శంఖవరం – తూర్పు గోదావరి
———————————————-
కరోనా టీకాలు వేసుకోవాలి… దాని వలన దుష్పరిణామాలు ఉండవు… ఎటువంటి అపోహలకు తావీయొద్దు… మేం టీకాలు చేసుకున్నాం… సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాం… అని ప్రజలకు అవగాహన కల్పిస్తూ టీకాలకు ప్రజలను ప్రోత్సహిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన ప్రభుత్వ ఉద్యోగులే ఆ టీకాలను వేయించు కోడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ వింత పరిస్థితి తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో నెలకొంది. మండలంలో 14 పంచాయితీలు, మండల స్థాయిలో దాదాపు 30 ప్రభుత్వ శాఖలు ఉన్నాయి. దీనికి తోడు సచివాలయం వ్యవస్థ అమలులోకి వచ్చాక మరి కొందరు ఉద్యోగులు, మండలం మొత్తం మీద 270 మంది వలంటీర్లు ఉన్నారు. కరోనా కాలం గనుక ఫ్రంట్ లైన్ సేవలు అందిస్తున్న ప్రభుత్వం ఉద్యోగులు గనుక వీరందరికీ కరోనా టీకాలను ఉచితంగా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కోవలో మొదటగా ప్రభుత్వ ఆసుపత్రుల సిబ్బందికి టీకాలు వేసారు. తదుపరి అంగన్వాడీ సిబ్బందికి టీకాలు వేసారు. ప్రస్తుతం మిగతా ప్రభుత్వం సిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించింది. ఐతే టీకాలకు వివిధ కారణాలు, అపోహలతో మిగతా ప్రభుత్వ శాఖల సిబ్బంది ముందుకు రావడం లేదు. ఏ కారణం బహిర్గతం చేయకుండా టీకాలకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో మార్గాంతరం, పరిష్కారం కనపడక మండల కరోనా నోడల్ అధికారి, మండల స్థాయి అధికారులు తలలు పట్టు కుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *