* శంఖవరం పంచాయితీ పాలక వర్గం ఏకగ్రీవం
* ఉపసర్పంచ్ గా చింతంనీడి కుమార్ ఏకగ్రీవం

శంఖవరం – తూర్పు గోదావరి
——————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రమైన శంఖవరం మేజర్ పంచాయితీ సర్పంచ్ గా బందిలి రామలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. శంఖవరం పంచాయితీ సర్పంచ్ పదవికి ఈ దఫా ఎస్సీ మహిళకు రిజర్వుడు కావడంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ ఆశీస్సులతో నియోజకవర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ధనలక్ష్మి సర్పంచ్ అభ్యర్థిగా ఆదివారం సాయంత్రం 3.15 గంటలకు దరఖాస్తు చేసారు. ఈమెతోపాటు మొత్తం 16 వార్డు సభ్యత్వాలకు అభ్యర్థులుగా ఒక్కో వార్డుకు ఒక్కో అభ్యర్ధి చొప్పున మొత్తం 16 మంది వరుసగా కొల్లుబోయిన అనంతలక్ష్మి, జట్లా గంగాభవాని, జక్కల సత్యవతి, కోగూరి లక్ష్మి, యండమూరి లక్ష్మి, యండమూరి లక్ష్మి, దోమాడ త్రివేణి, పొట్నూరి మంగ, తంగెళ్ళ సత్యనారాయణ, లంక నాగరాజు, రాయి సూర్యారావు, దాసరి లోవరాజు, సింగినీడి వెంకట లక్ష్మి, మాతా అప్పలకొండ, పిల్లి వీరబాబు, కుసుమంచి కృష్ణారావు, మరొకరూ తమ తమ నామినేషన్లను దాఖలు చేశారు. సాయంత్రం నామినేషన్ల గడువు సమయం 5 గంటలు ముగిసే సరికి వేరొకరు ఎవరూ సర్పంచ్ అభ్యర్థిగా గానీ వార్డు సభ్యులుగా గానీ పోటీకి ఇక ఎవరూ తమ నామినేషన్లను దాఖలు చేయలేదు. ఫలితంగా సర్పంచ్ పదవిని అభ్యర్థిస్తూ పోటీలో ఉన్న ఏకైక అభ్యర్ధి ధనలక్ష్మి, 16 మంది వార్డు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఉపసర్పంచ్ గా నాలుగవ వార్డు సభ్యుడు చింతంనీడి కుమార్ ను 16 మంది వార్డు సభ్యులూ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో శంఖవరం పంచాయితీ సర్పంచ్, వార్డు సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక లాంఛనంగా విజయవంతం అయింది. ఇక వీరిని అధికారికంగా శంఖవరం పంచాయితీ ఎన్నికల అధికారి ప్రసాద్ థృవీకరిస్తూ ప్రకటించాల్సి ఉంది. ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయితీలకు రూ. 20 లక్షల వరకూ ప్రోత్సాహక నగదూ బహుమతిగా ప్రకటించడం, ఆ నిధులు గ్రామాభివృద్ధికి మరింత తోడ్పడ తాయని భావించడం, ఎమ్మెల్యే సొంత ఊరు కావడం, ఈ పదవిని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, పర్వత వంశ కుటుంబీకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం వలన ఏకగ్రీవం కావడంలో వారు సఫలీకృతం అయ్యారని భావిస్తున్నారు.

బందిలి వంశ మూడో సర్పంచ్ ధనలక్షి
——————————————————
శంఖవరం సర్పంచ్ పదవి ఓ సాధారణ వ్యవసాయ కూలీ మహిళ బందిలి ధనలక్ష్మిని వరించింది. ఈమె 7వ తరగతి వరకూ చదువు కున్నారు. ఈమె భర్త పేరు సింహచలం. వీరివురూ రైత్వారీ వ్యవసాయ కూలీ పని జీవనాధారంగా ఉన్నారు. ఈ దంపతుల ఇద్దరు మగ పిల్లలూ చదువు కుంటున్నారు. ధనలక్ష్మి ఎన్నికతో శంఖవరం ఎస్సీ రిజర్వుడు సర్పంచ్ పదవి ముచ్చటగా మూడోసారి కూడా బందిలి వంశీకులనే వరించింది. విజయానందంలో ఏకగ్రీవం పాలక వర్గ బృందాన్ని మేళ, తాళం, భాజా, భజంత్రీలు, టపాసు బాణా సంచా ధ్వనుల నడుమ భారీగా ఎత్తున గ్రామంలో ఊరేగించి సగౌరవంగా వీడ్కోలు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *