* కార్య రంగంలోకి దిగిన కార్యదర్శులు
* కత్తిపూడి, శంఖవరంలో పోటా పోటీ

శంఖవరం – తూర్పుగోదావరి
———————————————-
గ్రామాల్లో సంపూర్ణ పారిశుద్ధ్యం నిర్వహణా లక్ష్య  సాధన ఓ అందమైన ఆశయం. నిరంతర సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణ నిరంతర ప్రక్రియ. ఇది ఎడతెగని ఓ అనంత పరిశ్రమ. అయినా సంపూర్ణ పారిశుద్ధ్య నిర్వహణా పర్యవేక్షకులను పక్కన బెట్టి సాక్షాత్తూ పంచాయితీ కార్యదర్శులే కార్యరంగంలోకి దిగడం, పారిశుద్ధ్య పనుల వద్ద కార్యదర్శులు దగ్గరుండి స్వయంగా పర్యవేక్షించడం చెత్త నిర్వహణపై వారికి ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనం. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కత్తిపూడి మేజర్ పంచాయితీ కార్యదర్శి కే.బులివీరన్న , శంఖవరం మేజర్ పంచాయితీ కార్యదర్శి శ్రీరామచంద్రమూర్తి వేర్వేరుగా వారి పంచాయితీల్లోని మేజర్ పారిశుద్ధ్య సమస్యలపై శనివారం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఉదయాన్నే పంచాయితీకి చేరుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఈ దినం పారిశుధ్య నిర్వహణఫై దిశా నిర్దేశం చేసారు.

గ్రామంలోని ప్రధాన వీధులు, రోడ్లు, కూడళ్లలో చెత్తా చెదారాన్ని ఊడ్చిన తర్వాత ప్రధాన మురికి కాల్వల పూడిక తీతపై పని గట్టుకుని దృష్టి నిలిపారు. 25 / 30 సంవత్సరాల నుంచి మురుగు, మట్టితో నిండిన కాలువల పని పట్టారు. మొల లోతు నిండిన మురుగు కాలుల వధ్దే నిలుచుని ఉండి పోయి సమస్య అంతు చూసారు. కాలువల్లో పేరుకు పోయిన చెత్తా చెదారాన్ని, మురుగు నీటిని కాలువల నుంచి బయటకు తీయించారు. దాన్నంతటినీ రోడ్లపై వేయించి కొంచెం ఆరుదల అయ్యాక పంచాయితీ చెత్త సేకరణా ట్రాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్లకు ఆ చెత్తను తరలించారు. తమ పాలనకు ముందు ఎన్నో  ఏళ్ళుగా ఎందరో కార్యదర్శులు పాలనలో పూడుకు పోయిన మురుగు కాలువలకు మోక్షం కలిగించారు. ఏళ్ళూ పూళ్ళూగా స్థంభించిన మురుగు నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించారు. శంఖవరం పంచాయితీ పారిశుధ్య కార్మికులు సరిపోక ధర్మవరం నుంచి కొంత మంది పారిశుద్ధ్య కార్మికులను కూలీకి శంఖవరం తీసుకు వచ్చిన వారితో పని చేయించారు. ఈ రెండు పంచాయితీల కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి నేడు సాగించిన సమరాన్ని గ్రామస్థులు మెచ్చుకోకుండా ఉండలేక పోయారు. నేటి పారిశుద్ధ్య నిర్వహణను కొందరు ప్రజలు ప్రేక్షకుల్లా తదేకంగా చూస్తూండి  పోయారు. నిత్యం ఇదే దీక్షతో అందరు కార్యదర్శులూ తమ పని తాము చేస్తూ పారిశుద్ధ్య కార్మికులతో పని చేయిస్తూంటే మహాత్మా సంపూర్ణ గ్రామీణ పారిశుద్ధ్య కల నెరవేరదా మరి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *