ఇంటింటికీ సరుకుల పంపిణీ ఓ గొప్ప వరం

* ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్

శంఖవరం – తూర్పుగోదావరి
———————————————
ఇంటికే పింఛన్ల పంపిణీ మాదిరిగా ఇంటింటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర సరుకులపంపిణీ చేయడం ఓ గొప్ప వరమని ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం కత్తిపూడిలో ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల 58 నిత్యావసర సరుకుల పంపిణీ వాహనాలను ఆయా వాహనాల యజమానులైన చోదకులకు శుక్రవారం ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్థానిక శంఖవరం రోడ్డులోని రైతు భరోసా కేంద్రం ప్రాంగణంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ఎమ్మెల్యే ప్రసాద్ మాట్లాడారు. ప్రజల మేలు కోరి ఎంతో మంచి మనసుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఈ బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించారని అన్నారు. లబ్ధి దారులను పారదర్శకంగా ప్రభుత్వం ఎంపిక చేసిందని, ఈ పధకం అమలు ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా ప్రజలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ విధానాన్ని అనుసరించేలా వలంటీర్లు, వాహన యజమానులు ఈ పథకాన్ని ఆదర్శ వంతంగా నిర్వహించాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. వాలంటీర్లు, ప్రజా పంపిణీ వాహనదారులు అందరూ ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములు అని ప్రజా పంపిణీలో ఏవిధమైన అపవాదు రాకుండా సక్రమంగా సేవలందించాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఆ మండలాలకు సంబంధించిన ఈ వాహనాలను ఆ ప్రాంతాలకు తరలించి వినియోగంలోకి తెచ్చేంత వరకూ రెవెన్యూ శాఖాధికారుల రక్షణ, పర్యవేక్షణలో ఉంచాలని ఎమ్మెల్యే ప్రసాద్ ఆదేశించారు. నిన్న ముఖ్యమంత్రి 9,600 పై చిలుకు వాహనాలను ప్రారంభిస్తే ఈ రోజు నేను నియోజకవర్గంనకు చెందిన 58 వాహనాలను నేను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే వివరించారు. ఏ వాహనాలను దేవాలయాలుగా, ప్రభుత్వ ఆస్థిగా భావించి భద్రంగా వినియోగించు కోవాలని, నిర్వహణా పరమైన సమస్యలు ఉత్పన్నమైతే ఆయా మండలాల తాసిల్దార్లు, ఎంపీడీవోలకు తెలిపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు ఎంపీడీవో శ్రీలలిత, తాహసిల్దార్ గోపాలకృష్ణ, ఏలేశ్వరం ఎంపీడీవో రజనీకుమారి, తాహసిల్దార్ రత్నకుమారి, రౌతులపూడి తాసిల్దార్ అబ్బాస్, ఎంపీడీవో నాయుడు, శంఖవరం తాసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం, ఎంపీడీ రాంబాబు, కత్తిపూడి రవాణా శాఖ కార్యాలయం మోటారు మెడికల్ ఇనస్పెక్టర్ అల్లు రవికుమార్, అన్నవరం ఎస్సై రవికుమార్ తదితరులు ప్రసంగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *