* సుద్దగడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన
* నిర్మాణం పూర్తైతే ప్రజల కష్టాలు తీరినట్లే
* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఆశాభావం

ప్రత్తిపాడు –  తూర్పుగోదావరి
——————————————
సుద్దగడ్డ వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణం ద్వారా ప్రజల రవాణా సౌకర్యం సులభతరం ఔతుందని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి వెల్లడించారు. ప్రత్తిపాడు మండలంలో ప్రత్తిపాడు – లంపకలోవ రహదారి మధ్య రూ. 2.70 కోట్లతో నిర్మిస్తున్న సుద్దగడ్డ వాగు వంతెన నిర్మాణానికి ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, కాకినాడ పార్లమెంటు సభ్యురాలు వంగా గీతా విశ్వనాధ్ లతో కలిసి కలెక్టర్ మురళీధర్ రెడ్డి బుధవారం శంఖుస్థాపన చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో తుఫాను వల్ల సుద్దగడ్డ వాగు వరద నీటిని పరిశీలించానని, అప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉందని తెలిపారు. భారీ వర్షాలు కురిసి నపుడల్లా వాగు ఉదృతంగా ప్రవహించి ప్రాణ నష్టం, గ్రామాల్లోని ప్రజలు, రైతాంగం ఇబ్బందులు పడుతున్న తరుణంలో శాసన సభ్యులు చొరవతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించానన్నారు.  ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 2.70 కోట్లను మంజూరు చేసి, టెండర్ ప్రక్రియ పూర్తి చేసామని  తెలిపారు. మంచి కాంట్రాక్టర్ తో బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి సంవత్సరంలోపే పూర్తి చేసి, ప్రజా వినియోగంలోకి తెస్తామన్నారు. వాగు  సెంటిమెంట్ ను దృష్టిలో పెట్టుకొని సుద్ధగడ్డ వాగుకు ఈ పేరునే కొనసాగించాలని సూచించారు.
        ఎంపీ వంగా గీత మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా పనిచేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.  ఎన్నో ఏళ్ళుగా నిర్మాణానికి నోచుకోని సుద్ద గడ్డ వాగుపై వంతెన నిర్మాణానికి ఈ రోజు శంఖుస్థాపన చేయడం ఆనంద దాయకమని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత రాష్ట్ర ప్రభుత్వానిదని అన్నారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పాటు నియోజక వర్గంలో ప్రత్యేక క్వారంటైన్ హాస్పిటల్ ను ఏర్పాటుకు స్థానిక ఎమ్మెల్యే చేసిన కృషి అభినందనీయమని అన్నారు. జిల్లాలో ప్రజల సమస్యలకు తక్షణమే స్పందిండంలో జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమని అన్నారు.
        ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మాట్లాడుతూ నియోజక వర్గంలో తలమానికమైన సుద్ధగడ్డ వాగు వంతెన నిర్మాణానికి ఎమ్మెల్యేగా శంఖుస్థాపన చేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు వాగు పొంగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి స్వయంగా వాగును పరిశీలించి ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి వంతెన నిర్మాణానికి అనుమతిచ్చి 15 రోజుల్లోనే టెండర్ ప్రక్రియ పూర్తి చేసారని అన్నారు. ఈ వాగు వంతెనపై ఆధారపడ్డ రైతులు, ప్రజల తరపున వంతెనకు కలెక్టర్ మురళీధర్ రెడ్డి వారధిగా నామకరణం చేయడానికి అనుమతి ఇవ్వాలని  కలెక్టర్ ను ఎమ్మెల్యే కోరారు. ఈ సందేశాలకు ముందు బ్రిడ్జి నిర్మాణానికి కలెక్టర్, ఎంపీ, ఎమ్మెల్యే భూమి పూజ చేసి, శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆర్&బి ఎస్ ఇ పిడి విజయ్ కుమార్, డీఇఇ జె. నరసయ్య, జె ఇ ఇ ఎం. తాతారావు, తహశీల్దార్ పీవి వి గోపాల కృష్ణ, ఎంపిడివో డి.శ్రీలలిత, వైకాపా మండల కన్వీనర్ బెహరా దొరబాబు, మండల ప్రోగ్రాం మేనేజర్ రామిశెట్టి చిన్నబాబు, లంపకలోవ సొసైటీ చైర్మన్ గొంతిన సురేష్, ప్రజా ప్రతినిధులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *