* తండ్రి రాజశేఖర్ బాటలోనే తనయుడు జగన్
* ప్రజా సంక్షేమ పధకాలు, ప్రజలే పార్టీకి అండ

శంఖవరం, 12 మార్చి 2021
—————————————-
12.03.2011 న ప్రారంభమై 12.03.2021 వరకూ కూడా ప్రజల పక్షాన సుస్థిర రాజకీయ ప్రస్థానం కొనసాగిస్తూ, దశాబ్దం కాలం పూర్తై 11 వ వసంతంలోకి అడుగిడుతోన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తన ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించు కుంది. తన సంతోషాన్ని విజయ జైత్ర యాత్రను అందరితోనూ సంతోషంగా పంచుకుంది. ఈ
పదేళ్ళ ప్రస్థానాన్ని స్మరించుకుంటూ … ఒక్కడే ఏం చేయలేడు అనుకున్నారు. చరిత్ర సృష్టించాడు … ఒక్కటే అడుగు అనుకున్నారు. అతనికి కొన్ని లక్షల అడుగులు తోడుగా వచ్చాయి…. కష్టాలు చూసాడు. బాధలను పంచుకున్నాడు…బాసటగా నిలిచాడు. నేను ఉన్నాను. నేనువిన్నాను అంటూ ప్రతి పేద వాడి గుండె చప్పుడు అయ్యాడు…. కన్నీళ్ళు తుడిచే అన్నయ్యాడు. పరిపాలించే ప్రజా నాయకుడు అయ్యాడు మన పార్టీ అధినేత అంటూ వైఎస్ జగన్మోహనరెడ్డిని తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రస్తుతించాయి. పార్టీ ఆవిర్భావ వేడుకలను నియోజకవర్గం వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తండ్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్నింటిని పూల మాలలు వేసి ఆ దివంగత నేతకు ఘన నివాళులను అర్పించారు. పార్టీ ఆవిర్భావం సూచికగా కేకులు కత్తిరించి పరస్పరం పంచుకుని, పార్టీ పతాకాలను ఎల్లెడలా ఆవిష్కరించారు. పార్టీకి, నేతలకూ జయహో అంటూ నినదించారు.

శంఖవరం మండలం అన్నవరంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో సర్పంచ్ శెట్టిబత్తుల కుమార్ రాజా పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అందించిన ప్రజా సంక్షేమ పాలన ఆదర్శంగా అంతకు మించి ఉన్నతంగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం కూడా ప్రజాసంక్షేమ, జనరంజక పాలన కొనసాగిస్తున్నారని, అందుకు ప్రజల ఆదరణే నిదర్శనం అన్నారు. రాజశేఖర్ పాదయాత్ర ఆదర్శంగా తీసుకొని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశ వైఖరికి నిరసనగా రాష్ట్ర శాసన సభను వీడి రాష్ట్ర వ్యాప్తంగా 3684 కిలోమీటర్ల దూరం ప్రతీ గ్రామంలోనూ రెండు సంవత్సరాల పాటు నిరంతరం పాదయాత్ర చేసి, చంద్రబాబు పాలనను ప్రజల సమక్షంలోనే ఎండ గట్టి ప్రజల మన్ననలను పొంది పార్టీని అధికారంలోకి తెచ్చి తండ్రి బాటలోనే తనయుడు కూడా అన్ని వర్గాల ప్రజలకూ సంక్షేమ, జన రంజక పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆయన బాటలోనే ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత శ్రీపూర్ణ చంద్ర ప్రసాద్ కూడా సంక్షేమ పాలన అందిస్తు ఉన్నారని కుమార్ రాజా వివరించారు.

శంఖవరంలోని కార్యక్రమంలోపర్వత రాజబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి గుండె చప్పుడు అయ్యారు అన్నారు. పర్వత సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో నిలిచిన ఏకైక పార్టీ వైసిపి పార్టీ అని అన్నారు. జగన్ ప్రజా సంక్షేమ పధకాలు, ప్రజలే పార్టీకి అండగా ఉన్నాయని పలువురు వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమాల్లో శంఖవరం ఉప సర్ఫంచ్ చింతంనీడి కుమార్, పంతం దొరబాబు, జట్లా సోమేశ్వరరావు, బొర్రా లచ్చ బాబు, పడాల సతీష్, గణపతి, కర్రి రాము, ధూరిపూడి శివ, భోణం లోవరాజు, కీర్తి సురేష్, మండపంలో సర్పంచ్ కూనిశెట్టి మాణిక్యం, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *