కాకినాడ‌ – జనాసవార్త
———————————-
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాయోజిత బ్యాంకు అయిన చైత‌న్య గోదావ‌రి గ్రామీణ బ్యాంకు ద్వారా ఆధునిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఖాతాదారుల‌కు సేవ‌లందించి, మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు ఎద‌గాల‌ని క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ఆకాంక్షించారు. శ‌నివారం కాకినాడ‌లోని అశోక్‌న‌గ‌ర్‌లో చైత‌న్య గోదావ‌రి గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ నూత‌న భ‌వనానికి క‌లెక్ట‌ర్ డి.ముర‌ళీధ‌ర్‌రెడ్డి ప్రారంభోత్స‌వం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటుచేసిన క్యాష్ కౌంట‌ర్‌, లాక‌ర్ గదిని కూడా క‌లెక్ట‌ర్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ బ్యాంకు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్ష‌లు తెలిపారు.  కొత్త భ‌వ‌నంలో ఖ‌తాదారుల అవ‌స‌రాల‌కు అనుగుణంగా అన్ని సైజుల్లో లాక‌ర్లు అందుబాటులో ఉన్నాయ‌ని బ్యాంకు అధికారులు.. క‌లెక్ట‌ర్‌కు వివ‌రించారు. రైతులు, స్వ‌యం స‌హాయ‌క సంఘాలు, వ్యాపారులు త‌దిత‌రుల‌కు నాణ్య‌మైన సేవ‌లందిస్తున్న‌ట్లు వివ‌రించారు. రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా లాక‌ర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చైత‌న్య గోదావ‌రి గ్రామీణ బ్యాంకు ఛైర్మ‌న్ టి.కామేశ్వ‌ర‌రావు తెలిపారు. ఖాతాదారుల డిపాజిట్ల‌కు అధిక వ‌డ్డీ చెల్లిస్తున్నా మన్నారు. రూ.5 ల‌క్ష‌ల వ‌ర‌కు రైతు స్వ‌ర్ణ గోల్డ్ రుణాల‌ను అతి త‌క్కువ వ‌డ్డీకి అందిస్తున్న‌ట్లు వివ‌రించారు. గుంటూరు, తూర్పు గోదావ‌రి, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో రూ.12,500 కోట్ల వ్యాపారంతో 222 శాఖ‌ల‌తో సేవ‌లందిస్తూ ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ఖాతాదారులకు మ‌రింత మెరుగైన సేవ‌లందించాల‌నే ఉద్దేశంతోనే కొత్త భ‌వ‌నానికి ప్రారంభోత్స‌వం చేసిన‌ట్లు తెలిపారు. బ్యాంకు ప్రాంగ‌ణంలోని కార్య‌క‌లాపాల‌న్నింటినీ ఆన్‌లైన్ చేసిన‌ట్లు పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో తూర్పుగోదావ‌రి జిల్లా ఎల్‌డీఎం జె.షణ్ముఖరావు, యూనియ‌న్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజ‌న‌ల్ మేనేజ‌ర్ ఎస్‌.జ‌వ‌హ‌ర్, చైత‌న్య గోదావ‌రి గ్రామీణ బ్యాంకు రీజినల్ మేనేజర్ జి. మల్లికార్జునరావు, బ్యాంక్  సిబ్బంది, ఖాతాదారులు త‌దిత‌రులు హాజ‌ర‌ు అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *