* నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల జోరు
* చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం

(జర్నలిస్ట్ మూర్తి , 9059858516)

గొల్లప్రోలు , 9 మార్చి 2021.
—————————————–
” నిన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన ఆయా పార్టీల అభ్యర్థులు చివరిగా మంగళవారం ప్రలోభాలకు తెరతీశారు. బహిరంగంగానే నగదు మద్యం పంపిణీ చేస్తూ ఓటర్లను ఎలాగైనా తమకు అనుకూలంగా మలుచు కునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం మద్యం, నగదు పంపిణీని నిరోధించాల్సిన ఎన్నికల అధికారులు మాత్రం తమకు ఏమీ పట్టనట్లుగా చోద్యం చూస్తూ ఉండడంతో పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు “.

తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గం
గొల్లప్రోలు నగర పంచాయతీకి బుధవారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన రాజకీయ పార్టీలైన వైసిపి, టిడిపి 20 వార్డుల్లోనూ తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. జనసేన, బీజేపీ మాత్రం కొన్ని వార్డుల్లో మాత్రమే పోటీకి పరిమిత మయ్యాయి. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొన్న ఇరు పార్టీలు ఎలాగైనా చైర్మన్ పదవిని దక్కించు కోవాలన్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎన్నికల ప్రచార సమయంలో స్వీట్లు, చీరలు పంపిణీకీ మాత్రమే పరిమితమైన అభ్యర్థులు ప్రచారం ముగించిన అనంతరం నగదు పంపిణీ కి శ్రీకారం చుట్టారు. సాధారణ పోటి ఉన్న వార్డులలో తమకు 1000 నుండి 2000 రూపాయల వరకూ పంపిణీ చేస్తున్నారు. పోటీ తీవ్రంగా ఉండే వార్డుల్లో మాత్రం ఓటుకు 2000 నుండి 5000 రూపాయల వరకు పంపిణీ చేస్తున్నట్లు స్థానిక ప్రజలు గుసగుసలు పోతున్నారు. వైసిపి చైర్పర్సన్ అభ్యర్థి గండ్రేటి మంగతాయారు పోటీపడుతున్న 18వ వార్డులో వారికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఓటుకు 2000 నుండి 6000 రూపాయల వరకు సమయాను కూలంగా పంపిణీ చేస్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అదేవిధంగా సీనియర్ వైసీపీ నాయకుడు శ్రీరామచంద్రమూర్తి పోటీలో ఉన్న 17వ వార్డులో కూడ ఇదేవిధంగా జరుగుతున్నట్లు ప్రచారంలో ఉంది.

అలాగే టిడిపి పార్టీ తరఫున 11వ వార్డు పోటీలో తల పడుతున్న మాజీ ఏ.ఎం.సీ చైర్మన్ మాదేపల్లి వినీలవర్మకు పరిస్థితులు అనుకూలంగా లేక పోవడంతో ఓటుకు 2000 నుండి 5000 రూపాయలకు పైగా పంపిణీ చేస్తూ అనుకూలంగా లేని వారికి మరికొంత అదనంగా ముట్టచెప్తున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. పార్టీకి చెందిన ఓ నాయకుడు చైర్పర్సన్ పీఠం కోసం రూ. 50,00,000లను, కౌన్సిలర్ అభ్యర్థులు ఒక్కొక్కరికి ఐదేసి లక్షల రూపాయల చొప్పున మొత్తం అభ్యర్థులకు ఓ కోటి రూపాయలను పంపిణీ చేసినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే స్థానికంగా పార్టీని నిలబెట్టి అధికారం సంపాదించు కునేందుకు టిడిపి అభ్యర్థులు సైతం ఖర్చుకు వెనుకాడకుండా అధికార పార్టీకి ధీటుగా నగదు పంపిణీ చేస్తున్నారు. టిడిపి సైతం కౌన్సిలర్ అభ్యర్థుల కోసం కోటి రూపాయలకు పైగా పంపిణీ చేసినట్లు తెలియ వచ్చింది.

ఓటర్లకు తాయిలాలుగా మద్యం, చీరలు, నగదు, స్వీట్లను అభ్యర్థులు యధేచ్ఛగా పంపిణీ చేయడం, పోలీసులు, ఎన్నికల అధికారులు నిద్రావస్థలో ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలింగ్ కు ముందే బాధ్యతా రహితంగా వ్యవహ రిస్తున్న అధికారుల తీరు చూసి ఎన్నికలు నిష్పక్ష పాతంగా జరుగుతాయా అని ఓటర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గొల్లప్రోలు నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.

(ఈ కథనంలోనివి ప్రతీకాత్మక చిత్రాలు / అసలువి కాదు)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *