* పాలక వర్గానికి ముక్కోణపు పోటీ
* పార్టీల అభ్యర్థుల పోటా పోటీ ప్రచారం
* ప్రచారంలో వైకాపా ముందంజ

ఏలేశ్వరం, 2 మార్చి 2021
————————————–

” ఏలేశ్వరం నగర పంచాయితీ/ మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని వైఎస్సార్సీపీ, టీడీపీ పోటా పోటీగా కొనసాగిస్తున్నాయి… సంక్షేమ పథకాలు తమకు విజయాన్ని అందిస్తాయని వైఎస్సార్సీపీ శ్రేణులు… విపరీతంగా పెరిగిన ధరలతో విసుగెత్తిన ప్రజలు టీడీపీకే ఓటు వేస్తారని ఆ పార్టీ   శ్రేణులు చెబుతున్నాయి…”

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం ఏలేశ్వరం నగర పంచాయితీ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది. ఈ నగర పంచాయితీ పాలకవర్గం అభ్యర్థిత్వానికి  రాష్ట్రంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల నుంచి అభ్యర్థులు ప్రధానంగా పోటీలో ఉన్నారు. దీంతో ఇక్కడ ముక్కోణపు పోటీ అనివార్యం అయ్యింది.

20 వార్డులతో 2012 లో ఏర్పడిన ఈ నయా నగర పంచాయితీ పాలక వర్గానికి ఇవి రెండో దఫా ఎన్నికలు. మొదటి దఫా ఎన్నికల్లో ఈ పీఠాన్ని నాటి అధికార తెలుగు దేశం పార్టీ కైవసం చేసుకుంది. అప్పుడు అధికార తెలుగు దేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, భారత జాతీయ కాంగ్రెస్ పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉండగా మొత్తం 20 వార్డులకు గానూ 10 వార్డులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, 9 వార్డులను తెలుగు దేశం పార్టీ, కేవలం 1 వార్డును భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నాయి. ఐతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా ఒక వార్డును తక్కువ గెలిచిన తెలుగు దేశం పార్టీ అధికార పీఠాన్ని అధిష్ఠించింది. జాతీయ కాంగ్రెస్ పార్టీతో తెలుగు దేశం పార్టీ పొత్తు పెట్టుకుని, ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లలో తెలుగు దేశం పార్టీ ఆ ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కి నగర పంచాయితీపై జండాను పాతింది. దరిమిలా  ఎస్సీ – మహిళ రిజర్వేషన్లో ఉమ్మడి పార్వతి
తొలి మేయర్ గా పాలించారు. కాగా రెండో దఫాగా జరుగుతున్న ప్రస్తుత ఈ ఎన్నికల్లో ఆ పీఠం కాస్తా బీసీ – మహిళలకు రిజర్వు అయ్యింది. ఈ నేపధ్యంలో నామినేషన్ల ప్రక్రియ మంగళవారం సాయంత్రం 3 గంటల వరకూ కొనసాగింది. బుధవారం వరకూ అభ్యర్థులు తమ నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ సాయంత్రానికి పోటీలో ఉన్న నికర అభ్యర్థుల లెక్క తేలనుంది. మంగళవారం నాటి సమాచారం ప్రకారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి 24 మంది వరకూ అభ్యర్థులు పోటీలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉండగా మరో వైపు మార్చి10 న  జరగనున్న మున్సిపల్ కౌన్సిలర్ల ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో అభ్యర్థుల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ప్రత్యర్థులతో నిమిత్తం లేకుండా ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే చక్కగా  ప్రచారం చేసుకుంటున్నారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ ఎంపీ వంగా గీత, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్, అలమండ చలమయ్య, సామంతుల సూర్యకుమార్, బదిరెడ్డి గోవింద్, నీరుకొండ సత్యనారాయణ, గొల్లపల్లి బుజ్జి తదితరులు సంయుక్తంగానూ, విడి విడిగానూ ఇంటింటి ప్రచారం కొనసాగిస్తూ ఉన్నారు. ప్రతీ ఒక్క ఓటరు మహాశయులూ ఫ్యాన్ గుర్తుకు ఓటేసి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించి, నగర పంచాయితీ పాలక పీఠం అధిష్ఠించే సవర్ణావకాశాన్ని అందివ్వాలని, అధికార పార్టీ గనుక నగర  పంచాయితీని అభివృద్ధిలో నియోజక వర్గానికే ఆదర్శంగా తీర్చి దిద్దుతామని హామీ ఇస్తున్నారు. గత ఎన్నికల్లో 10 వార్డులను కైవసం చేసుకున్నప్పటికీ అధికారం చేజారిన చేదు గుణపాఠాన్ని దృష్టిలో ఉంచుకుని పార్టీ తన శక్తి యుక్తులను, సమయాన్ని, ఎమ్మెల్యే తన  40 ఏళ్ళ రాజకీయ అనుభవం అన్నింటినీ మేళవించి ఇక్కడ గుమ్మరిస్తున్నారు. మరో వైపు ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధికి కృతజ్ఞతగా ఓటర్లు తమ పార్టీకే పట్టం కడతారనే విశ్వాసంతో ఉంది. ఆ ధీమాతోనే ఇక్కడ మరింత అభివృద్ధికి భరోసా ఇస్తోంది. ఈ విధంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర పంచాయితీ పీఠంపై కన్నేసింది.

భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు, 3 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గట్టిం వెంకట రమణ, జిల్లా కార్యదర్శి గాయత్రి, సైలజ, మండల అధ్యక్షుడు ఏనుగు ధర్మరాజు, రెడ్డి రాజు, గట్టిం పెదకాపు, సూరిబాబు తదితరులు మిగతా కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రతీ ఒక్క ఓటరూ కమలం గుర్తుకే ఓటేసి బిజెపి పార్టీ కౌన్సిలర్  అభ్యర్ధులను అధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మరో వైపు అధికార పార్టీపై ప్రజా వ్యతిరేకత, ధరల పెరుగుదల తమకు లాభిస్తాయనే ఏకైక ఎజెండాతో తెలుగు దేశం పార్టీ తన ప్రచారంలో ఆశతో ముందుకు కదులుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *