* జనంతో కిక్కిరిసిన రౌతులపూడి
* అమ్మ ఒడి సభకు కదం తొక్కిన పల్లెలు

    (సభా ప్రాంగణం నుంచి జనాస)
   
రౌతులపూడి – తూర్పుగోదావరి
——————————————–
జనం…  మహా జనం… జన ప్రభంజనం… జన సంద్రం … కొన్ని ఊళ్ళ జనం ఓ ఊరు కూడలిలో సమావేశమైతే అది జనసంద్రం కాక మరే మవుతుంది… తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రౌతులపూడిలోని స్థానిక నవదుర్గాదేవి ఆలయం వెనుక సోమవారం ఏర్పాటు చేసిన అమ్మ ఒడి బహిరంగ సభ అశేష జనవాహినితో నిండి పోయింది. సభకు జనంపోటు వన్నె తెచ్చింది.

జన ప్రదర్శన పాదయాత్ర
————————————-
నేతలందరికీ రౌతులపూడి సచివాలయం ప్రాంతం నుంచి స్థానిక ప్రలు అపూర్వ ఘన స్వాగతం పలికారు. వీరంతా సభా వేదిక నుంచి నాయక గణంనకు ఎదురేగి వెళ్ళి సభా స్థలికి సాదరంగా తోడ్కొని వచ్చారు. మార్గం మధ్యలో నేతలను గజ మాటలతో ముంచెత్తారు. మార్గం పొడవునా నేతల తలలపై పుష్ప రేఖల వర్షాన్ని హర్షంతో కురిపించారు. నేతలను పూలపై నడిపించారు. భూమి పురుడు పోసుకుందా అన్నట్లు ఇసుక వేస్తే రాలనంతగా అశేష జన వాహినితో సభా స్థలి,  వేదిక కూడా కిక్కిరిసి పోయింది. నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆహూతుల కోసం సచివాలయం ముందు అల్పాహారం, తేనీటీ, తాగు నీటి విడిదిని ఏర్పాటు చేసారు.

జానపద సాంస్కృతిక కను విందు
———————————————–
సభ ప్రారంభంలో సభా వేదిక పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన హోరు సభకు జోరు తెచ్చింది. జనపదాల తల్లి ఒడీలో ఓ నాడు అపూర్వ జనాదరణ పొందిన జానపద కళాత్మక నృత్యాలు సభా వేదికపై ఈ సందర్భంగా తళుక్కున మెరిసాయి. ఇప్పటి వరకూ బడులకే పరిమితమైన విద్యార్థుల్లో షిరిడీ కృతమైన కళా ప్రదర్శన తృష్ణ ఒక్కసారిగా వేదికపై ఆవిష్కృతమైంది. జానపద గాన బాణీలకు విద్యార్థుల నృత్య ప్రదర్శనా భంగిమలు సభికులకు కనువిందు చేసాయి. విద్యార్థులు లయ బద్దంగా నృత్యం చేస్తూ హొయలు పోతూ తళుకులీనారు. ఔరా ….! ఈ చిన్నారుల్లో ఇంత కళా ప్రతిభ ఉందాని ప్రేక్షకులు అబ్బుర పడేలా రక్తి కట్టించారు. బాలికలు అచ్చ తెలుగు పదహారణాల ఆడపడుచుల్లా… పల్లె ఎంకిలా… ఏకరూపతా రవికెలు, చీర కట్టులో ఆరితేరిన నృత్య కళాకారిణిలుగా ఆహార్యం, ఆంగికం, నృత్య కళా భంగిమల్లో ఒదిగి పోయి నాట్య రారాజు నటరాజు నాట్యాన్ని మైమరపించారు. ఆహూతులను నృత్యంతో రంజింప చేసారు. ప్రభుత్వ బడుల విద్యా విద్యార్థులా…. మజాకా అనిపించించారు. చిరంజీవులారా సుఖీభవ అన్నట్లు నేతల ఆశీస్సులు పొందారు. 

నవరత్నాల పంపిణీ ఓ పండుగ
——————————————-  
నవరత్నాలు, అమ్మ ఒడి పధకాల లబ్ది పంపిణీ కార్యక్రమాలు ఓ పండుగ వాతావరణంలో  జరుగు తున్నాయి. సంక్రాంతి సంబరాలను మరపిస్తున్నాయి. విశాలమైన మైదాన ప్రాంగణాలను సభావేదికలుగా ఎంపిక చేసి సువిశాలమైన షామియాలతో భారీ సెట్టింగులతో సభాప్రాంగణాలను అత్యంత వైభవంగా తీర్చి దిద్దుతున్నారు. ఖర్చుకు వెనుకాడడంలేదు. పెద్ద ఎత్తున జరిగిన జన సమీకరణను చూసి వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి అలమండ చలమయ్య ఈ అశేష జన వాహినిని చూసి ప్రత్తిపాడు నియోజక వర్గం రౌతులపూడిలో ఇంత భారీ జనసభ ఇంతకు ముందు ఎన్నడూ జరగలేదని సభా వేదికపై వ్యాఖ్యానించడం ఓ కొస మెరుపు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *