* అన్నవరానికి రైతు బజార్ సాధిస్తా
* సరుకుల రవాణా వాహనాలు ప్రారంభం
* సిబ్బందితో సర్పంచ్ తొలి సమావేశం
* సిబ్బందిపై వత్తిడి, కక్ష సాధింపు ఉండవు
* ప్రభుత్వ విధులను విస్మరిస్తే ఉపేక్షించం
* సర్పంచ్ కుమార్ రాజా అభిలాష
(సచివాలయం నుంచి జనాస)
అన్నవరం – తూర్పు గోదావరి
——————————————–
అన్నవరం నుంచి ఐఎఎస్, ఐపీఎస్ టాపర్లు తయారు కావాలని, తనకున్న ప్రణాళిక ప్రకారం ఆ లక్ష్యం దిశగా దశల వారీగా కృషి చేస్తానని
అన్నవరం సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. అన్నవరం అభివృద్ధిలో తన ఎన్నికల హామీల్లో ఒకటైన గ్రంధాలయాన్ని ఏర్పాటు చేయడంతోపాటు గ్రామాన్ని విజ్ఞాన కేంద్రం (నాలెడ్జి సెటర్/ హబ్) గా తీర్చి దిద్దుతానన్నారు. ఈ నాలెడ్జి సెంటర్ నుంచే అన్నవరంనకు రాష్ట్ర అత్యున్నత స్థాయి ఐఎఎస్, ఐపీఎస్ టాపర్లు ఉద్భవించాలనేది నా చిరకాల కోరిక అన్నారు. గతంలో ఎన్నో ఉన్నత పదవులను చేపట్టిన తాను ఆ లక్ష్య సాధన కోసమే సర్పంచ్ ను అయ్యాను అన్నారు. పంచాయితీ పాలనలో తనదైన ముద్ర ఉంటుందని కుమార్ రాజా పేర్కొన్నారు.
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం అన్నవరం సచివాలయం 1 వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ఇంటింటికీ నిత్యావసర సరుకుల పంపిణీని, జెండా ఊపి సరకుల రవాణా వాహనాలను, సచివాలయం భవనంలోని తన కార్యాలయాన్ని సర్పంచ్ కుమార్ రాజా మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మూడు సచివాలయాల సిబ్బంది, గ్రామం పరిధిలోని ఆస్పత్రి, ఇతర శాఖల సిబ్బందితో మధ్యాహ్నం 12 గంటలకు ఆయన తొలి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా సిబ్బంది ఆయా శాఖల నుంచి ఒక్కొక్కరూ తమ నూతన సర్పంచ్ కుమార్ రాజాకు పరిచయం చేసుకున్నారు. అనంతరం రేషన్ సరుకుల లబ్దిదారులు, పంచాయితీ పాలకవర్గం, గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, ఉద్యోగులను ఉద్దేశించి వేర్వేరుగా ఆయన మాట్లాడారు. అన్నవరం సమగ్రాభివృద్ధికి సిబ్బంది అందరూ సమన్వయంతో కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన అభివృద్ధి, సంక్షేమం లక్ష్యాలు నెరవేరడంలో పేద ప్రజలకు ప్రభుత్వ ఉద్యోగులు, వలంటీర్లే అండగా ఉండాలని సర్పంచ్ కుమార్ రాజా పిలుపు ఇచ్చారు. ప్రభుత్వ సిబ్బందిపై సర్పంచ్ గా తన వత్తిడి, కక్ష సాధింపు చర్యలు ఉండదని, సిబ్బంది స్వేచ్ఛగా ప్రభుత్వ విధులను నిర్వర్తించు కోవచ్చునని, విస్మరిస్తే ఉపేక్షించం ఆయన స్పష్టం చేశారు. సిబ్బంది అంతా ప్రతీ నాలుగు నెలలకోసారి గ్రామంలోని అన్ని వార్డులలోనూ పర్యటించి ప్రధానంగా తాగునీటి ఎద్దడి, అపారిశుద్ధ్య, వీధి దీపాల సమస్య లేకుండా చేయాలని సిబ్బందిని సర్పంచ్ ఆదేశించారు. సిబ్బంది సహకారంతోనే గ్రామానికి స్మశాన నాటికలు, ఇతరత్రా సౌకర్యాలు, సమగ్రాభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామానికి ప్రభుత్వ రైతు బజార్ అవసరం, జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డికి విన్నవించి త్వరలో రైతు బజార్ ను సాధిస్తామని, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కోనశశిధర్, జిల్లా జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ, ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ సంయుక్త సహకారంతో కలెక్టర్ ద్వారా ఇక్కడకు రైతు బజార్ ఏర్పాటుకు కృషి చేస్తా మన్నారు. ఈ విషయాన్ని ప్రస్తుతానికి శంఖవరం మండల డిప్యూటీ తహశీల్దార్ తేజస్విని దృష్టిలో పెడుతున్నానని కుమార్ రాజా పేర్కొన్నారు.
స్థానిక మూడు సచివాలయాల సిబ్బంది సర్పంచ్ కుమార్ రాజాకు గజమాలను వేసి అభినందించారు. అనంతరం తన కార్యాలయంలో వివిధ ప్రజల సమస్యలను, విజ్ఞాపనలనూ సాంతం ఓపికగా విన్నారు. ఈ కార్యక్రమాల్లో ఉప సర్పంచ్ బొబ్బిలి వెంకన్నబాబు, మాజీ సర్పంచ్ రజాల చిట్టిబాబు, సచివాలయాల కార్యదర్శులు బి. రామశ్రీనివాస్, సత్యనారాయణ, వీఆర్వో అచ్యుతం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.