* వచ్చే ఎన్నికల్లో వైకాపాకు మరింత ఆధిక్యం
* పాత్రికేయుల సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే

శంఖవరం – తూర్పు గోదావరి
———————————————
ఎవరో ఇచ్చిన తప్పుడు సమాచారం ఆధారంగా ఎంతో అనుభవం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడడం సరికాదని ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరంలోని ఎమ్మెల్యే స్వగృహంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏదో జరిగిపోయి నట్లు ఆయన మాట్లాడడం తమను ఎంతో బాధించింది అన్నారు. ప్రత్తిపాడు నియోజక వర్గంలో ఎంతో సామరస్యంగా, సక్రమంగా ఎన్నికలు జరిగాయని, అధికారులందరూ ఎంతో సమన్వయంతో పనిచేశారని ఆయన తెలిపారు. ఈ సరైన సమాచారాన్ని తెప్పించుకుని చంద్రబాబు నాయుడు మాట్లాడితే మేము సంతోషించే వారమని పర్వత అన్నారు. పోతులూరు గ్రామ సర్పంచ్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో 2,169 ఓట్లు పోలవ్వగా, అందులో 60 ఓట్లు చెల్లనివని అన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 1,053 ఓట్లు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి 1,051 ఓట్లు పడ్డాయన్నారు. అధికారులు రెండు ఓట్ల ఆధిక్యతతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును ప్రకటించారని అన్నారు. తక్కువ వచ్చిన 5 ఓట్లు కోసం మళ్ళీ ఓట్లను లెక్కించారని అన్నారు. అధికారులు 25 ఓట్లు ఒక్క కట్ట చొప్పున వేరు చేశారని రీకౌంటింగ్లో ఆ కట్టలను మరలా లెక్కించగా ఒక కట్టలో 27 ఓట్లు, ఒక కట్టలో 27 ఓట్లు, ఒక కట్టలో 26 ఓట్లు ఉన్నా యన్నారు. ఆ అయిదు ఓట్లలోనూ 4 ఓట్లు తమ పార్టీ అభ్యర్థికి పడ్డాయని, ఒక ఓటు టిడిపి పార్టీకి
అభ్యర్థికి వచ్చిందని అన్నారు. అప్పుడు ఎన్నికల అధికారులు 6 ఓట్ల ఆధిక్యతతో తమ పార్టీ అభ్యర్థి గెలుపొందినట్లు ధృవీకరించారని స్పష్టం చేశారు. అంతే తప్ప అంతకు మించి ఏం జరగ లేదని ఆయన పేర్కొన్నారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచు కున్నదని, ప్రత్తిపాడు నియోజక వర్గంలో 75 సర్పంచ్ స్థానాలకు గానూ 60 సర్పంచ్ స్థానాలను వైయస్సార్ పార్టీ కైవసం చేసుకుందని తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో జరిగిన పోలింగ్ శాతం కంటే ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగిందని, గత అసెంబ్లీ ఎన్నికల కంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో చాలా అత్యధిక ఆధిక్యత రావడం గర్వకారణమని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైయస్సార్ పార్టీకి 4,800 ఓట్ల ఆధిక్యత రాగా, ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో సుమారుగా 22,000 ఓట్లు ఆధిక్యత వచ్చాయి అన్నారు. ఈ విజయం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మ ఒడి, నవరత్నాలు పేదలందరికీ ఇల్లు, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ స్థలాలు, వాహన మిత్ర, వైయస్సార్ ఆసరా మొదలగు సంక్షేమ పథకాల వల్లే సాధ్య మైంది అన్నారు. రానున్న మండల పరిషత్, మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా ఇదే ఒరవడి కొనసాగు తుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. జగనన్న పథకాలే ఆ గెలుపునకు కారణం అవుతాయి అన్నారు. తన నియోజక వర్గంలోని విజేతలు అందరికి అభినందనలు (తెలిపారు) అలాగే గెలిపించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలు, ఓటర్లకు ఈ సందర్భంగా ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ కృతజ్ఞతలను తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *