* లెనిన్ జీవిత కాలం 22.04.1870 – 21.01.1924

( పెద్దింశెట్టి రామకృష్ణ – 9492383977 )

కాకినాడ – తూర్పుగోదావరి
—————————————-
మానవాళికి మహోపకారం చేసిన మహనీయుడు, మార్క్సిస్టు సిద్ధాంతకర్త లెనిన్. మార్క్సిస్టు సిద్ధాంతాన్ని నిర్ధిష్ట పరిస్థితుల్లో నిర్ధిష్టంగా అమలుచేయడం ఎలాగో కార్మిక వర్గానికి బోధించాడు లెనిన్‌. అందుకే మార్క్స్‌- ఏంగెల్స్‌ తరువాత మార్క్సిస్టు మహా మహోపాధ్యాయునిగా చరిత్రలో చిరస్థాయి స్థానం సంపాదించు కున్నాడాయన. మార్క్సిజం అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని మరో మెట్టు పైకి తీసుకుపోయి దాన్ని ఒక కళగా మార్చాడు లెనిన్‌. సామ్రాజ్యవాద గొలుసులో బలహీనమైన స్థానం గుర్తించడం , పెట్టుబడిదారీ విధానం ఇంకా అభివృద్ధి కానీ దేశంలో కూడా వర్గ పోరాటం ద్వారా కార్మికవర్గ రాజ్యం సాధించ వచ్చునని నిరూపించి మార్క్సిజాన్ని మరింత పరిపుష్టం చేసిన మహోన్నతుడు లెనిన్. అందుకే లెనిన్‌ మరణాంతరం రష్యన్ కమ్యునిస్టు పార్టీ లెనినిజం వర్ధిల్లాలని నినదించింది. అప్పటి నుండి మార్క్స్‌- ఏంగెల్స్‌ సృష్టించిన సిద్ధాంతం “మార్క్సిజం -లెనినిజం” గా కొనియాడ బడుతుంది.
”మా సిద్ధాంతం పిడివాదం కాదు, అది ఆచరణకు కరదీపిక” అన్నారు కారల్ మార్క్స్‌ – ఎంగెల్స్‌. సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య ఉన్న గతితార్కిక సంబంధాన్ని ఆచరణలో చూపించడం ద్వారా అక్టోబర్‌ విప్లవం సాధించాడు లెనిన్‌. తదనంతరం మూడో వంతు ప్రపంచం కార్మికవర్గ రాజ్యాలుగా అవతరించింది. మార్క్సిజాన్ని గొప్ప కళగా మార్చడమే లెనిన్‌ మానవాళికి చేసిన మహోపకారం.
గోర్కీలో 1924 జనవరి 21 సాయంత్రం గం.6.50 ని. మరణించినట్టు గుర్తించారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 53 సంవత్సరాలు మాత్రమే. 48 సంవత్సరాలు వయస్సులో ఆయనకు రెండు బుల్లెట్స్ దూసుకెళ్లాయి. శరీరంలోనే ఉండిపోయాయి. ఒకటి ఊపిరి తిత్తులు నుండి చీల్చుకుని కాలర్ బోన్ వద్ద ఉంది. మరొకటి మెడ దగ్గర ఉండి ఉంది. ఈ బుల్లెట్స్ కు ఉండే లెడ్ రిలీజ్ అయ్యి క్రమేణా రక్త నాళాల్లో కలిసి పోవడంతో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఉండవచ్చని వైద్యులు ప్రాథమిక నిర్ధారనకొచ్చారు. లెనిన్ దేహాన్ని Mausoleum లో పెట్టే ముందు Embalming చేసే క్రమంలో మెదడును తొలగించి భద్రపరిచి 1925 లో ఒక ప్రత్యేక ఇనిస్త్యూట్ ప్రారంభించి పరిశోధనలు చేసి తీవ్రమైన స్క్లేరోసిస్ (Sclerosis) తో చనిపోయినట్టు నిర్దారించారు.
1924 జనవరి 21 మృతి చెందిన లెనిన్ మృతదేహాన్ని 23 వ తేదీన గోర్కీ నుండి మాస్కో రైల్ లో తీసుకెళ్ళి హౌస్ ఆఫ్ యూనియన్స్ లో ప్రజల సందర్శనార్థం ఉంచారు. 27 వ తేదీన రెడ్ స్క్వేర్ లో తాత్కాలిక చెక్క సమాధి చేసి, దీర్ఘకాల భహిరంగ సందర్శన కోసం Mausoleum లో భద్రపరిచారు. ఆ సందర్భంగా జరిగిన సంస్మరణ సభలో మిఖాయిల్ కాలినిన్, గ్రిగరీ జినోవివ్, జోషఫ్ స్టాలిన్ ప్రసంగించారు. నేటికీ రష్యాలో ప్రముఖ సందర్శనా స్థలంగా భాసిల్లుతోంది.
సోవియట్ యూనియన్ ప్రతిఘాత విప్లవాంతరం పెట్టుబడిదారీ పాలకులు లెనిన్ మహాశయుడి పార్థివ దేహాన్ని Mausoleum నుండి తొలగించి ఖణనం చేయాలనే నిర్ణయం రష్యన్ ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గారు. 2018 లో పార్లమెంట్ సభ్యుడు వ్లాడిమిర్ ఫెట్రో మాట్లాడుతూ 2024 నాటికి లెనిన్ మరణించి వందేళ్లు పూర్తి అవుతున్నందున మృత దేహాన్ని Mausoleum నుండి తొలగించి ఖణనం చేయాలని సూచన చేశాడు. లెనిన్ భావజాలానికే కాదు లెనిన్ మృత దేహానికి అక్కడి పాలక వర్గాలు భయపడుతున్నాయి. లెనిన్ మృత దేహాన్ని ఖణనం చేయాలని ఆలోచన చేస్తున్న ప్రతీసారీ సందర్శకుల సంఖ్య భారీగా పెరుగుతుండటం పాలకవర్గాలకు రుచించడం లేదు. భవిష్యత్లో ఏం జరుగుతోందో వేచి చూద్దాం. లెనిన్ మృత దేహాన్ని దుర్భిద్దితో ఖననం చేయవచ్చు గానీ ఆ మహాశయుడు నమ్మి, విశ్వసించి, మరింత పరిపుష్టం చేసి, ఆచరణలో పెట్టి, నిరూపించి, కార్మిక వర్గ ప్రజా రాజ్యాన్ని సృష్టించిన మార్క్సిజం సిద్ధాంతాన్ని ఖణనం చేయలేరు. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా నేడు మార్క్సిజం ప్రభల శక్తిగా ముందుకు వస్తుంది. యువత మార్క్సిజంపై ఆసక్తి, అధ్యయనం పెంచుకుంటున్న విషయం, వివిధ రూపాల్లో ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు గమనించ దగ్గవి. లెనిన్ కు నివాళి అర్పించడం అంటే ఆయన మార్గాన్ని అనుసరించడంగా ఉండాలి. పోరాట శక్తులకు మార్క్సిస్టు సిద్దాంతం అధ్యయనం, ఆచరణ ఆయుధాలుగా ఉండాలి. లెనిన్ దాస్ కాపిటల్ మూడు భాగాలనూ పది సార్లు చదివాడని మార్క్సిస్టు రచయితలు అంటారు. విప్లవం కోసం జరిపే పోరాటంలో వైఫల్యం చెందిన ప్రతీ సారీ వైఫల్యం ఎక్కడ జరిగిందో గుర్తించడం కోసం మార్క్స్, ఎంగెల్స్ రచనలు మరింత పట్టుదలగా చదవడం లెనిన్ ఆచరించిన విప్లవ మార్గం. సంవత్సరాల తరబడి ప్రవాసంలో ఉంటూ ఎటువంటి సమాచార సౌలభ్యం లేని కాలంలో తన విప్లవ కృషి ద్వారా మార్క్సిజాన్ని మరింత పరిపుష్టం చేసిన మహోన్నతుడుగా భవిష్యత్ మానవాళికి స్ఫూర్తిగా నిలిచాడంటే ఆయన కోసం ఎంత చెప్పినా తక్కువే కాగలదు. అతడు కేవలం రష్యన్ కాదు ఎల్లప్పుడూ చైతన్యం రగిల్చే వరల్డ్ రివల్యూషనరీ మిషన్. నాలో లెనిన్…
మీలో లెనిన్… మనలో లెనిన్..

✍ పెద్దింశెట్టి రామకృష్ణ
9492383977

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *