* చైర్మన్ అభ్యర్ధి ఖరారు కాని వైనం
* ఆందోళన చెందుతున్న కార్యకర్తలు

  (జర్నలిస్ట్ మూర్తి / 9059858516)

గొల్లప్రోలు – తూర్పు గోదావరి
——————————————–
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శాసనసభ నియోజకవర్గం గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల  నోటిఫికేషన్ త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో వైసీపీలో ఇంతవ రకు చైర్మన్ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించక పోవడంపై కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్ధిగా దివంగత మార్కేట్ కమిటీ చైర్మన్ మాదేపల్లి రంగబాబు కుమార్తె నాగినిచంద్రకు దాదాపు ఖరారు చేశారు. అయితే వైసీపీలో మాత్రం చైర్మన్ అభ్యర్థిత్వం కోసం రెండు వర్గాల మధ్య అంతర్గత పోరు కొనసాగుతోంది. గొల్లప్రోలు నగరపంచాయితి చైర్మన్ పదవి జనరల్ మహిళకు కేటాయించారు. వైసీపీలో చైర్మన్ అభ్యర్థిత్వం తమ సతీమణులకే కేటాయించాలని ఒక వైపు జిల్లా కార్యదర్శి మొగిలి అయ్యారావు, మరో వైపు పార్టీ  సీనియర్ నాయకుడు గండ్రేటి శ్రీరామచంద్ర మూర్తి
ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. గతేడాది ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయినప్పుడు కొద్ది రోజుల సందిగ్ధత ఆనంతరం చైర్మన్ అభ్యర్ధిగా మొగిలి మాణిక్యాలరావు సతీమణి వెంకటజయలక్ష్మినే పిఠాపురం శాసన సభ్యులు పెండెం దొరబాబు సూచన ప్రాయంగా ఖరారు చేసారు. అప్పటి నుండి వైసీపీ కార్యకర్తలు ఆమేనే చైర్మన్ అభ్యర్ధిగా ప్రచారం చేస్తున్నారు. అయితే చైర్మన్ అభ్యర్ధిని అధికారికంగా ఖరారు చేయలేదనే ప్రచారం ఇటీవల అనూహ్యంగా
జరుగుతోంది. గత ఎన్నికల్లో చైర్మన్ పదవి బిసి జనరల్ కు కేటాయించడంతో వైస్ చైర్మన్ అభ్యర్ధిగా మొగిలి వెంకటలక్ష్మిని పార్టీ అధికారికంగా ప్రకటించడంతో అయ్యారావు నాయకత్వంలో కార్యకర్తలు కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. అప్పట్లో టిడిపి, వైసీపీ పార్టీలు చెరో 10 స్థానాలు గెలుచుకోవడంతో వైసీపీకి చెందిన ఒక కౌన్సిలర్ పార్టీని ఫిరాయించి టిడిపి విజయానికి సహకరించడంతో వెంకట జయలక్ష్మికి వైస్ చైర్మన్ పదవి తృటిలో చేజారి పోయింది. గత ఎన్నికలలో పార్టీ అభ్యర్ధుల విజయానికి కృషి చేయడంతో పాటు, వైసీపీ అధికారంలో లేని సమయంలో పార్టీ అభివృద్ధికి కృషి చేయడంతో అయ్యారావు సతీమణి వెంకటజయలక్ష్మికే చైర్మన్ పదవి కేటాయించాలని ఒక వర్గం పేర్కొంటోంది.

అయితే పార్టీ సీనియర్ నాయకుడు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే పెండెం దొరబాబు విజయానికి కృషి చేయడమే కాకుండా ఆర్థికంగా ఖర్చుకు వెనుకాడలేదు. నిరంతరం కార్యకర్తలకు వెన్ను దన్నుగా నిలిచారు. కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపారు. కార్యకర్తలను సమీకరించడంతో పాటు ఆర్థిక వెసులుబాటును కల్పించారు. పార్టి కార్యకలాపాల్లో తనకున్న అనుభవం, వ్యూహరచన చేసి ప్రతి నాయకులకు చుక్కలు చూపించి పార్టీ నాయకులకు అండగా నిలుస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు అందు బాటులో ఉన్న గుండ్రటి శ్రీరామచంద్రమూర్తి సతీమణినే చైర్మన్ అభ్యర్ధిగా ఎంపిక చేయాలని మరో వర్గం గట్టిగా పట్టుబడుతోంది. ఇప్పటికె ఇరు వర్గాల వారూ తమ తమ మద్దతు దారులను కౌన్సిలర్ అభ్యర్థులుగా నామినేషన్ వేయించారు. గండ్రేటి శ్రీరామచంద్ర మూర్తి కౌన్సిలర్ అభ్యర్థుల విజయానికి ఆర్థికంగా ఖర్చుకు వెనుకాడరని ఓ నమ్మకం ఉంది. ఇదిలా ఉండగా పార్టీ పరంగా ఎక్కువ మంది కార్యకర్తల మద్దతు అయ్యారావుకే ఉందని మరి కొందరు అంటున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నేతృత్వంలో యిప్పటికే టిడిపి కార్యకర్తలు సమావేశం నిర్వహించుకొని కార్యాచరణ రుపొందించు కున్నారు. వైసీపి మాత్రం అభ్యర్ధి ఖరారు పైనే మల్లగుల్లాలు పడుతుండటంతో కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎమ్మేల్యే దొరబాబు ఇప్పటి వరకూ కార్యకర్తల సమావేశం నిర్వహించక పోవడం చైర్మన్ అభ్యర్ధిని అధికారికంగా ప్రకటించక పోవడంపై అయోమయానికి గురవుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలలోపే అభ్యర్ధిని ప్రకటిస్తారా ?, లేక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన అనంతరమే చైర్మన్ అభ్యర్ధిని నిర్ణయిస్తారా?, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాలను సముదాయిస్తారా ? అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *