★ బుద్ధుడు ముద్దాడిన తెలుగు నేల కొడవలి
★ ఈ బౌద్ధారామానికి పురావస్తు శాఖ సొగసులు

(జర్నలిస్ట్ మూర్తి)

కొడవలి – తూర్పుగోదావరి
————————————–
2000 సంవత్సరాలు పాటు రాజ్య మేలిన బౌద్ధం ఆనవాళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగులా ఉన్నాయి. “బుద్ధం శరణం గచ్ఛామి’ అన్న నినాదం ఈ ప్రాంతంలో నాడు నిత్యం ప్రతిధ్వనించింది. అశోకుడు నిర్మించిన 84,000 బౌద్ధ స్థూపాల్లో “కొడవలి” ఒకటని ప్రతీతి. ఆంధ్రదేశ రాష్ట్ర చరిత్రలోనే గాక దక్షిణ భారతదేశ చరిత్రలోనే శాతవాహన యుగం ఒక మహోజ్వల ఘట్టం. 3 వ శతాబ్దానికి చెందిన శాతవాహనుల కాలం నాటి బౌద్ధా రామాలు చెరిగిపోతున్న అనవాళ్లు నేటికీ మనకు తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలోని “కొడవలి’ గ్రామంలో కనిపిస్తున్నాయి.

ఒకప్పుడు కొడవలి ఈ పరిసర ప్రాంతాలకు బౌద్ధరామ కూడలిగా ఉండేది. నాడు “ఖడ్గవల్లి”గా పిలిచే ఈ గ్రామం కొన్నేళ్లు వాడుకలో “కడ్వలి” గా ప్రాచుర్యం పొంది (పిలువబడి) నేడు “కొడవలి’ గా నామాంతరం చెంది స్థిరపడింది. కొడవలి బౌద్ధారామాన్ని 3 వ శతాబ్దానికి చెందినదిగా
చరిత్రకారులు భావిస్తారు. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతం స్థిరపడి వున్నది. బౌద్ధ యుగం స్వర్ణ యుగంగా వర్దిల్లింది. శాతవాహన రాజులలో చివరి వాడైన గౌతమీ పుత్ర యజ్ఞశ్రీ శాతకర్ణి కొడవలి బౌద్ధ రామాన్ని నిర్మించి బౌద్ధులకు ఇక్కడ ఆశ్రయం కల్పించాడని తెలుస్తోంది. గౌతమ బుద్ధుడు కుశి నగరంలో నిర్యాణం పొందిన తరువాత ఆయన అస్థికలతో దేశం నలుమూలలా అనేక బౌద్ధ స్థూపాలను నిర్మించాడు.

ఈ స్థూపాలను రాతి తోను, ఇటుకలతోను, ఇటుక, మట్టి మిశ్రమంతోనూ నిర్మించారు. స్థానికులు ఈ స్థూపాన్ని “ధనందిబ్బ” గా పిలుస్తారు. కొండపై బౌద్ధ స్థూపంతో పాటు బౌద్ధ మత చిహ్నాలు అనేకం ఉన్నాయి. ఒక గోడపై ప్రాకృత భాషలో రాయబడిన శిలాశాసనం ఉంది. ఒకప్పుడు స్వదేశీ, విదేశీ యాత్రికులతో కళకళ లాడిన ‘కొడవలి” బౌద్ధారామాలకు పురావస్తుశాఖ ఇటీవల కాలంలో అభివృద్ధి పనులు చేపట్టింది. బౌద్ధ స్థూపాలు, విహార సముదాయం, చైత్యాలు వెలుగు చూడటంతో పర్యాటక కేంద్రంగా చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

కొడవలి బౌద్ధ స్థూపం గుండ్రని మట్టి దిబ్బ. చుట్టూ రాతి కట్టడం అందులో బుద్ధుని భౌతికావశేషం ఉంటుంది. స్థూపాలు బౌద్ధులకు పవిత్ర స్థలాలు. ఈ స్థూపాలలో పారిభోగిక, ఉద్దేశిత, శారీరక అనేక రకాలు ఉన్నాయి. ఇక్కడ క్రింది దశలో మొక్కుబడి స్థూపాలు ఐదు ఉన్నాయి. ప్రార్దనా మందిరాలు ఉన్నాయి. ప్రాచీన రాళ్లు ఇక్కడ పడి ఉండటాన్ని గమనించ వచ్చు. బౌద్ధ బిక్షువులు ధ్యానం చేసుకునేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు అనువుగా నిర్మించినవే
ఈ బౌద్ధ ఆరామాలు / విహారాలు. ఈ విహారాల్లో చర్చలు, గోష్ఠులు విరివిగా నాడు జరుగు తుండేవి. ఇవి నాడు నివాస యోగ్యంగా కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనకు నేల మట్టంలో రాతి నుయ్యిలు ఇక్కడ కన్పిస్తాయి. వీటిపై పూర్తి ఆకారాలను తీసుకు రావడానికి పురావస్తు శాఖ కృషి చేస్తున్నది.

నీటిని ఇచట నిల్వ ఉంచడానికి పెద్ద పెద్ద నాలుగు రాతి తొట్టెలను తొలిచారు. ఒక్కొక్కటి సుమారు ఆరడుగులు లోతు ఉండవచ్చును. ఎప్పటికీ ఆరిపోకుండా నీరు లభ్యం కావడం విశేషం. ఇక్కడ బయట పడిన బుద్దుని ఆస్థికలు గల కరండం హైదరాబాద్ మ్యూజియంలో ఉంది. ఆచార్య నాగార్జునుడు ఈ బౌద్ధరామాన్ని దర్శించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ కొడవలి బౌద్ధ స్థూపం ప్రాంతం ప్రస్తుతం కేంద్ర పురావస్తు శాఖ అధీనంలో ఉన్నది. చరిత్రకారులు, బౌద్ధులతో పాటు విదేశీయులు సైతం కొడవలిలోని బౌద్ధారామాన్ని అప్పుడప్పుడు సందర్శిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *