ఎం.ఎల్.ఏకు సామాజీ”కుల” వినతులు
* ఉప సర్పంచ్ ను తామే ఎన్నుకున్న వర్గం
* ఫలించిన ఎమ్మెల్యే చాణుక్య వ్యూహం

అన్నవరం – తూర్పు గోదావరి
——————————————–
అన్నవరం ఉప సర్పంచ్ పదవిని ఎలాగైనా దక్కించు కునేందుకు ఐదు సామాజిక వర్గాల నుంచి బలంగా ఎదురైన తీవ్ర వత్తిడి, ఒకింత ఎదురైన అసమ్మతికి ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణంద్ర ప్రసాద్ తన రాజకీయ చాణక్య నీతితో చాకచక్యంగా చెక్ పెట్టారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం పంచాయతీకి ఎన్నికైన నూతన పాలకవర్గ సభ్యుల్లో ఒకరికి దక్కే ఉప సర్పంచ్ పదవికి స్థానిక అశావహుల్లో అనివార్యంగా పోటీ ఏర్పడింది. దీనితో ఎన్నికైన వార్డు సభ్యులు అందరూ తమ సామాజిక వర్గాల సమీకరణలతో, జన బలంతో పెద్దల సహకారంతో ఎమ్మెల్యేకు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నం చేసారు. ఎన్నికల ముందు సర్పంచ్, వార్డు అబ్యర్దుల ప్రతిపాదన సమయంలో కూడా స్థానిక వై.సి.పి పార్టీ నాయకుల ఆధిపత్య పోరు కనిపించడంతో దానిని సర్దుబాటు చేయడానికి ఆన్నవరంలో రెండు సార్లు ఎమ్మెల్యే పర్యటించారు. ఈ సందర్భంగా వర్గాలను సముదాయించారు. ఇంటి పోరును చక్కదిద్దడంతో ఇక్కడ నాయకుల వర్గ పోరు సద్దుమణిగింది. దీంతో వర్గ పోరు పోయి సర్పంచి అభ్యర్థి శెట్టిబత్తుల కుమారరాజా ఘన విజయం నల్లేరుపై బండి నడక అయ్యింది. ఆయన గెలుపునకు కలిసొచ్చింది. అప్పుడు నాయకుల మధ్య సర్పంచ్ అభ్యర్థిత్వానికి వర్గ పోరు తాత్కాలికంగా కనిపిస్తే… మంగళవారం వరకూ ఉప సర్పంచ్ పదవి కాస్తా తమ సామాజిక వర్గాలకు ఇమ్మంటూ ఐదు సామాజిక వర్గాల నేతలు, ప్రజలు ఎమ్మెల్యే దగ్గరకు వెళ్ళారు. ఫలితంగా అన్నవరం ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇలా ఉండగా ఒకరు ఇద్దరు వార్డు సభ్యులు అయితే, తనకు ఉప సర్పంచ్ పదవీ అవకాశం ఇస్తూ… తనకు మద్దతు ఇస్తే వార్డు సభ్యులకు తగు రీతిలో పెద్ద మొత్తంలో నగదు పారితోషికం ఇస్తామని, లోపాయికారీ ఒప్పందం కుదుర్చు కున్నట్లు వినికిడిలో ఉంది. ఈ సమాచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ఈ నేపధ్యంలో ఈ ఉపసర్పంచ్ పదవి ఎం.ఎల్.ఏ. సూచించిన వార్డు సభ్యుడినే మిగతా వార్డు సభ్యులు అందరూ ఎన్నుకుంటారా లేక నజరానా ప్రకటించిన ఆశావహుడినే ఎన్నుకుంటారా అన్నది చర్చనీయాంశం అయింది. వీటన్నింటికీ తన స్వగృహంలో గురువారం మధ్యాహ్నం ఎమ్మెల్యే తెర దించేసారు. సర్పంచ్ శెట్టిబత్తుల కుమార రాజాతో సహ పాలక వర్గం సభ్యులు అందరూ ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా ఆయన స్వగృహంలో ఉదయం 8 గంటలకు కలిసారు. అప్పుడు అసమ్మతికి పరిష్కారం కనుగొన్నారు. సున్నిత విషయమైనందున సర్పంచ్ తటస్థంగా మౌనంగా ఉన్నారు. ఉప సర్పంచ్ ను ఎన్నుకునే బాధ్యతను ప్రజల విజ్ఞత, నిర్ణయాలకే ఎమ్మెల్యే విడిచి పెట్టారు. పంచాయితీలోని 16 వార్డు మంది సభ్యుల్లోనూ 10 మంది వార్డు సభ్యులు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే ఉండటంతో ఆ వర్గానికి, పార్టీ పటిష్ఠతకూ ప్రాధాన్యం ఇస్తూ బీసీ 9 వార్డు సభ్యుడు బొబ్బిలి వెంకన్నబాబును
ఉప సర్పంచ్ గా అన్ని సామాజిక వర్గాల వారూ ఏకగ్రీవంగా నిర్ణయించారు. సాయంత్రం 4 గంటలకు అన్నవరం పంచాయితీ కార్యాలయం లో సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఉప సర్పంచ్ గా బొబ్బిలి వెంకన్నబాబును అధికారికంగా మిగతా పాలక వర్గం ఎన్నుకున్నది. ఈ మేరకు అన్నవరం పంచాయితీ ఉప సర్పంచ్ గా బొబ్బిలి వెంకన్న బాబు ఎన్నికైనట్టు అధికారిక ధృవీకరణ పత్రాన్ని వెంకన్న బాబుకు అన్నవరం ఎన్నికల అధికారి సీహెచ్. ఉమామహేశ్వర రావు అందజేసారు. ఈ విధంగా అన్నవరం వైకాపా అసమ్మతికి చెక్ పెట్టారు. ఈ కార్యక్రమాల్లో శంఖవరం మాజీ సర్పంచ్ పర్వత రాజబాబు, సచివాలయం కార్యదర్శి బర్ల రామశ్రీనివాస్ , వీఆర్వోలు టి.అచ్యుతం, పోతుల రాజశేఖర్, మాజి ఎంపీటీసీ సభ్యులు మడ్డు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *