* కలెక్టర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి

కాకినాడ – తూర్పుగోదావరి
—————————————–
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో ప్రతి ఒక్కరికీ కోవిడ్-19 టీకాలు వేయనున్నట్లు కలెక్టర్ డి.మురళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. కాకినాడ జీజీహెచ్ పీపీ యూనిట్లో ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్ని, టీకా పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖ‌ర్‌రెడ్డి, జేసీ. డా. జి.లక్ష్మీశ తదితరులతో కలిసి కలెక్టర్ శనివారం
ప్రారంభించారు. టీకా కేంద్రంలో తొలి కోవిడ్ టీకాను జీజీహెచ్ పీపీ యూనిట్ ఆరోగ్య కార్త‌క‌ర్త రెడ్డి స‌త్య‌వ‌తికి వేశారు. రెండో ల‌బ్ధిదారుగా రంగ‌రాయ మెడిక‌ల్ కాలేజీ ప్రిన్సిప‌ల్ డాక్ట‌ర్ కె.బాబ్జీ టీకాను తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 33 కేంద్రాల ద్వారా 19 నియోజక వర్గాల్లో వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ జరుగు తోందన్నారు. తొలి దశలో వైద్య, ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితర దాదాపు 34 వేల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో దశలో పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది, సచివాలయ సిబ్బందికి టీకా వేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రక్రియ కోసం 190 టీకా కేంద్రాల్లో డ్రై రన్ చేప‌ట్టా మ‌న్నారు. మూడో దశలో 50 ఏళ్లకు పైబడిన వారికి, నిబంధ‌న‌ల మేర‌కు ఇత‌రుల‌కు టీకాలను గ్రామం, వార్డు,  సచివాలయం యూనిట్‌గా పంపిణీ చేస్తాము అన్నారు. టీకా ఇవ్వడమనేది ఒకట్రెండు రోజులకు ముగిసి పోయేది కాదని, దశల వారీగా అందరికీ టీకాలు అందిస్తామని స్ప‌ష్టం చేశారు. టీకాకు సంబంధించిన అపోహలను నమ్మవద్దని, సోషల్ మీడియాలోని వదంతులను పట్టించు కోవద్దని సూచించారు. టీకా వేశాక ఏవైనా దుష్పరిణామాలు ఎదురైతే తక్షణం సేవలందించేందుకు తక్షణ సహాయక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా అందుబాటులో ఉందని కలెక్టర్ వెల్లడించారు.

సిబ్బంది సేవలు మరువలేనివి : వంగా గీత
————————————————————
ప్రపంచాన్నే గడగడలాడించిన కోవిడ్ సమయంలో వైద్య, ఆరోగ్య సిబ్బంది అందించిన సేవలు చిరస్మరణీయమని కాకినాడ ఎంపీ వంగా గీత పేర్కొన్నారు. ఎక్కడా రాజీ పడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహ‌న్‌రెడ్డి కృషి చేశారన్నారు. మిగిలిన రాష్ట్రాలతో పోల్చితే ఒక అడుగు ముందే ఉండి, ప్రజల ఆరోగ్యం కోసం తాపత్రయ పడినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి, కోవిడ్‌ను ఎదుర్కొన్న‌ట్లు పేర్కొన్నారు. క‌లెక్ట‌ర్ నేతృత్వంలో జిల్లా యంత్రాంగం మొత్తం కోవిడ్ స‌మ‌యంలో విశేష సేవ‌లందించింద‌ని కాకినాడ అర్బ‌న్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్క‌డా లేని విధంగా ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రాష్ట్రంలో కోటికి పైగా క‌రోనా ప‌రీక్ష‌లు చేయించార‌న్నారు. పొరుగు రాష్ట్రాల‌తో పోల్చితే ఇక్క‌డి ప్ర‌జ‌లు భ‌య‌ప‌డ‌ న‌వ‌స‌రం లేద‌ని, త‌మ‌ను బాగా చూసు కునేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఉన్నార‌నే ధైర్యం క‌నిపించింద‌ని పేర్కొన్నారు. ద‌శ‌ల వారీగా రెండు మూడు నెలల్లో రాష్ట్రంలో అంద‌రికీ కోవిడ్ టీకా అందుతుంద‌ని తెలిపారు.

టీకా పూర్తి సుర‌క్షితం
——————————
దేశ వ్యాప్తంగా రీకాంబినెంట్ ర‌కం వ్యాక్సిన్‌ను పంపిణీ చేస్తున్నార‌ని, ఈ కోవిడ్ టీకా పూర్తిగా సుర‌క్షిత‌ మైంద‌ని జీజీహెచ్ సూప‌రింటెండెంట్ డాక్ట‌ర్ ఎం.రాఘ‌వేంద్ర‌రావు తెలిపారు. తొలి డోసు వేసుకున్నాక మ‌ళ్లీ 28వ రోజున రెండో డోసు వేసుకోవాల్సి ఉంటుంద‌న్నారు. దీనికి 14 రోజుల త‌ర్వాత ఇమ్యూనిటీ వ‌స్తోంద‌ని వివ‌రించారు. అందువ‌ల్ల వ్యాక్సిన్ వేసుకున్న ప్ర‌తి ఒక్క‌రూ 42 రోజుల పాటు మాస్కు ధ‌రించ‌డం, చేతులు శుభ్రం చేసుకోవ‌డం, సోష‌ల్ డిస్టెన్స్ పాటించ‌డం వంటి జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాలి అ‌న్నారు. గ‌ర్భిణీలు, బాలింత‌లు, కేన్స‌ర్, హెచ్ఐవీ బాధితుల‌కు ప్ర‌స్తుతం టీకా ఇవ్వ‌డం లేద‌న్నారు. వ్యాక్సిన్ తీసుకున్న మ‌హిళ‌లు మూడు నెల‌ల వ‌ర‌కు గ‌ర్భం దాల్చ‌కుండా చూసుకోవాలి అ‌న్నారు. ప్ర‌స్తుతం కోవిడ్‌తో బాధ‌ప‌డు తున్న‌వారు నెగిటివ్ రిపోర్టు వ‌చ్చాక 14 రోజుల త‌ర్వాత వ్యాక్సిన్ తీసుకోవ‌చ్చ‌ని తెలిపారు. కార్య‌క్ర‌మంలో జేసీ కీర్తి చేకూరి, కాకినాడ న‌గ‌ర‌పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ స్వ‌ప్నిల్ దిన‌క‌ర్ పుండ్క‌ర్‌, డీఎంహెచ్‌వో డా. కేవీఎస్ గౌరీశ్వ‌ర‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *