* ప్రతి ఇంటికి మంచి నీటి  కుళాయి
* బోడసకుర్రు పాలెం ఇళ్ళ స్థలాల పట్టాల పంపిణీలో మంత్రి విశ్వరూప్

అమలాపురం – జనాసవార్త
————————————–
నవరత్నాలు_పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా నిరుపేదలకు ఇచ్చే ఇళ్ళ కాలనీలలో పూర్తి స్థాయిలో అన్ని మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ తెలియ చేసారు. గురువారం అల్లవరం మండలం బోడస కుర్రు పాలెం లో 311 మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాల పట్టాలను,ఇళ్ళ నిర్మాణానికి సంబంధించి ప్రొసీడింగ్స్ ను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ జగనన్న ఇళ్ళ కాలనీల లో  ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.ఈ రోజు ప్రతీ లబ్ధిదారుడికి పది లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థల పట్టాను ముఖ్య మంత్రి ఇవ్వడం జరిగిందని,ఇది కాకుండా ఇంటి నిర్మాణానికి లక్షా ఎనభై వేల రూపాయలు కూడా ముఖ్యమంత్రి ఇస్తున్నారని,పేదల కొరకు ఈవిధంగా చేసే ముఖ్యమంత్రి దేశంలోనే ఎవరూ లేరని మంత్రి కొనియాడారు.ఇంటి నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి మూడు ఆప్షన్లు ఇచ్చారని,మీరే కట్టుకుంటే ప్రభుత్వం లక్షా ఎనభై వేల రూపాయలు ఇస్తుందని, ఇది కాకుంటే లక్షా ఎనభై వేలల్లోను అతి తక్కువ ధరకు మెటీరియల్ ప్రభుత్వం సరఫరా చేసి మిగిలిన మొత్తాన్ని లబ్ధిదారుడికి ఇస్తుందని,అలాకూడా లబ్ధిదారుడు ఇల్లు కట్టు కోవచ్చునని, అదీకూడా కాకుంటే ప్రభుత్వమే పూర్తి ఉచితంగా ఇంటిని నిర్మించి ఇస్తుందని ఈ మూడింటి లో ఏ దైన లబ్ధిదారుడు ఎంపిక చేసుకోవచ్చునని మంత్రి తెలిపారు.జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చాక ప్రతి ఇంటిలో మూడు,నాలుగు సంక్షేమ పథకాలు ద్వారా కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని మంత్రి తెలియచేశారు.ప్రతీ ఇంటిలో వృద్ధురాలైన అత్తగారికి పెన్షన్, మావగారు రైతు అయితే రైతు భరోసా, కోడలికి చేయూత,పిల్లలకు అమ్మఒడి, ఇలా ప్రతిఒక్కరికీ ఏదోఒక పథకాన్ని ముఖ్య మంత్రి అందిస్తున్నారని మంత్రి తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ డి.మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ కోనసీమలో ప్రతీ అంగుళం భూమి ఎంతో విలువైనదని, ఇండ్ల స్థలాల పట్టాలకు భూ సేకరణ కష్టమని భావించామని, ఈ విషయంలో రైతులను ఒప్పించడం లో మాకు ఎంతో సహకారం అందించిన మంత్రికి ధన్యవాదాలు తెలుపు తున్నామని, అలాగే సహృదయంతో తమ భూములను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన రైతులందరికీ కూడా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. డబ్బు వున్న వారు తమ భూములను ఏవిధంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో అదే మాదిరిగా పేదలకు ఇచ్చే భూములను కూడా రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని, అయితే పేదలకు ఉచితంగా ఇచ్చిన భూమిని వారికి అమ్ముకునే హక్కు ఎలా కల్పిస్తారని కొంత మంది కోర్టుకు వెళ్ళారని, అయితే కోర్టు నుండి కూడా పేదలకు అనుకూలమైన ఆదేశాలు వస్తాయనే ఆశిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అనుకూలమైన ఆదేశాలు వచ్చిన వెంటనే అందరికీ పట్టాలు రిజిస్ట్రేషన్ చేస్తామని, అలాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా స్థానిక మండల తహశీల్దారు కార్యాలయంలోనే చేసే అవకాశం ముఖ్యమంత్రి కల్పించారని కలెక్టర్ తెలియ చేశారు.అలాగే ఇళ్ళ నిర్మానం కూడా ప్రభుత్వమే కట్టించాలని భావిస్తోందని,దీని వలన ప్రభుత్వం పైన పేదలకు నమ్మకాన్ని సూచిస్తుందని కలెక్టర్ తెలిపారు. అలాగే పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా లబ్ధిదారులకు వారి లే అవుట్ లలోనే చేయాలని ముఖ్యమంత్రి ఆదేశమని, అలాగే పూర్తి స్థాయిలో అభివృధ్ధి చేసిన లే అవుట్ లనే పేదలకు ఇవ్వాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశ్యమని కలెక్టర్ తెలిపారు. రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారులు వారి వారి ప్లాట్లలో నిలబడితే సచివాలయ సిబ్బంది వచ్చి  ఫోటో తీసుకుని జియోటాగింగ్ చేసి అప్ లోడ్ చేస్తారని కలెక్టర్ అన్నారు. ఇంటి నిర్మాణంలో కూడా మిమ్ములను తప్పు దోవ పట్టించే వారు ఉంటారని, ఎవరి మాటలు నమ్మవద్దని కలెక్టర్ హితవు పలికారు. ప్రతీ లే అవుట్ లోను మోడల్ హౌస్ కడతామని అదే మాదిరిగా నాణ్యతతో లబ్ధిదారులకు ఇళ్లు నిర్మించి ఇస్తామని, నాణ్యత లేకపోతే ఏ అధికారినైనా లబ్ధిదారులు నిలదీయ వచ్చునని కలెక్టర్ తెలియ చేసారు. అలాగే ప్రతీ లే అవుట్ లోను విస్తీర్ణాన్ని బట్టి సి.సి.రోడ్లు, వీధి లైట్లు, పార్కులు, డ్రెయిన్లు, ప్రతీ ఇంటికి కుళాయి వంటి మౌలిక వసతులు కల్పిస్తామని, పెద్ద లే అవుట్ అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు. పెద్ద లే అవుట్లలో రైతు భరోసా కేంద్రం, సచివాలయ నిర్మాణం కూడా నిర్మిస్తామని కలెక్టర్ తెలిపారు. అమలాపురం సబ్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్ మాట్లాడుతూ అమలాపురం డివిజన్ లో ఇళ్లు లేని నిరుపేదల కొరకు ఒక వెయ్యి ఇరవై ఎనిమిది ఎకరాలలోని లే అవుట్ లలో ప్లాట్లు తయారు చేసి పట్టాలు ఇస్తున్నామని, బోడసకుర్రు పాలెం లో 8.08 ఎకరాల్లో 311 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇస్తున్నామని సబ్ కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మూడు ఆప్షన్లలోను లబ్ధిదారులు తమకు నచ్చిన ఆప్షన్ ను వాలంటీర్లకు తెలపాలని సబ్ కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అమలాపురం  డిఎస్పీ వై.మాధవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొక్కా ఆదినారాయణ,ఇళ్ళ శేషారావు,సాధనాల వెంకటరావు,చెల్లు బోయిన శ్రీనివాస్, దొమ్మెటి శ్యామ్ ప్రకాష్, బొమ్మి ఇజ్రాయేల్,జంపన రమేష్ రాజు, కొనుకు బాపూజీ,అడపా శ్రీను,అల్లవరం మండల తహసీల్దార్ ఎస్.అప్పారావు, ఎం.పి.డి.ఓ. ఎం. ఎం.రాఘవులు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం లో స్థలాన్ని విక్రయించిన పేరి విశ్వనాథ శర్మ ను మంత్రి,జిల్లా కలెక్టర్ సన్మానించారు.ముందుగా లే అవుట్ లో లబ్ధిదారుడు నాగాబత్తుల దుర్గాభవాని ఇంటికి మంత్రి శంఖుస్థాపన చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *