జెడ్.పి సిఇఓ ఎన్.వి.వి.సత్యనారాయణ , ఎస్.ఆర్ డబ్ల్యూఎస్ టి.గాయిత్రిదేవి , డిపిఓ నాగేశ్వర నాయక్ , పిడి హౌసింగ్ వీరేశ్వర ప్రసాద్ , సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *