* ఫోర్టిఫైడ్ రైస్ పై అవగాహన కల్పించరేం ?
* ఫోర్టిఫైడ్ రైస్ ప్రచార భాధ్యత ప్రభుత్వానిదే
* ప్లాస్టిక్ బియ్యం అపోహను తొలగించాల్సిందే

శంఖవరం, 10 మార్చి 2021
—————————————-

గ్నేయ, ఈశాన్య ఆసియా దేశాల్లో ప్రధానమైన ఆహార ధాన్యాలలో బియ్యం ఒకటి. బియ్యంలో అవసరమైన ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాలు సహజంగానే ఉంటాయి. ఐతే ఈ బియ్యంలో ఈ ప్రకృతి సహజ సిద్ధమైన సూక్ష్మ పోషకాల స్థాయిని పెంచేందుకు ఆ బియ్యాన్ని పొడి చేసి ఆ పొడిలో ఫోలిక్ ఏసిడ్, విటమిన్ బి 12 వంటి ఖనిజాలను అదనంగా చేర్చి, ఆ మిశ్రమాన్ని మళ్ళీ బియ్యంగా తయారు చేస్తారు. ఈ విధంగా తయారైన బియ్యాన్నే ఫోర్టిఫైడ్ రైస్ అని ఆంగ్లంలో పిలుస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు పోషకాహారాన్ని అందించే ప్రక్రియలో భాగంగా ఈ బియ్యాన్ని ప్రపంచ వ్యాప్తంగా వినియోగిస్తున్నారు. అందువల్ల ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను గ్లోబల్ ఫోర్టిఫైడ్ రైస్ గా సర్వజనీనంగా వ్యవహరిస్తున్నారు. ఈ బలవర్థకమైన బియ్యం రంగు, రుచి, రూపంలో అచ్చం సాధారణ బియ్యం మాదిరిగానే ఉంటాయి. ఈ బియ్యం ఫోర్టిఫైడ్ రైస్ కాదని, అవి ప్లాస్టిక్ బియ్యం అని సందేహం వస్తే ఆ బియ్యాన్ని పొడి చేసి, ఆ పొడిని నీటిలో వేసి ఆ మిశ్రమంలో అయోడిన్ ద్రావణాన్ని వేస్తే ఆ గంజి నీళ్ళు నీలి రంగులో మారితే అవి ఖచ్చితంగా ఫోర్ట్ సైడ్ రైస్ గా నిర్ధారించు కోవచ్చు. ఈ ఫోర్టిఫైడ్ రైస్ పోషక నాణ్యతను మెరుగు పరచడంలో సహాయ పడతాయి. రక్త హీనత (హిమోగ్లోబిన్) స్థితిని నయం చేయడం, జింక్, విటమిన్ ఎ, విటమిన్ బి 12, ఫోలిక్ యాసిడ్ వంటి సూక్ష్మ పోషకాల లోపాలను గణనీయంగా పరిష్కరించడంలో ఈ బలవర్థకమైన బియ్యం యొక్క ప్రయోజనాలు సహాయ పడతాయి. అదనంగా, నాడీ పని తీరును ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యమైన పాత్రను ఈ ఫోర్టిఫైడ్ రైస్ పోషిస్తాయి. చర్మం నెమ్మదిగా వృద్ధాప్యం నుంచి ఆరోగ్యకరమైన స్థితికి తేవడం, దృష్టి, రక్త కణాలు, జుట్టు, ఆరోగ్యకరమైన చర్మం యొక్క సరైన పని తీరుకు సహాయ పడడానికి, అలాగే మధుమేహం, నిరాశ, రక్త పోటును నియంత్రించడంలో ఫోర్టిఫైడ్ రైస్ ప్రయోజనకరంగా ఉంటాయి. వినియోగ దారు ల్లో ఆరోగ్యం, ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తుల వినియోగంపై అవగాహన పెరగడం వలన భారత దేశం, చైనా, జపాన్ వంటి దేశాలలో ఈ ఫోర్టిఫైడ్ రైస్ వినియోగ ప్రాధాన్యతను గుర్తించారు. బలవర్ధకమైన ఆహార వినియోగపు అలవాట్లు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ బలవర్థకమైన (ఫోర్టిఫైడ్ రైస్) బియ్యాన్ని వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో గర్భిణీలు, బాలింతల్లో రక్త హీనత ఉన్న దేశాల్లో ఈ ఫోర్టిఫైడ్ రైస్ వినియోగాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రోత్సాహిస్తోంది. ఆ సంస్థ సిఫారసుల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని గర్భిణీలు, బాలింతలకు ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను ఉచితంగా అందిస్తోంది. ఐతే అవగాహనా రాహిత్యం వలన కొందరు ప్రజలు ఈ ఫోర్టిఫైడ్ రైస్ ను చూసి ప్లాస్టిక్ బియ్యంగా అపోహ పడుతున్నారు. ఈ అపోహలను తొలగించే భాధ్యత ప్రధానంగా ప్రభుత్వంపైనే ఉంది.

ప్లాస్టిక్ బియ్యమంటే కేసులు పెడ్తారట…
———————————————————
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలం అన్నవరంలో 31వ ప్రభుత్వ చౌక ధరల దుకాణం పరిధిలో వార్డు వాలంటీర్లు ఆయా సరుకుల రవాణా వాహనం ద్వారా గర్భిణీలు, బాలింతలకు కాకుండా సాధారణ ప్రజలకు మంగళ, బుధవారాల్లో పంపిణీ చేసిన బియ్యంలో ఈ ఫోర్టిఫైడ్ రైస్ వెలుగు చూసాయి. ఐతే ఆ బియ్యం పొందిన అమాయక లబ్దిదారులు అవి ప్లాస్టిక్ బియ్యం అని అపోహ పడటమే గాక అదే నిజమన్నట్టు సామాజిక మాధ్యమం వేదికగా వారి స్పందనను వెలుగులోకి తెచ్చారు. దానికి స్థానిక తాహసిల్దార్ కర్నాసుల సుబ్రహ్మణ్యం మొదలుకొని తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ సహాయ ఆహార నియంత్రణాధికారి బి. శ్రీనివాస్ వరకూ ప్రతిస్పందించారు. వారు తక్షణం అన్నవరం చేరుకున్నారు. అవి ఫోర్టిఫైడ్ రైస్ గా నాణ్యతా పరీక్షలు అనంతరం శ్రీనివాస్ నిర్ధారించారు. అవి శ్రీకాకుళం జిల్లాలోని గర్భిణీలు, బాలింతలకు సరఫరా చేయడానికి నిర్దేశించినవని, వాటిని మనం జిల్లాలోని శ్రీనివాసా రైస్ మిల్లర్స్ పొరపాటున మన జిల్లాకే సరఫరా చేయడంతో అవి సాధారణ వినియోగదారులు చేతికి ఊహించని రీతిలో వచ్చాయన్నారు. సాధారణ రకం బియ్యంలో 10 % మాత్రమే ఫోర్టిఫైడ్ రైస్ ఉంటాయన్నారు. వీటిని ప్లాస్టిక్ బియ్యంగా ప్రచారం చేస్తే సంబటధితులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణాల డీలర్లు, వినియోగదారుల్లో ఫోర్టిఫైడ్ రైస్ గురించి అవగాహన కల్పిస్తామని మీడియా సాక్షిగా తూర్పు గోదావరి జిల్లా ప్రభుత్వ సహాయ ఆహార నియంత్రణాధికారి బి. శ్రీనివాస్ ప్రజలకు బహిరంగంగా వివరణ ఇచ్చారు. ఈ హామీని ఎంత వరకూ నిలబెట్టు కుంటారో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *