కాకినాడ‌ – తూర్పు గోదావరి
—————————————–
జిల్లాలో గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి తెలిపారు. కాకినాడ క‌లెక్ట‌రేట్‌లోని కోర్టు హాల్‌లో ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ స‌న్న‌ద్ధ‌త‌పై ఎస్‌పీ అద్నాన్ న‌యీం అస్మీ, రాజ‌మ‌హేంద్ర‌వ‌రం ఎస్‌పీ షేముషి బాజ్‌పాయ్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ (అభివృద్ధి) కీర్తి చేకూరి త‌దిత‌ర అధికారుల‌తో స‌మీక్షా స‌సమావేశాన్ని బుధ‌వారం క‌లెక్ట‌ర్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ… జిల్లాలోని సెన్సిటివ్‌, హైప‌ర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలున్న ప్రాంతాల‌పై ప్ర‌త్యేకంగా దృష్టి సారించాల‌ని పోలీసు, రెవెన్యూ అధికారుల‌కు సూచించారు. ఎక్క‌డా ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా ప‌టిష్ట ప్ర‌ణాళిక‌తో అధికారులు ప‌ని చేయాల‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌లకు సంబంధించి వివిధ ప‌నుల నిర్వ‌హ‌ణ‌, ప‌ర్య‌వేక్ష‌ణ‌కు ప్ర‌త్యేక బాధ్య‌త‌లు వివిధ శాఖల అధికారుల‌కు అప్ప‌గించిన‌ట్లు ఆయన తెలిపారు. ఈ అధికారులు పరస్పరం స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాలి అ‌న్నారు. జిల్లా స్థాయిలో ప్ర‌త్యేకంగా కంట్రోల్‌ రూంను ఏర్పాటు చేస్తున్నామ‌ని, ఫిర్యాదులను స‌త్వ‌రం ప‌రిష్క‌రించ‌ నున్న‌ట్లు తెలిపారు. ఈ కంట్రోల్ రూం, ఎన్నిక‌ల ప్ర‌వ‌ర్త‌నా నియ‌మావ‌ళి బాధ్య‌త‌ల‌ను బీసీ కార్పొరేష‌న్ ఈడీకి అప్పగించిన‌ట్లు వెల్ల‌డించారు. మైక్రో అబ్జ‌ర్వ‌ర్స్, వెబ్ కాస్టింగ్‌, వీడియోగ్ర‌ఫీ అంశాల‌ను డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ చూస్తార‌న్నారు. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన సామాగ్రి అందించే బాధ్య‌త‌ను జిల్లా పంచాయ‌తీ అధికారికి అప్ప‌గించిన‌ట్లు ఆయన వివ‌రించారు. బ్యాలెట్ పెట్టెల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల‌ను జెడ్‌పీ సీఈవోకు, ఎన్నిక‌ల వ్య‌యం అంశాల బాధ్య‌త‌ను జిల్లా ఆడిట్ అధికారికి కేటాయించామని వెల్లడించారు. సిబ్బంది శిక్ష‌ణ అంశాల బాధ్య‌త‌ను మెప్మా ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌కు అప్ప‌గించా మ‌న్నారు. డీపీవో, సీపీవో కార్యాల‌యాల సిబ్బందికి బ్యాలెట్ పేప‌ర్ల బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించా మ‌న్నారు. డీఈవో, డీఐవో, డీటీవో, డీఎల్‌డీవోలు త‌దిత‌ర అధికారుల‌కు కూడా ప్ర‌త్యేక విధులు కేటాయించిన‌ట్లు ఆయన తెలిపారు. ఇలా ప్ర‌ణాళికాబ‌ద్దంగా వ్య‌వ‌హ‌రిస్తూ రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ మార్గ‌ద‌ర్శ‌కాలకు అనుగుణంగా ద‌శ‌ల వారీగా ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు క‌లెక్ట‌ర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *