* అధికారుల నిర్లక్ష్యంతో రైతులకు నష్టం

(జర్నలిస్టు మూర్తి / 90598 5851)

గొల్లప్రోలు – తూర్పు గోదావరి
—————————————–
గొల్లప్రోలు రైతుల ప్రయోజనం కోసం ఏర్పడిన వ్యవసాయ పరపతి సంఘాలు రైతుల పాలిట గుదిబండలుగా మారాయన్న విమర్శలు విని పిస్తున్నాయి. ప్రభుత్వ పధకాలను రైతులకు వివరించి వారిని భాగస్వాములను చేయవలసిన సోసైటి అధికారులు తమ బాధ్యతను విస్మరించి సోసైటి లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తూ వడ్డీ వ్యాపారులు మాదిరిగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం
గొల్లప్రోలు సొసైటీలో సభ్యులుగా ఉన్న రైతులకు గత ఏడాదికి సంబంధించిన క్రాప్ ఇన్సూరెన్స్ మంజూరు కాకపోగా పంట రుణాలపై కొద్ది మందికే వడ్డీ రాయితీ మంజూరు కావడంపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా సొసైటీ పరిధిలో రైతుల పంటలు పూర్తిగా నష్టపోయి అప్పులపాలైన రైతుల నుంచి అమలూ, వడ్డీలను సైతం ముక్కు పిండి మరీ వసూలు చేస్తుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు ఆయకట్టు పరిధిలోని రైతులు గత రెండు సంవత్సరాలుగా కురిసిన భారీ వర్షాలకు ఏలేరు, సుద్దగడ్డ వరదలు కారణంగా పంటలను పూర్తిగా కోల్పోయారు.

పంటల సాగుపై పెట్టిన పెట్టుబడులు సైతం దక్కక రైతులు పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకు పోయారు. 1999 -2000 సంవత్సరానికి సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ కొద్ది నెలల క్రితం ప్రభుత్వం మంజూరు చేయడంతో రైతులు కొంత మేరకు ఊరట పొందారు. అయితే కమర్షియల్ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్న రైతులకే ఇన్సూరెన్స్ మంజూరు కాగా సొసైటీ ద్వారా రుణం పొందిన రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ మంజూరు కాక పోవడంతో రైతులు అయోమయానికి గురయ్యారు.ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులు వివరాలు సొసైటీ అధికారులు సకాలంలో సంభందిత అధికారులకు అందజేయక పోవడం వల్లే భీమా సొమ్మును రైతులు కోల్పోవలసి వస్తుందన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఇందుకు సంబంధించి సొసైటీ అధికారులు సైతం ఎటువంటి ప్రకటన చేయకుండా మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతే కాకుండా రైతులు రుణాలకు సంబంధించి వడ్డీ రాయితీ నుంచి ప్రభుత్వం మంజూరు చేసిన సొసైటీ పరిధిలోని కొంత మంది రైతులకే వడ్డీ రాయితీ రావడంపై సొసైటీ అధికారులు పని తీరుకు అర్దం పడుతుంది. రైతుల నుండి వడ్డీ లను నిర్బంధంగా వసూలు చేసే అధికారులు రైతులకు వడ్డీ రాయితీ మంజూరుపై తగిన కృషి చేయక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పంటల భీమా వర్తించక పోవడం, వడ్డీ రాయితీ కొంత మందికే మంజూరు కావడం తదితర అంశాలపై సొసైటీ కార్యదర్శి, సిబ్బంది పని తీరుపై జిల్లా ఉన్నతాధికారులు విచారణ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *