* అన్నవరం ఉప సర్పంచ్ పదవి ఏకగ్రీవం
* పాలక వర్గానికి ధృవ పత్రాల అందజేత
* గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్న పాలక వర్గం
* తొలి ఏడాదే ఉత్తమ పంచాయితీని చేస్తాం
* రోడ్ల కిరువైపులా పూల మొక్కల ఆహ్లాదం

అన్నవరం – తూర్పు గోదావరి
—————————————–
అన్నవరం రత్నగిరి శ్రీవీరవెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి ఏటా రూ. కోటి వరకూ పన్ను రూపంలో రాబట్టాల్సి ఉందని అన్నవరం పంచాయితీ తాజా సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం మేజర్ పంచాయితీ ఎన్నికల అధికారి సీహెచ్. ఉమామహేశ్వరరావు పర్యవేక్షణలో ఉప సర్పంచ్ ఎన్నిక, పాలక వర్గ సభ్యులకు ధృవీకరణ పత్రాలు అందజేత కార్యక్రమాలను పంచాయితీ కార్యాలయంలో గురువారం సాయంత్రం 4 గంటలకు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధికి పాలక వర్గం సభ్యులు చేయేబోయే కృషి ని, ఆకాంక్షలను సభ ముందుంచారు. తొలుత సర్పంచ్ కుమార్ రాజా మాట్లాడారు. అన్నవరం దేవస్థానానికి ఏటేటా సుమారు రూ. 130 కోట్ల మేరకు ఆదాయం లభిస్తోందని, కానీ దేవస్థానం పంచాయితీకి పన్నుచెల్లించడం లేదనీ, పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం దేవస్థానం ఆదాయం నుంచి 1 శాతం పంచాయితీ పన్ను కింద ఏటా రూ. కోటి వరకూ చెల్లించాలన్నారు. ఈ పన్ను రాబట్టే విషయంలో రాజీ పడమన్నారు. స్థానికంగా జాతీయ రహదారిపైకి చొచ్చుకు వచ్చిన మార్కెట్ ను ప్రక్షాళన చేసి ప్రత్యామ్నాయంగా మార్కెట్ ను మరింత అభివృద్ధి చేసి అన్ని వర్గాల వారికీ వినియోగంలోకి తేవాలన్నారు. గ్రామంలోని ప్రధాన రహదారి కిరువైపులా రంగుల పూల మొక్కలును పెంచి ఆహ్లాదకరమైన వాతావరణం సృష్టించాలన్నారు. తొలి ఏడాది కాలంలోనే గ్రామ పంచాయితీకి ఉత్తమ పంచాయితీ అవార్డు తెస్తామన్నారు. స్మశాన వాటికలు, వాటికి ప్రహారీ గోడలను, ఆధునిక శవ దహన వాటికలను నిర్మించాలని పేర్కొన్నారు.

గ్రామ సంపూర్ణ పారిశుద్ధ్యం కోసం ప్రతి పక్షం రోజులకూ వార్డుల్లో సభ్యులు పర్యటించి పర్యవేక్షించాలి అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తిరుపతి తర్వాత శరవేగంగా విస్తరిస్తున్న అన్నవరం గ్రామ ప్రజల ఆశలు ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ క్రమంగా అభివృద్ధి వేగం పుంజుకునేలా పాలక వర్గం కృషి చేయాలి అన్నారు. పంచాయితీ సర్పంచ్ చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో 2016 ఓట్ల ఆధిక్యత నిచ్చిన ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకూడదని కుమార్ రాజా పేర్కొన్నారు. అందుకోసం ఈ ఐదేళ్ళలోనూ పాలక వర్గం అంతా ఒకటే మాట ఒకే బాటగా గ్రామ సమగ్ర అభివృద్ధికి కృషి చేద్దామన్నారు. అందుకోసం ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్, మంత్రులు, ఎంపీల సంపూర్ణ సహకారాన్ని తీసుకుందాం అని కుమార్ రాజా పేర్కొన్నారు. ఆయన అనంతరం ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకన్నబాబు, మిగతా వార్డు సభ్యులూ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని హామీ నిచ్చారు. ఈ కార్యక్రమంలో సచివాలయం కార్యదర్శి బర్ల రామశ్రీనివాస్, వీఆర్వోలు టి.అచ్యుతం, పోతుల రాజశేఖర్, మాజి ఎంపీటీసీ సభ్యులు మడ్డు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *