* పాత భవనం స్థానే కొత్తది నిర్మాణం
* వ్యాపారుల విరాళాలతో భాగస్వామ్యం
* కొత్త పాలక వర్గం తాజా నిర్ణయం
* కార్యాచరణకు తీర్మానమే ఆలస్యం

అన్నవరం – తూర్పు గోదావరి
—————————————-
శంఖవరం మండలం అన్నవరంలో పంచాయితీ షాపింగ్ కాంప్లెక్స్ బహుళ అంతస్తుల భవనాన్ని నిర్మించాలని పాలక వర్గం నిర్ణయించింది. స్థానిక పోలీస్ స్టేషన్ కు ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని వున్న పంచాయితీకి చెందిన పూర్వపు శిధిలమైన షాపింగ్ కాంప్లెక్స్ స్థానే మరొక నూతన భవనాన్ని నిర్మించి వ్యాపారస్తులకు పూర్వం మాదిరిగానే అద్దెకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ భవనంలో నలు వైపులా కొన్ని గదులతో దుకాణాల సముదాయాన్ని పూర్వం ఎప్పుడో పెంకుల షెడ్డులా నిర్మించారు. కాలక్రమంలో ఇది శిధిల స్థితికి చేరుకుంది. అయినా ఈ భవనంలోని దుకాణాలను అద్దెకు ఇచ్చి ఏటేటా సొమ్ములను వసూలు చేయడం తప్ప దీని జీర్ణోద్దరణకు పంచాయితీ పూర్వపు పాలక వర్గాలు పూను కోలేదు. గత్యంతరం లేని స్థితిలో అద్దెకు ఉంటున్న వారే బరకాలను, గోనె సంచులను పెంకుల పైకప్పుపై వేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక వర్షం వస్తే అంతే సంగతులు. వర్షానికి వ్యాపారుల కష్టాలు తడిసి మోపెడు అవుతాయి. ఈ దుకాణాలు కొన్ని కొందరు గుత్తేదారుల చేతుల్లో ఉన్నందున వారి దగ్గర అద్దెకు తీసుకున్న వ్యాపారులు అటు పంచాయితీని గాని , ఇటు గుత్తేదారులను గాని ఈ దుస్థితిపై నిలదీసి అడగలేక పోతున్నారు. గుత్తేదారులు మాత్రం అటు దుకాణాలను, దుకాణాల ముందు రోడ్డు ఖాళీ జాగానూ కూడా విడివిడిగా అద్దెలకు ఇచ్చి గుత్తేదారులు రెండు చేతులా ఆదాయాన్ని
దండిగా దండు కుంటున్నారు. పంచాయితీ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారు. ఈ నేపధ్యంలో ఈ దుకాణాల సముదాయం సమస్యలపై నూతన పాలక వర్గం దృష్టి సారించింది. పాత పెకుటిల్లు స్థానే నూతన కాంక్రీట్ సిమెంటు పక్కా భవనాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ భవనాన్ని కత్తిపూడి పంచాయితీ రాజ్ డిఈఈ. వెంకటేశ్వరరావుకు చూపించారు. అంచనా వ్యయాన్ని, భవన ప్రణాళికను రూపొందించాలని కోరారు. ఈ భవన నిర్మాణానికి ప్రభుత్వం / పంచాయితీ విధులకు తోడు బయట నుంచి కుడా నిధులను సమకూర్చుకునే ప్రత్యామ్నాయ తరుణోపాయాన్ని కూడా పాలకవర్గం ఆలోచించింది. అద్దెకు ఉండగోరే వ్యాపారుల నుంచి కొంత నిర్ణీత ధరావత్తు సొమ్ములను బయానాగా తీసుకుని, వ్యాపారులను నిర్మాణంలో భాగస్వామ్యం చేయాలని తలంచింది. వారి బయానా సొమ్ములు, ప్రభుత్వ, పంచాయితీ నిధులతో పక్కా భవనాన్ని నిర్మించాలని నిర్ణయించారు. ఈ విషయాలను సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా “మనం న్యూస్” వద్ద ధృవీకరించారు. ఆ మేరకు పాలక వర్గం నిర్ణయం తీసుకున్నా మన్నారు. పాలక వర్గం ప్రమాణం స్వీకారం అనంతరం ఈ విషయమై తీర్మానం చేసి అమలు చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *