* కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలి
* పంట గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించాలి
* విగ్రహాల ధ్వంసంలో టీడీపీ నేతలున్నట్లు ఆధారాలున్నాయి
* ఐపీసీ 295కి సవరణ చేసి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి
* అఖిలపక్ష సమావేశంలో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్
న్యూఢిల్లీ – జనాసవార్త
————————————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సమావేశానికి వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను సమావేశంలో లేవనెత్తారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలోని పలు అంశాలపై ప్రస్తావించారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ విజయ సాయిరెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. భౌగోళిక ప్రాతిపదికన జల వనరులు కేటాయించాలి అన్నారు. దిశ చట్టానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. అదే విధంగా రేప్ ఘటనలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు.
పంటల గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. అదేవిధంగా ప్రత్యేక రైతు కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి అన్నారు. విగ్రహాల ధ్వంసంలో టీడీపీ నేతలు ఉన్నట్లు ఆధారాలు బయట పడ్డాయని, ఐపీసీ 295కి సవరణ చేసి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.