* తొలి, మలి ఎస్సీ సర్పంచులు నిశానీలే
* రిజర్వుడు ముసుగులో “షాడోల” ఏలుబడి
* మూడో రిజర్వేషన్ విద్యావంతులకు దక్కేనా..?
* దళితుల బ్రతుకులు బాగుపడేనా…?

శంఖవరం – తూర్పుగోదావరి
——————————————

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు, వారి సామాజిక వర్గాల వైయుక్తిక అభివృద్ధిలో గణనీయమైన ప్రగతికి తోడ్పడేందుకు వీలుగా భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం రిజర్వేషన్ సౌలభ్యాన్ని రాజ్యాంగం కల్పించింది. ఈ రిజర్వేషన్ సౌలభ్యం ఒక్కో దఫా ఎన్నికల్లో జనాభా / ఓటర్ల దామాషా గణన ప్రకారం ఒక్కో సామాజిక వర్గాన్ని వరిస్తుంది. ఈ అరుదైన వరం అగ్ర సామాజిక వర్గాల ప్రజా ప్రతినిధులకు, వారి వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులకు, రాజకీయ నేతలకు కలసి వస్తోంది. కాని నిమ్న జాతీయులు, దళితులుగా పేరుబడి ఎస్సీ, ఎస్టీలుగా రాజ్యాంగ గుర్తింపు పొందిన సామాజిక వర్గీయులకు కలసి రావడం లేదు. ఆయా కాలాల్లో ఆయా రాజకీయ పార్టీల పాలనలో ఆయా పార్టీల నేతల అండదండలతో రిజర్వేషన్ పుణ్యమాని గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎస్సీ,ఎస్టీలు ప్రజా ప్రాతినిధ్య ప్రభువులు కాగలుగు తున్నారు గాని అది వారికి అక్కరకు రావడం లేదు. సర్పంచులుగా ఎన్నికై కూడా వారి హక్కు భుక్తంగా లభించిన వాస్తవ పరిపాలన అధికారాన్ని చేపట్టలేక పోతున్నారు. తెర వెనుక ఉండి వీరిని గెలిపించిన నేతలు తెర ముందుకు వచ్చి వాస్తవ పాలన చేస్తూ “షాడో” సర్పంచులుగా వెలిగి పోతున్నారు. ప్రచారం చేసి, ఓట్లేసి గెలిపించిన ఓటర్లు, ప్రజలు మాత్రం ఛాయా సర్పంచుల ఏలుబడి ఛత్రం ఛాయలో తల దాచుకుంటూ ఆ ఐదేళ్ళూ బ్రతుకు జీవుడా అంటూ ఎలాగోలా కాలం వెళ్లదీస్తున్నారు. ఇందుకు తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం పంచాయితీ సర్పంచులుగా చేసిన ఎస్సీ రిజర్వేషన్ అనుభవాలే తాజా ఉదాహరణ.

1998 లో శంఖవరం సర్పంచ్ కు ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం కలిసి వచ్చినపుడు తెలుగు దేశం పార్టీ నేత స్వర్గీయ పర్వత సుబ్బారావు ప్రోత్సాహంతో బందిలి బుల్లి అప్పారావు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈయన ఓ నిజమైన నిశానీ. అవిద్యావంతుడు. పైగా స్వర్గీయనేత వ్యవసాయ సాగు క్షేత్రాల పర్యవేక్షకుడే ఈ బుల్లి అప్పారావు. ఫలితంగా పాలన పరంగా కేవలం వేలి ముద్రలకే ఈయన పరిమితం అయ్యారు. స్వీయ పాలన చేతగాని అచేతనుడు. నమస్తే దొరగారు అంటూ అయ్య వార్ల ముందు చేతులు కట్టుకుని నిలబడింది తప్ప, తలపడి నిలబడి పాలన చేసింది లేదు. పర్యవసానం షాడో పాలన. శంఖవరం పంచాయితీ సర్పంచ్ పదవి తొలి ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం అలా మట్టి కొట్టుకు పోయి కాల గర్భంలో కలసి పోయింది.

2004 లో కూడా శంఖవరం పంచాయితీకి ఎస్సీ రిజర్వేషన్ అవకాశం తలుపు తట్టింది. ఈ దఫా మాజీ నిశానీ సర్పంచ్ బందిలి బుల్లి అప్పారావు సతీమణి నీలావతి నిశానీ సర్పంచ్ అయ్యారు. ఈ దఫా కూడా పర్వత సుబ్బారావు ప్రోత్సాహంతోనే ప్రత్యర్ధులు కన్న అత్యధిక ఓట్లతో నీలావతి సర్పంచ్ విజయం సాధించారు. అప్పటి వరకూ పర్వత సుబ్బారావు ఇంటి పని మనిషి దొంగమ్మగా ఊరందరికీ తెలిసిన ఈమె సర్పంచ్ నీలావతిగా సరికొత్తగా పరిచయం అయ్యారు. అప్పుడు ఎస్సీ జనరల్ రిజర్వేషన్ కావడంతో పోటీలో ఉన్న విద్యావంతుడు ఆరుగుల రాజారావు (గంట గుర్తు), మరో విద్యావంతుడు స్వర్గీయులు బందిలి మోషేరావు సతీమణి, విద్యవంతురాలు శేషారత్నం ( రెండు ఆకుల గుర్తు) ఓడి పోయారు. ఈ దఫా ఎన్నికల్లోనైనా విద్యా వంతులను సర్పంచులుగా శంఖవరం ఓటర్లు ఎన్నుకోలేక పోయారు. 1998 ఎన్నికల్లో ఎస్సీ విద్యావంతులు పోటేలో నిలబడక పోవడం ఆ సామాజిక వర్గీయులది నాటి తొలి తప్పిదం. 2004 ఎన్నికల్లో పోటీలో ఉన్న ఇద్దరు విద్యా వంతులలోనూ ఏ ఒక్కరినీ సర్పంచ్ గా ఎన్నుకోక పోవడం మొత్తం గ్రామంలోని ఓటర్ల రెండో తప్పిదం. ఈ రెండూ చారిత్రాత్మక తప్పిదాలే కాదు… వ్యూహాత్మక తప్పిదాలు కూడా. ఫలితంగా ఈ రెండు ఎన్నికల దరిమిలా ప్రజలు స్వీయ అనుభవ పూర్వక గుణపాఠాలు నేర్చుకున్నారు.

ప్రస్తుతం ఎన్నికల్లో కాడా ముచ్చటగా మూడో సారీ శంఖవరం పంచాయితీని ఎస్సీ రిజర్వేషన్ సౌకర్యం వరించింది. ప్రస్తుత ఎస్సీ మహిళా సర్పంచ్ రిజర్వేషన్ పోటీలో విద్యా వంతులు
ఉంటారో… ? అవిద్యావంతురాలుకా లేక విద్యావంతురాలికి సర్పంచ్ గిరీని ఏకగ్రీవంగా పట్టం కడతారో అన్నది త్వరలోనే తేలనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *