గొల్లప్రోలు నగర పంచాయితీ అధికార పీఠం అధికార వైసీపీకి దక్కేనా… !

* గెలుపు కోసం టి.డి.పి. విశ్వ యత్నాలు
* నగర పంచాయితీ ఎన్నికల్లో తప్పని ఉత్కంఠ

     (జర్నలిస్ట్ మూర్తి  / 9059858516)

గొల్లప్రోలు – తూర్పు గోదావరి
———————————————-
గొల్లప్రోలు నగర పంచాయితీ ఆవిర్భావం అనంతరం మొదటి సారిగా జరిగిన గత ఎన్నికలలో తృటిలో అధికారం చేజారి పోవడంతో ఈ ఎన్నికలలోనైనా విజయం సాధించి తీరాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో ఓటమి పాలైన తెలుగు దేశం పార్టీ మాత్రం ఈ నగర పంచాయితీ ఎన్నికల్లోనైనా విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించు కోవాలని  పట్టుదలతో ఉంది. దీంతో ఈ రెండు పార్టీల మద్య హోరా హోరీ పోరు తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. నగర పంచాయితీ పరిధిలో
20,701 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 10,536 మంది పురుషులు, 10,164 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. పట్టణంలో 20 వార్డులు ఉండగా వాటికి 97 నామినేషన్లు దాఖలు అయ్యాయి. వీరిలో వైసీపీ తరపున 51 మంది,   జనసేన అభ్యర్థులు 36 మంది, బి.జె.పీ. అభ్యర్థులు ముగ్గురు నామినేషన్లు వేసారు. గత ఎన్నికల్లో 20 వార్డుల్లోని 1 వార్డులో టి.డి.పి. అభ్యర్థి ఏకగ్రీవంగా గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 19 వార్డులకుగాను 10 వార్డులు వైసీపీ అభ్యర్థులు, 9 వార్డుల్లో టి.డి.పి. అభ్యర్థులు గెలుపొందారు. దీంతో ఇరు పార్టీల బలాబలాలు సమానంగా ఉన్నప్పటికీ వైసీపీ తరపున గెలుపొందిన ఒక  కౌన్సిలర్ ప్రలోభాలకు లొంగి టి.డి.పి.లోకి ఫిరాయించడంతో తెలుగు దేశం పార్టీకి చైర్మన్ పదవి దక్కింది. గత ఎన్నికలలో వైసీపీ తరపున కౌన్సిలర్ అభ్యర్థులు ఎక్కువ మంది గెలుపొంది నప్పటికి టి.డి.పి. వ్యూహాత్మకంగా వ్యవహ రించడం వైసీపీ పరాజయం పొందవలసి వచ్చింది . గత ఎన్నికలలో జరిగిన తప్పిదాలకు తావు ఇవ్వకుండా ఈసారైనా ఎలాగైనా విజయం సాధించాలని వైసీపీ ప్రయత్నిస్తోంది. చైర్మన్ పదవిని జనరల్ మహిళలకు కేటాయించడంతో ఇరు పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం వైసీపీ తరఫున పార్టీ జిల్లా కార్యదర్శి మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ మొగలి మాణిక్యాలరావు, సతీమణి మాజీ కౌన్సిలర్ వెంకట జయలక్ష్మి, టి.డి.పి. తరపున దివంగత మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ టి.డి.పి. నాయకుడు మాదేపల్లి రంగబాబు కుమార్తె నాగినిచంద్ర చైర్మన్ అభ్యర్థులుగా ప్రచారంలో న్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రస్తుతం వైసీపీ పట్ల ఉన్న ఆదరణ తమకు విజయం చేకూరుస్తాయని అధికార పార్టీ నాయకులు భావిస్తుండగా, దివంగత నాయకుడు మాదేపల్లి రంగబాబుపై ఉన్న అభిమానం, సానుభూతి తమకు సానుకూల అంశాలుగా టి.డి.పి. నాయకులు పేర్కొంటున్నారు. వైసీపీలో ఉన్న అంతర్గత విభేదాలు, కొన్ని వార్లుల్లో ఆ స్థానం కోసం ఎక్కువ మంది అభ్యర్థులు ఆ పార్టీ తరపున నామినేషన్లు దాఖలు చేయడం వైసీపీకి తల నొప్పిగా మారే అవకాశంం ఉందని పలువురు పేర్కొంటున్నారు. టి.డి.పి.కి పెద్ద దిక్కుగా ఉండే రంగబాబు దివంగతుడు కావడంతో ఆ నాయకత్వ లేమి ఆ పార్టీకి తీరని లోటని, ఆ ప్రభావం ఎన్నికలలో ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికి మాజీ ఎమ్మెల్యే వర్మ నగర పంచాయితి ఎన్నికలలో ఎలాగైనా టిడిపీని గెలిపించాలని పట్టుదలగా ఉండటంతో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎన్నికలలో భంగపాటు తప్పదని పలువురు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *