కాకినాడ – తూర్పుగోదావరి
—————————————
నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఏర్పాటవుతున్న వైఎస్సార్ – జగనన్న కాలనీల్లో సకల సదుపాయాలు కల్పించనున్నట్లు తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరి లేఅవుట్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఆప్షన్ -2 నిర్మాణ విధానాన్ని ఎంపిక చేసుకున్న 300 మంది లబ్ధిదారులకు కాకినాడలోని రంగరాయ మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ అధికారులు, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులతో కలిసి జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి హాజరయ్యారు. కొమరగిరి లేఅవుట్లో కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలోని 29 డివిజన్లకు సంబంధించిన లబ్దిదారులకు 16,000 ఇళ్ల నిర్మాణం జరగనుందన్నారు. ఈ లేఅవుట్లో నీటి సరఫరా, విద్యుత్, రహదారులు తదితర సౌకర్యాలు కల్పించనున్నామని, జనాభా ఆధారంగా పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సచివాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన లేఅవుట్లో స్థలం పొందడం అదృష్టమన్నారు. ప్రభుత్వ సహకారంతో లబ్ధిదారుడే స్వయంగా ఇంటిని నిర్మించుకుంటే ప్రభుత్వం దశల వారీగా రూ.1,80,000 అందించే ఆప్షన్ -2 ను ఎంపిక చేసుకోవడం ద్వారా దగ్గరుండి నాణ్యతగా ఇంటిని కట్టుకోవచ్చని జేసీ వివరించారు. గృహ నిర్మాణ సామగ్రిని సమర్ధవంతంగా ఉపయోగించు కోవడం, భవిష్యత్ విస్తరణకు ఏర్పాట్లు చేసుకోవడం, పటిష్ట పర్యవేక్షణ, నిర్దీత సమయంలో నిర్మాణం పూర్తి చేయడం వంటి వాటికి ఆప్షన్ -2 వీలు కల్పిస్తుంది అన్నారు. మార్కెట్ ధరలతో పోల్చితే తక్కువ ధరకు నిర్మాణ సామగ్రి లభ్యమయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. లేఅవుట్లోనే వివిధ సంస్థలు సామగ్రిని అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు వినియోగించు కోవాలని సూచించారు. మరో రెండు వారాల్లో గృహ నిర్మాణాలను ప్రారంభించాలని కోరారు . అందరూ ఒకేసారి నిర్మాణం ప్రారంభించడం వల్ల మెటీరియల్ ఖర్చు చాలా వరకు తగ్గుతుందని, త్వరలోనే ఓ అందమైన ఊరు సాక్షాత్కరిస్తుందని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఆప్షన్ 2 ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ఫాజ్ ఇటుకలు, మార్బుల్స్, తలుపులు, కిటికీలు, సిమెంట్ తదితర ఇంటి నిర్మాణ సామగ్రి సంస్థల స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ ఎండీ కార్యాలయ ప్రత్యేక అధికారులు సి.జయరామాచారి, కె.రామచంద్రన్, ఏఎడబ్ల్యూఎస్ జేడీ మల్లికార్జున్, హెబిటీట్ ఫర్ హ్యుమానిటీ ఎన్జీవో ప్రతినిధి ప్రవీణ్ పాల్, హౌసింగ్ పీడీ జీవీ ప్రసాద్, ఇతర హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు తదితరులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *