అమరావతి – జనాసవార్త
—————————————–
మరుగున పడిపోయిన ఓ పాత హీరోయిన్ పేరు మళ్ళీ వినిపిస్తోంది. ఆమె తెలుగులో ఒకప్పుడు పాపులర్ హీరోయిన్. మెగాస్టార్ తోనూ నటించింది. చిరంజీవితో కలిసి నటించిన ఓ సినిమాలో జనాలను ఉర్రుతలూగించే ఓ వానపాట ఉంది. మాస్ భాషలో చెప్పుకోవాలంటే ఆ పాటలో ఈ హీరోయిన్ అందాలు ఆరబోసి ఇరగదీసేసింది. ఈ పాటకు ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు.

స్వేచ్ఛగా అందాల విందు చేస్తుందని ఈ హీరోయిన్ కు అప్పట్లో పేరుండేది. ఈమె పేరు మళ్ళీ వినిపిస్తున్నది సినిమా రంగంలో కాదు. రాజకీయ రంగంలో. ఫోటో చూస్తుంటే ఈ హీరోయిన్ ఎవరో గుర్తుకొస్తోందా? ఎస్ … ఆమె వాణీ విశ్వనాథ్. కొన్నేళ్ల కిందట ఈమె పేరు తెలుగు రాజకీయాల్లో జోరుగా వినిపించింది. కానీ ఆ తరువాత మరుగున పడిపోయింది. ఆమె పేరును మళ్ళీ ఇప్పుడు బీజేపీ నాయకులు బయటకు తీశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని నగరి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్ పర్సన్ ఆర్కే రోజా సెల్వమణికి గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రతిపక్ష బీజేపీ భారీ ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికనే ముహూర్తంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది.

తిరుపతి ఉప ఎన్నిక నిర్వహించే సమయానికి నగరిలో ఫైర్ బ్రాండ్ హీరోయిన్ వాణీ విశ్వనాథ్ ను బరిలోకి దింపటానికి బీజేపీ నేతలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.ఆమెను బీజేపీలోకి తీసుకొచ్చి.. రోజాకు పోటీగా మరో మహిళా ఫైర్ బ్రాండ్ లీడర్‌గా ప్రొజెక్ట్ చేయాలని బీజేపీ నేతలు ప్లాన్ చేసినట్టు కమలదళంలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కొందరు బీజేపీ నేతలు ఆమెతో చర్చించినట్టు చెబుతున్నారు.

అన్నీ కుదిరితే తిరుపతి ఉప ఎన్నిక సమయానికి వాణీ విశ్వనాథ్ కాషాయ కండువా కప్పుకోవడం ఖాయంగా తెలుస్తోంది. తిరుపతి ఉప ఎన్నిక జరిగే సమయంలో జిల్లాకు చెందిన వైసీపీలో ముఖ్య నేత అయిన రోజా తప్పకుండా ప్రచారం చేస్తుంది. రోజా ప్రచారం చేసిన అన్ని చోట్లా వాణీవిశ్వనాథ్‌తో కూడా కౌంటర్ ప్రచారం చేయించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

ఏపీలో బీజేపీకి సినీ గ్లామర్ తీసుకు రావాలని ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగమే వాణీ విశ్వనాథ్ గురించిన ఆలోచన. పార్టీలో తగిన ప్రాధాన్యం ఇస్తామని ఆమెకు భరోసా ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటి నుంచే బరిలో ఉంటే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి రోజా మీద పోటీ చేసే అవకాశం కల్పిస్తామని కూడా చెప్పినట్టు తెలిసింది. నగరి నుంచి రోజా రెండుసార్లు గెలిచిన సంగతి తెలిసిందే కదా. 2019లోనే వాణి విశ్వనాథ్ టీడీపీలో చేరుతుందని ప్రచారం జరిగింది.

నగరిలో ఆమె రోజా మీద పోటీ చేస్తుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఎన్నికల్లో టికెట్ రాకపోవడంతో ఆమె పోటీ చేయలేదు. వాస్తవానికి వాణీ విశ్వనాథ్ 2017 లోనే తెలుగుదేశం పార్టీలో చేరింది. ఏ కారణం వల్లనో చంద్రబాబు నాయుడు ఆమెను పట్టించుకోలేదు.

దీంతో ఆమె టీడీపీ రాజకీయాలను వదిలేసి చెన్నై వెళ్ళిపోయింది. ఇప్పుడు నగరి టికెట్ ఇస్తామంటూ వాణి విశ్వనాథ్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు బీజేపీ నేతలు. అయితే, వాణీ విశ్వనాథ్ గతంలో వచ్చి ఓ మెరుపు మెరిసి వెళ్లిపోయిందని ఇప్పుడు మరోసారి ఆమె రావడం వల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ఉండదని నగరిలో వైసీపీ నేతలు చెబుతున్నారు.

ఈ తరంవారికి వాణీ విశ్వనాథ్ ఎవరో అంతగా తెలియదు. ఆమె తెలుగు సినిమా రంగంలోనూ టచ్ లో లేదు. ఆమెకు ఇప్పుడు తెలుగు రాజకీయాల పట్ల అవగాహన ఉందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు యాభై ఏళ్ళ వయసులో ఉన్న వాణీ విశ్వనాథ్ రోజా అంత స్పీడుగా ఉంటుందా ? ఆమె రాజకీయాల్లో కొనసాగివుంటే ఆమె ఎంతటి ఫైర్ బ్రాండో అర్థమయ్యేది. బీజేపీ నాయకులు మలయాళీ వాణీ విశ్వనాథ్ గురించి ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు. తెలుగోళ్లు దొరకలేదా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *