* ప్రాణహాని, కాలుష్య కారక దివిస్ వద్దు
* ప్రజల పక్షాన గళం వినిపించేందుకే వచ్చా
* వలస పాకల సభలో జనసేన అధ్యక్షుడు పవన్

వలస పాకలు – తూర్పుగోదావరి
———————————————-
దివీస్ లేబరేటరీస్ ఫార్మసీ కంపెనీ వల్ల ఏర్పడ బోయే కాలుష్య ప్రభావిత ప్రాంత ప్రజల పక్షాన జనసేన పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. దివిస్ కు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తూన్న బాధిత ప్రజల పక్షాన నిలిచి వారి గొంతులో తన గొంతు కలిపి వారి గోడును బాహ్య ప్రపంచానికి వినిపించడానికే వచ్చానని ఆయన పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా తుని శాసనసభ నియోజకవర్గం తొండంగి మండలం దానవాయిపేట పంచాయతీ వలస పాకల గ్రామంలో శనివారం సాయంత్రం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. దీనికి ముందు దివిస్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు చేపట్టిన నిరంతర నిరసన ఉద్యమంలో అరెస్టయిన 36 మంది కుటుంబ సభ్యులను, 27 గ్రామాల ప్రజల్లో మనోధైర్యం నింపడానికి, బాధిత కుటుంబాలను పరామర్శించడానికి ఆయన విచ్చేశారు . రైతుల పొట్ట కొట్టే విధంగా దివిస్ కు 690 ఎకరాల భూమి అవసరమా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దివిస్ వలన ప్రభావితం అయ్యే ప్రజానీకం 1.20 లక్షల మంది ఉంటే వారందరినీ కాదని ఫ్యాక్టరీ స్వలాభం కోసం కేవలం 100 మందితో గ్రామ సభను నిర్వహించి ఫ్యాక్టరీ అనుకూల తీర్మానాలు చేయించుకోవాలి కోడం ఎంత వరకూ సబబు అన్నారు. వారసత్వంగా కోసం ఆస్తిని ఇవ్వగలం గాని ఆరోగ్యాన్ని ఇవ్వగలమా…? ఆలోచించండి అంటూ ప్రజలకు హితోపదేశం చేశారు. పరిశ్రమలు అవసరమే… నేను పారిశ్రామి కీకరణను కోరుకునే వ్యక్తినే, తమ పార్టీ ఫ్యాక్టరీలకు వ్యతిరేకం కాదనీ, కానీ ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బ కాలుష్య కారక అభివృద్ధికి తాము వ్యతిరేకం అని పేర్కొన్నారు. దివిస్ పరిసర మత్స్య సంపదకు ఎటువంటి నష్టం జరగదని, ప్రజలకు ఎటువంటి వ్యాధులు రావని రాంకీ సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి చెప్పగలరా అని సవాల్ విసిరారు. ఏది ఏమైనా బాధిత ప్రజల పక్షాన జనసేన ఉంటుందని అన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే పరిశ్రమలు వద్దని, ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపా డాల్సిన బాధ్యత ప్రభుత్వా నిదేనని జనసేనాధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాలుష్యం దృష్ట్యా దివిస్ పరిశ్రమను వద్దని గతంలో ప్రతిపక్షంలో మీరే (జగన్) డిమాండు చేశారు. అలాంటి పరిశ్రమలకు ఇప్పుడు మీరే ముఖ్యమంత్రిగా అనుమతులను ఇస్తున్నారు ?. దివిస్ పరిశ్రమ నుంచి పెద్ద మొత్తంలో కాలుష్య జలాలు వస్తాయి. వీటివల్ల సముద్ర జీవులు చనిపోతాయి. కాలుష్య జలాల శుద్ధిని ప్రోత్సహించాలి. కానీ అందుకు విరుద్ధంగా మీ లాభాల వేటలో పేద ప్రజలను రోడ్డు పైకి ఈడుస్తున్నారు ” అని పవన్ మండి పడ్డారు.

దివీస్ ఫ్యాక్టరీతో అన్నీ ఇబ్బందులే
—————————————————-
కష్ట పడి పని చేసి పిల్లలకు ఏమైనా ఇవ్వొచ్చని, కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వగలమా ? అని పవన్ ప్రశ్నించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందన్నారు. ” అనేక మంది రైతుల నుంచి 690 ఎకరాలు
భూములను తీసుకొని పరిశ్రమలు పెట్టారు. కానీ దివిస్ పరిశ్రమ ప్రజలకు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని ? దివీస్లో మొత్తం 1,500 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయి. కాలుష్య పరిశ్రమలను తెస్తే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి ? సామాజిక ప్రభావ అంచనా వేయకుండా పరిశ్రమలకు భూములను ఇస్తారా ? వైసీపీకి చెందిన రాంకీ సంస్థతో అంచనా వేయించారు. దివీస్ పరిశ్రమ కాలుష్యం మత్స్య సంపదను నాశనం చేయదని, కాలుష్యం వల్ల ప్రజలకు ఎలాంటి వ్యాధులూ రావని హామీ ఇవ్వాలి ” అని పవన్ డిమాండు చేశారు. మన దేశంలో పర్యావరణ చట్టాలు చాలా బలహీనంగా ఉన్నాయని, ఇంత కాలుష్యం వెదజల్లుతుంటే పీసీబీలు ఏం చేస్తున్నాయని పవన్ ప్రశ్నించారు . కాలుష్యం వల్ల వచ్చే వ్యాధులకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. “ వ్యాధులు లేని సమాజాన్ని కోరుకుంటున్నాం. దివిస్ పరిశ్రమ వల్ల విపరీతమైన కాలుష్యం వస్తుంది. కాలుష్య జలాలు రావని దివిస్ యాజమాన్యం హామీ ఇవ్వగలదా ? ” అని పవన్ ప్రశ్నించారు.

రాజకీయులకు విలువలను ప్రజలే నేర్పాలి
———————————————————-
నేను కులం, కుటుంబ రాజకీయాలు చేయను… నేటి రాజకీయ నాయకులకు రాజకీయ విలువలను ప్రజలే నేర్పాలని పవన్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విధానాలు సరిగా లేనప్పుడే ప్రశ్నిస్తామని, మార్పు కోసం ప్రశ్నించ డానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. సిద్ధాంతాలతోనే రాజకీయాలు చేస్తామని, సిద్ధాంతాల కోసమే పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు నోటి కొచ్చినట్లు మాట్లాడు తున్నారని, తాను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాటలు తూలనని పేర్కొన్నారు. తల్లి దండ్రులు తనను సంస్కార వంతంగా పెంచారని ఆయన అన్నారు. వందలు, వేల కోట్లు సంపాదిస్తే నాయకులు సుఖంగా ఉంటారా ? అని ప్రశ్నించారు. ప్రజలు తనకు ఓటు వేయకున్నా సైద్ధాంతిక బలంతోనే నిలబడ్డానని అన్నారు . తనకు ఆస్తులు, అధికారాలు అక్కర్లేదని, ప్రజల కోసం పని చేస్తానని తెలిపారు. పవన్ కు ముందు రాష్ట్ర అధికార ప్రతినిధులు సుందరపు విజయ్ కుమార్, పోతుల మహేష్ పంతం నానాజీ, నాదెండ్ల మనోహర్, ఆయా నియోజక వర్గాల ఇన్చార్జిలు మర్రి రెడ్డి శ్రీనివాస్, రాయపూడి చిన్న , చంద్రశేఖర్, బండారు శ్రీనివాసరావు, తమ్మయ్య బాబు, యశస్విని, బొలిశెట్టి శ్రీనివాస్, నాయకర్, కోళ్ల తాతారావు, గంటా స్వరూప తదితరులు ప్రసంగించారు. బహిరంగ సభకు ముందు అన్నవరం నుంచి పవన్ కళ్యాణ్ భారీ మోటార్ సైకిల్ ర్యాలీతో జనసేన అభిమానులు తోడ్కొని తీసుకువచ్చారు. వలస పాకల వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేశారు . అనంతరం పోలీసులు అరెస్ట్ చేసిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, ఫ్యాక్టరీ వల్ల ఎటువంటి కాలుష్యం కారణం అవుతుందో అడిగి తెలుసుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *