* ఈ మరుగు దొడ్డిలో ఆయిల్ నిల్వలు
* అక్కరకు రాక డ్రైవర్ల ఇబ్బందులు
* సౌకర్యాలు కల్పనలో తీవ్ర నిర్లక్ష్యం
* పట్టించుకోని హైవే యాజమాన్యం
* హైవే యాజమాన్యం బాధ్యతలు గాలికి…

శంఖవరం, 25 ఫిబ్రవరి 2021
——————————————-
భారత జాతీయ రహదారుల నిర్వహణ ప్రాధికార సంస్థ (నేషనల్ హై వే అథారిటీస్ ఆఫ్ ఇండియా) పని తీరు తూర్పు గోదావరి జిల్లాలో అధ్వాన్నంగా ఉంది. ఈ సంస్థ నూతన నిర్మాణాలపై తప్ప, ఆయా నిర్మాణాల సక్రమ నిర్వహణ, ప్రయాణీకులకు అవసరమైన మౌలిక సౌకర్యాల కల్పన, కల్పించిన సౌకర్యాల సక్రమ నిర్వహణ, ఆ సంస్థ రోడ్లు, ఆస్తుల దురాక్రమణలపై ఎంతకూ సుతారమూ దృష్టి పెట్టడం లేదు. దీంతో కబ్జా కోరులకు జాతీయ రహదారులు, ఆస్తులు ఆయాచితంగా ఉపయోగ పడుతున్నాయి. ఆక్రమణలకు గురి అవుతున్నాయి. జాతీయ రహదారులపై నిత్యం ప్రయాణించే వేలాది మంది వాహన చోదకులకు మాత్రం సౌకర్యంగా లేవు. దరిమిలా వారికి అవి ఉపయోగ పడటం లేదు.

రాజమహేంద్రవరం – తుని జాతీయ రహదారిలో ఏలేశ్వరం మండలం రామవరం, శంఖవరం మండలం కత్తిపూడిలో మాత్రమే వాహన చోదకులకు ఉపయోగపడే ట్రక్ బే షెల్టర్లు, మరుగు దొడ్లు ఉన్నాయి. ఇక ఎక్కడా ఈ దారి పొడవునా ఈ సౌకర్యాలు లేవు. ఐతే కత్తిపూడిలోని ట్రక్ బే షెల్టర్లోని మరుగు దొడ్డి కబ్జాకు గురైంది. ఈ దొడ్డి నిర్మాణం అనంతరం నుంచి కూడా ఇది కబ్జాలోనే ఉంది. ఈ మరుగు దొడ్డికి విద్యుత్ సౌకర్యం, వాడుక నీటి సౌకర్యం ఏర్పాటు చేయలేదు. సంస్థ సిబ్బంది నిర్లక్ష్యం, ఇక్కడ వాహస చోదకులు కాల కృత్యాలను తీర్చుకునే సౌకర్యాల లేమి దుస్థితి వెరసి వాహన చోదకులను ఇటువైపు కన్నెత్తి చూడకుండా చేసాయి. ఫలితంగా ఇది నిరుపయోగంగా ఉంటోంది.

ఇది గమనించిన కత్తిపూడి స్థానికుడు దీనిని కబ్జా చేసాడు. ఈ మరుగు దొడ్డిని అక్రమంగా ఆక్రమించుకుని దానిని ఆయిల్ వ్యాపార కేంద్ర స్థావరంగా మార్చుకున్నాడు. ఈ భవనంలోని మరుగు దొడ్లు, స్నానఫు గదులను ఆయిల్ పీపాలు, గళాలు, ఆయిల్ కొలత పాత్రలు, ఆయిల్ తోడుకునే ప్లాస్టిక్ గొట్టాలు, యంత్ర పరికరాలతో నింపేశాడు. భవనానికి తాళం వేసి రాత్రీ, పగలూ తన అధీనంలోనే ఉంచు కుంటున్నాడు. ఈ భవనం ఎదురుగా జాతీయ రహదారిని ఆనుకుని అనేక రకాల ఆయిల్స్ రవాణాకు సంబంధించిన పలు వాహనాలను అడ్డంగా ఉంచుతున్నారు. ఇక్కడ వాతావరణం చూసి జాతీయ రహదారి వాహన చోదకులు ఈ మరుగుదొడ్లో కన్న ఊరు బయట ఆరు బయలుకు పోయి కాలకృత్యాలు, లఘశంక వంటి ప్రాధమిక అవసరాలు తీర్చుకోడం మిన్న అన్న నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

ఈ భవనం కజ్జాకోరు నుంచి భారత జాతీయ రహదారుల నిర్వహణ ప్రాధికార సంస్థ అధికారులకు ఏం నజరానాలు అందు తున్నాయోగానీ ఏళ్ళ తరబడి ఈ దురాక్రమణలు తొలగించలేదు. మరుగు దొడ్లను జాతీయ రహదారి వాహనాలు చోదకులకు వినియోగంలోకి తేవడం లేదు. ఇకనైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *