* డ్రైనేజీల నిర్మాణం ప్రధమ ప్రాధాన్యం
* తాళ్ళపాలెంకు రోడ్డు, సామాజిక భవనం
* తాగు నీటి కొరత లేకుండా చేస్తా
* ఎస్సీ, ఎస్టీలకు కాంక్రీట్ సిమెంటు రోడ్లు
* బీసీ కాలనీలో స్మశాన వాటిక నిర్మాణం
* అర్హులు అందరికీ ఫింఛన్లు మంజూరు
* మండపం వైకాపా సర్పంచ్ అభ్యర్థి మాణిక్యం

(మాణిక్యం స్వగృహం నుంచి జనాస)

మండపం – తూర్పు గోదావరి
—————————————-
మండపం పంచాయితీలో అంతర్భాగంగా ఉన్న కొండగౌరంపేట, మండపం, శివారు తాళ్ళపాలెం గ్రామాల సమగ్ర సమ అభివృద్ధికి కృషి చేస్తానని మండపం పంచాయితీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ సర్పంచ్, మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త కూనిశెట్టి మాణిక్యం పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం మండపం పంచాయితీలో ఎన్నికల ప్రచారంలో దూసుకు పోతూ ఏకైక ప్రత్యర్ధి కన్న ముందంజలో ఉన్న మాణిక్యం తన నివాసంలో శనివారం ఉదయం 9 గంటలకు “మనం న్యూస్” తో ముఖాముఖీగా మాట్లాడారు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ కు మండపం గ్రామం నుంచి ముఖ్య అనుచరుడుగా గుర్తింపు పొంది, ఎమ్మెల్యే ఆశీస్సులు, ప్రోత్సాహంతో రెండో దపా సర్పంచ్ పదవికి అభ్యర్థిగా పోటీలో ఉన్న మాణిక్యం తనకు మూడూళ్ళూ మూడు కళ్ళంత సమానం అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తనకు 20 ఏళ్ళ క్రితం ఇచ్చిన సూచన మేరకు అప్పటి నుంచి పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ కు ముఖ్య అనుచరుడుగా ఉంటూ ప్రసాద్ ప్రోత్సాహం, సహకారంతో 2004లో సర్పంచ్, 2009, 2014 లో ఉప సర్పంచ్ గా పంచాయితీ అభివృద్ధికి కృషి చేసిన తనకు ఇకపై చేయబోయే అభివృద్ధిపై తనకు ఓ స్పష్టత, ఎమ్మెల్యే దృష్టి కోణంలో ఓ ప్రణాళిక బద్ధమైన వ్యూహం తమకు ఉన్నాయన్నారు.

తాను సర్పంచ్ గా విజయం సాధిస్తే… తన ప్రధమ లక్ష్యంగా మూడూళ్ళలోనూ మురుగు నీరు సక్రమ పారుదల వ్యవస్థను మెరుగు పరచేందుకు కాంక్రీట్ సిమెంటు డ్రైన్లను నిర్మిస్తా నన్నారు. దశల వారీగా మూడూళ్ళలోనూ సామాజిక భవనాలను, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో కాంక్రీట్ సిమెంటు రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తానని వెల్లడించారు. తాళ్ళపాలెంనకు కచ్చా రోడ్డు స్థానంలో పక్కా రోడ్డు నిర్మిస్తామన్నారు మాణిక్యం. మూడు గ్రామాల్లోనూ తాగు నీటి సమస్యలను సత్వరం పరిష్కరిస్తామని చెప్పారు. మండపంలో బీసీ కాలనీలోని ఊరుమ్మడి స్మశాన వాటికను సంపూర్ణంగా అభివృద్ధి చేస్తానని, అర్హులు అందరికీ సామాజిక భద్రతా పింఛన్లను మంజూరుకు కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో పంచాయితీ అభివృద్ధిలో ముందుకు ఉరుకుతానని మాణిక్యం తన బలమైన లక్ష్యపూరితమైన కోరికను వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల తన మంచం గుర్తుపై ఓట్లేసి భారీ ఆధిక్యతతో తనను సర్పంచ్ గ గెలిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కూనిశెట్టి మాణిక్యం ప్రజలను కోరారు. ఈ పంచాయితీలో 12 వార్డులు, ఒక్కో వార్డుకు సగటున 242 మంది ఓటర్లు ఉండగా, అధికార వైఎస్సార్ కాంగ్రెస్, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీల నుంచి 24 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు, ఈ రెండు పార్టీల నుంచి ఇద్దరు సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉండటం విశేషం.

శనివారం 1 ఫిబ్రవరి 2020 న స్థానిక శ్రీ సీతారామా ఆలయం ప్రాంగణంలో నిర్వహించిన పింఛన్ల పంపిణీ బహిరంగ సభలో ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ … మండపం నా సొంతూరు… మీరంతా నా సొంత ప్రజలు… మీ సమస్యలన్నీ నా సమస్యలు… గ్రామ ప్రజల సమస్యలన్నీ తప్పకుండా పరిష్కరిస్తా… “మండపం” పంచాయితీని నా సొంతూరులా అభివృద్ధి చేస్తా… మీరు నిశ్చింతగా ఉండండి… ఆని ఇచ్చిన తన హామీని ఆయన తప్పకుండా నెరవేరుస్తారని ఆశిద్దాం.

———————————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *