* అపస్మారకంలో మరో ఇద్దరు

* తేటగుంట జాతీయ రహదారిలో ఘటన

శంఖవరం – తూర్పుగోదావరి
——————————————-
పొట్ట కూటి కోసం కాయ కష్టం చేయడానికి పొరుగూరు వెళితే అక్కడ అదుపు తప్పిన ఓ వాహనం మృత్యుపాశమైంది. ఓ కూలీ నిండు ప్రాణాన్ని పొట్టన పెట్టుకుంది. మరో ఇద్దరిని అపస్మారక స్థితిలోకి పెట్టేసింది. మరి కొందరిని తీవ్రం గాయాలు పాల్జేసింది. ఈ విషాదకరమైన దుర్ఘటన తూర్పు గోదావరి జిల్లా తుని రూరల్ మండలం తేటగుంట జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ కూలీ, అపస్మారక స్థితికి చేరిన మరో ఇద్దరు కూలీలూ మండలం కేంద్రమైన శంఖవరం నకు చెందిన వారు. వీరంతా వివిధ సామాజిక వర్గాలకు చెందిన వారైనప్పటికీ కాంక్రీట్ సిమెంటు మిక్సింగ్ పనిలో జట్టు కూలీలు.

రోజూ మాదిరిగానే ఉదయం పనిలోకి తేటగుంట సమీప ప్రాంతానికి వెళ్లి పని ముగించుకుని, సాయంత్రం కూలీలంతా ఓ ఆటోలో తిరిగి శంఖవరంనకు పయన మయ్యారు. వీరితో పాటు కాంక్రీట్ సిమెంటు మిక్సింగ్ యంత్రాన్ని కూడా విడిగా వెంట పెట్టుకొస్తున్నారు. సరిగ్గా తేటగుంటలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రవాణాశాఖ తనిఖీ కార్యాలయం సమీపంలోనికి రాగానే వీరి రెండు వాహనాలకూ వెనుకగా అతి వేగంగా వస్తోన్న మరో మినీ వ్యాన్ ఆటోను, సిమెంటు మిక్సింగ్ యంత్రాన్ని, జాతీయ రహదారి డివైడర్ రెయిలింగ్ ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆటలో ఉన్న, శంఖవరంనకు చెందిన కర్రి శ్రీను, పర్వత శ్రీను, అనివిరెడ్డి సూరిబాబు తీవ్ర గాయాల పాలై అపస్మారక స్థితికి చేరుకున్నారు. వీరితో పాటు మిగితా వారికి స్వల్ప గాయాలయ్యాయి.

వారిని 108 వాహనంలో తుని‌ ప్రభుత్వ ఆసుపత్రికి‌ తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి వైద్యుల సూచనల మేరకు కర్రి శ్రీను, పర్వత శ్రీనును కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి, అనివిరెడ్డి సూరిబాబును విశాఖ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాకినాడలో చికిత్స పొందుతూ కర్రి శ్రీను మృతి చెందాడు. శంఖవరంలో బాధితులను గృహాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాధితుల రోదనలు మాటల్లో చెప్పనలనివిగా ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *