* అన్యాక్రాంతమైన భూముల అప్పగింతకు వినతి
* పూర్వ తాసిల్దార్ పై చర్యలకు డిమాండ్

ఎస్.రాయవరం – విశాఖ జిల్లా
——————————————
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం
ఎస్.రాయవరం మండలంలోని 8 గ్రామాల్లోని
తమ భూములను పూర్వ తాసిల్దార్ హయాంలో  అన్యాక్రాంతం చేసిన రెవెన్యూ అధికారుల మాయాజాలంపై ఎస్.రాయవరం మండలం ప్రస్తుత తాసిల్దార్ కు ఫిర్యాదు చేశారు. తమ భూ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు తహసీల్దార్ సత్యనారాయణకు వినతి పత్రాన్ని సోమవారం అందజేశారు. భూ మాయాజాలానికి భాధ్యుడైన గత తహశీల్దార్ వేణుగోపాల్ ను విధుల నుండి సస్పెండ్ చేయాలని, తహశీల్దార్ వేణుగోపాల్ చేసిన అవినీతి అక్రమాలపై సిట్ దర్యాప్తు జరపాలంటూ ఆందోళన చేసారు. నినాదాలు చేసారు. రెవెన్యూ అధికారుల సహకారంతో కబ్జాకు గురైన మా భూములను మాకు తిరిగి ఇప్పించాలని, మాకు న్యాయం చేయాలని, అక్రమార్కులకు అండగా నిలుస్తున్న రెవిన్యూశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా
తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు నిరసన తెలిపారు. భూ కబ్జా దారులకు తమ విలువైన భూములను ధారాదత్తం చేస్తూ, తప్పుడు పాస్ బుక్ లు మంజూరు చేసిన తహశీల్దార్ వేణుగోపాల్ పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బాధిత భూ యజమానులు తాసిల్దారుని కోరారు.

ఈ సందర్భంగా బాధితుల్లో ఒకరైన యూ.ఎఫ్.ఆర్.టి.ఐ మండల కన్వీనర్ సోమిరెడ్డి రాజు స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది గ్రామాలకు సంబంధించిన రైతుల భూములను అసలు యజమానుల నుంచి అక్రమార్కులకు మార్చేసిన ఘనుడు తహశీల్దార్ వేణుగోపాల్ అని తెలిపారు. ప్రభుత్వ భూములను ప్రయివేటు భూములుగా మార్చడంలో ఆయన దిట్ట అని అన్నారు. గ్రామస్తుల సొంత స్థలాల్లో ప్రభుత్వ భవనాలు నిర్మించడం జరిగుతోందని ఆయన పేర్కొన్నారు. ఎస్.రాయవరం చెరుకు కాటా వద్ద ఉన్న భూమిని స్థానిక నాయకులు బొలిశెట్టి గోవిందరావుకు బినామీగా ఉన్న మాజీ సర్పంచ్  లక్కోజు ఆదిమూర్తి పేరున పాస్ బుక్ మంజూరు చేశారని రెవెన్యూ అవినీతిని వెల్లడించారు.

ప్రభుత్వ స్థలాలను విస్మరించి, ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి చెరువు గర్భంలో
రూ. 75 లక్షలతో  ప్రభుత్వ కార్యాలయాలను నిర్మించడం విడ్డురంగా ఉందన్నారు. దీనిపై ఇప్పటికే స్థానిక కోర్టుని, హై కోర్టుని ఆశ్రయించా మన్నారు. పనులు నిలిపి వేయాలంటూ హై కోర్టు ఉత్తర్వులు జారీచేసిందన్నారు. అంతకు ముందు ఎమ్మెల్యే బాబురావుని కలిసి తమ సమస్యలను వివరించామని తెలిపారు. దీనిపై ఉన్నత అధికారులు స్పందించి తహశీల్దార్ వేణుగోపాల్, రెవిన్యూ సిబ్బందితో పాటు అతనికి సహకరించిన అప్పటి ఎస్.ఐ దనుంజయ్ పై చర్యలు తీసుకొని, భూ బాధితులకు న్యాయం చేయాలని రాజు కోరారు.

అనంతరం వినతి పత్రం అందుకున్న తాహసీల్దార్ సత్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ సమస్యలు ఏవీ నా దృష్టికి రాలేదన్నారు. ఇప్పుడు మీ సమస్యలపై చర్చించి మా సిబ్బంది అప్పటి తహశీల్దార్ వేణుగోపాల్ పై విచారణ జరిపి ఆయన తప్పు చేసినట్లు రుజువైతే ఉన్నత అధికారులకు నివేదిస్తానని తెలిపారు. ఆ నివేదిక ఆధారంగా వారిపై ఉన్నత అధికారులు చర్యలు తీసుకుంటా రన్నారు. వారిపై చర్యలు తీసుకొనేలా కృషి చేస్తానని ఈ సందర్భంగా బాధితులకు తాసిల్దారు సత్యనారాయణ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *