శంఖవరం – తూర్పుగోదావరి
——————————————–
ప్రభుత్వ ఆస్పత్రుల పరిధిలో నిరంతరం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తూర్పు గోదావరి జిల్లా కుష్టు నివారణ అధికారి రమేష్
ఆదేశించారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండల కేంద్రం శంఖవరం ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని రమేష్ మంగళవారం ఉదయం సందర్శించారు. జాతీయ సామాజిక ఆరోగ్య సర్వేలో భాగంగా ప్రతీ రోజూ ప్రతీ సిబ్బంది ప్రతీ గృహాన్ని సందర్శించాలని, ఈ రోజు వారీ విధుల వివరాలను అంతర్జాలంలో నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. ఈ లక్ష్యాలను సత్వరం పూర్తి చేయడం తోపాటు వివరాలను ఎప్పటికప్పుడు నవీకరించాలని చెప్పారు. గర్భిణీలు, చిన్న పిల్లల గుర్తింపు కార్యక్రమం 85 శాతం, వారికి సంపూర్ణ టీకాలు వేసే లక్ష్యం 100 శాతం పూర్తి అయ్యి నందుకు, గతేడాది ఏప్రిల్ నుంచి ఆరు నెలల కాలంలో ఆస్పత్రిలో 24 ప్రసవాలు జరగడం, మునుపటి కన్నా ప్రస్తుతం ఆస్పత్రి జననాలు క్రమంగా పెరుగుతోన్న ఆశాజనక పరిస్థితిపైనా, కరోనా టీకాల ప్రక్రియ మొదటి దశలో 732 మంది లక్ష్యంలో ఇప్పటికి 173 మందికి టీకాలు విజయవంతం కావడం, మిగతా లక్ష్యాన్ని పూర్తి చేయడానికి ఇంకా గడువు ఉండటం, ప్రక్రియ నిరంతరం ఇంకా జరుగు తుండటం, గతేడాది అక్టోబర్ 2 న మహాత్మా గాంధీ జన్మదినం సందర్భంగా మొదలై ఈ ఏడాది ఫిబ్రవరి 13 వరకూ కొనసాగే కుష్టు రోగుల గణనలో నేటి వరకూ కొత్త రోగులు నమోదు కాకపోవడం, శంఖవరం, రౌతులపూడి ఆస్పత్రుల్లో నేటికీ కేవలం ఇద్దరు పాత రోగులే ఉండటం, వారికి వైద్యం అందుతున్న పరిస్థితులపై ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో పరిధిలో విలేజ్ క్లీనిక్స్ ఎక్కడెక్కడ ఎన్ని ప్రారంభించారు, ఆస్పత్రిలో పరిధిలోని గ్రామాలకు 104 వాహనాలు ఎన్ని వస్తున్నాయి, ఆస్పత్రిలో కన్ను, ముక్కు, చెవి, దంత వైద్య విభాగాల ఉద్యోలు ఎంత మంది ఉన్నారు, ఏయే ఉద్యోగులు లేరు అని ఆయన ఆరా తీసారు. సంబంధిత గణాంకాలు, వివరాల్ని రమేష్ సేకరించారు. ఈఎంటీ వైద్యురాలు డెప్యుటేషన్లో ఉన్నారని, దంత వైద్యం అందుతున్నదని ప్రధాన వైద్యుడు ఆర్వీవీ సత్యనారాయణ వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా జరిగే లక్ష్యంలో ప్రభుత్వం లక్ష్యాలు తెలియని పక్క ఆసుపత్రుల తోటి సిబ్బందికి చెప్పి వారితో సక్రమంగా పని చేయించాలని ఈ సందర్భంగా శంఖవరం ఆస్పత్రి సీనియర్ ఏఎన్ఎం.గ్లోరీని ఆయన ప్రత్యేకంగా ప్రోత్సాహించారు. ఈ సమావేశంలో సీహెచ్ఓ కృష్ణవేణి, ఎంపీహెచ్ఈఓ. మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *