* ఒకే రోజు, ఒకే సమయంలో ఎమ్మెల్యే , ఆయన అనుచరుడు బొలిశెట్టి విందులు
* ఇరకాటంలో పడ్డ కార్యకర్తలు
* ఇరువురిలో ఎవరిది పైచేయి … ?

ఎస్.రాయవరం – విశాఖ జిల్లాa
——————————————–

ఒక ఎమ్మెల్యే, ఆయన అనుచరుడు … ఇద్దరూ ఒకే రోజు, ఒకే సమయంలో పోటా పోటీగా   వేర్వేరుగా విందు రాజకీయ కూటములు నడిపిన వైనమిది….  వీరిరువురూ వేరెవరో కాదు… ఇద్దరూ ఒకే పార్టీలోని వారే…. ఒకరి కొకరు లోగడ పరస్పరం పరోక్ష విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకున్న ఎవరికి వారు పాత కథానాయకులే. ప్రస్తుతం ఒకరి కొకరు పరస్పరం సహకరించు కోవలసినవారే…. వారే విశాఖ జిల్లా  పాయకరావుపేట వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు ఒకరు ఐతే ఆదే పార్టీలోని  మరో వ్యక్తి యస్. రాయవరంలో ఓ చోటా నాయకుడు బొలిశెట్టి గోవిందు.

గురజాడ జన్మ స్ధలం యస్. రాయవరం గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులకు తాజా ఎన్నికల్లో అఖండ విజయాన్ని ఇచ్చి బొలిశెట్టి గోవిందురావు నాయకత్వాన్ని ఆదరించిన రాయవరం గ్రామ ప్రజలకు తేదీ 23-03-2021 అనగా మంగళవారం ఉదయం 11 గంటల నుండి స్థానిక చిన మదుం సమీపంలోని రెడ్డి గారి శ్రీ వెంకటేశ్వర నగర్ లో విందు కార్యక్రమం జరుగుతుంది కావున ప్రజలందరూ పాల్గొన వలిసినదిగా మనవి అంటూ మంగళవారం నాటికీ మూడు రోజులు ముందు నుంచీ బొలిశెట్టి ఆహ్వానం పంపి ఆ ప్రకారం విందు ఏర్పాటు చేసారు. ఇది ఓ కృతజ్ఞతా విందు కార్యక్రమంగా 
సాధారణ ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఈ విందు వెనుక ఓ అసాధారణమైన ఓ పెద్ద రాజకీయ స్వప్రయోజనం బొలిశెట్టిలో దాగి ఉంది.

భార్యా భర్తలిరువురూ ఎంపీటీసీ అభ్యర్థులే…
————————————————————-
జరుగనున్న మండల పరిషత్తు ఎన్నికల్లో యస్.రాయవరం మండలం నుంచి బొలిశెట్టి గోవిందు ఆయన శ్రీమతి ఇరువురూ రెండు మండల ప్రాదేశిక నియోజక వర్గాల నుంచి పోటీ పడుతున్నారు. ఈ మండలాధ్యక్ష పదవి బీసీ మహిళలకు రిజర్వు కావడంతో తను రెండు ఎంపీటీసీ స్థానానికి పోటీలో ఉండి, తన భార్యను చినగుమ్మలూరు ఎంపీటీసీ స్థానానికి బరిలోకి దించారు. వీరు గెలిచి మండలం పీఠాన్ని భార్య అధిష్ఠిస్తే ఆ కొంగు కృష్ణుడిలా తెరచాటు వాస్తవ పాలన తాను చేయాలనేది గోవిందు వ్యూహాత్మక రాజకీయం. ఈ నేపథ్యంలోనే తాము ఎంపీపీ పోటీలో ఉన్న రానున్న ఎన్నికలకు కార్యకర్తలను సన్నద్దం చేసేందుకే సర్పంచులు, వార్డు సభ్యుల విజయం ముసుగులో విందు రాజకీయానికి బొలిశెట్టి తెర లేపారు. ఈయన ఎంత ముందు చూపు, వ్యూహాత్మకంగా వ్యవహరించారో అంతకంటే ఎక్కువగా వ్యవహారం చురుకుగా 
నడిపి బొలిశెట్టి విందు రాజకీయానికి గండి కొట్టారు. 

కొత్త సర్పంచులకు ఎమ్మెల్యే ఆత్మీయ విందు
————————————————————-
బొలిశెట్టి విందు సమావేశం రోజునే, అదే సమయంలో నియోజకవర్గంలోని 4 మండలాల్లోని కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకూ, వారి విజయానికి కృషి చేసిన కార్యకర్తలకూ ఎమ్మెల్యే బాబూరావు కూడా కోటవురట్ల మండలం రామచంద్రాపురం సమీపంలోని శ్రీపతిరాజు ఫామ్ హౌస్ వద్ద ఆత్మీయ విందును ఏర్పాటు చేసారు. నియోజక వర్గంలోని నాలుగు మండలాల్లో సర్పంచ్ లుగా గెలుపొందిన వారితోపాటు, ఓటమి చెందిన వారు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన వారు, ముఖ్య నాయకులు సమావేశానికి హాజరు కావాలని ఆయన ఆహ్వానించారు. అంతేకాక సరిగ్గా బొలిశెట్టి విందు ఆరంభం సమయంలోనే ఎమ్మెల్యే ఫోన్ చేసి తాను ఏర్పాటు చేసిన నూతన సర్పంచుల ఆత్మీయ విందుకు హాజరు కావాల్సిందిగా బొలిశెట్టిని సాదరంగా ఆహ్వానించారు. దీంతో బొలిశెట్టితో సహా కార్యకర్తలంతా రెండు విందులకూ అటు ఇటూ పరుగులు తీసారు. బొలిశెట్టి విందు గురించి తెలిసే, కావాలనే, ఆదే రోజు, అదే సమయంలో ఎమ్మెల్యే విందుని ఏర్పాటు చేసారా…? లేక బొలిశెట్టి విందు గురించి నిజంగానే తెలియకే ఎమ్మెల్యే ఏర్పాటు చేసారా ? అన్నది కార్యకర్తలకు అర్ధం కాలేదు. ఏదేమైనప్పటికీ బొలిశెట్టి విందు ఆహ్వానం తొలుత సామాజిక మాధ్యమం ద్వారా కార్యకర్తలకు అందింది. ఆ తరువాతే ఎమ్మెల్యే ఆహ్వానం ముందురోజు చక్కర్లు కొట్టింది.

108 కి 82 పంచాయతీలు వైఎస్సార్‌ సీపీవే
————————————————————-
ఈ విందు సందర్భంగా ఎమ్మెల్యే కార్యకర్తలతో మాట్లాడారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని 108 కి 82 పంచాయతీలు వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులే విజయం సాధించారు అన్నారు. పరిషత్ , మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైఎస్సార్‌ సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని ఆయన పిలుపును ఇచ్చారు. అనంతరం నూతన పంచాయితీ పాలకవర్గాలకు ఎమ్మెల్యే దిశానిర్దేశం చేసారు.

మిలియన్ డాలర్ల ప్రశ్నలు …
——————————————
* 1. బొలిశెట్టి గోవిందు విందు విషయం ఎమ్మెల్యేకు ముందుగా చెప్పి ఆయన అనుమతిని బొలిశెట్టి తీసుకోలేదా…?
* 2. బొలిశెట్టి విందుకు ఎమ్మెల్యేను ఆహ్వానించ లేదా… ?
* 3. ఈ రెండూ జరిగితే బొలిశెట్టి విందుకు ఎమ్మెల్యే ఎందుకు రాలేదు…?
* 4. ఆ రెండూ జరిగితే సరిగ్గా అదేరోజు అదే (చివరి) సమయంలో ఎమ్మెల్యే కూడా ఎందుకు ఏర్పాటు చేసారు…?
* 5. ఇద్దరూ ఈ రెండు విందుల విషయమై ముందుగా ఎందుకు మాట్లాడు కోలేదు … ?
* 6. మాట్లాడుకుంటే వేర్వేరుగా విందులు  ఎందుకు ఏర్పాటు చేసినట్లు … ?
* 7. కార్యకర్తలను ఇరుకున ఎందుకు పెట్టినట్టు…? 
* 8. ఈ విందులతో ఎవరు ఏ సందేశం ఇవ్వ దలచు కున్నారు…?
* 9. ఈ రెండు విందుల్లో ఎవరి చర్య సబబు…?
* 10. ఎవరిది పైచేయి…?
* 11. ఇట్టి చర్యలను పార్టీ సమర్ధిస్తుందా… ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *