* దశాబ్దంన్నర పురుష మేస్త్రీ వ్యవస్థకు స్వస్తి
* శ్రమ మిత్ర సంఘాల పునర్వస్థీకరణ
* కొత్త పనులు ప్రతిపాదించాం
* ఇక ఉపాధి కొరత ఉండదు
* శంఖవరం ఉపాధి ఏపీఓ రాజగోపాల్

శంఖవరం, 12 మార్చి 2021
——————————————

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఇకపై చదువుకున్న మహిళా కూలీలే ఉపాధి మేస్త్రీలుగా కొనసాగుతారని, ఈ మేరకు శ్రమ శక్తి సంఘాలను ప్రభుత్వం పునర్వస్థీ కరిస్తోందని శంఖవరం మండలం ఉపాధి ఏపీఓ. దడాల రాజగోపాల్ వెల్లడించారు. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని మండల కేంద్రమైన శంఖవరంలోని స్థానిక అంబేద్కర్ నగర్ లోని వైఎస్సార్ ఇండ్ల స్థలాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో చేపడుతున్న రోడ్ల పనులను శుక్రవారం మధ్యాహ్నం ఏపీఓ పరిశీలించారు. పనుల విరమణ అనంతరం కూలీలతో సమావేశమై ఆయన మాట్లాడారు. ఇప్పటి వరకూ చదువుకున్న పురుష, మహిళా కూలీలు ఎవరైనా ఉపాధి మేస్త్రీలుగా కొనసాతూ వస్తూన్న విధానంలో తాజాగా సరికొత్త మార్పులను ప్రభుత్వం చేసిందని ఆయన వెల్లడించారు. ఇకపై
చదువుకున్న మహిళా కూలీలు మాత్రమే మొదటి, రెండవ మేస్త్రీలుగా కొనసాగుతారని, ఈ మేరకు ఏయే సంఘాల్లో ఏయే మహిళలు మేస్త్రీలుగా ఉండాలో ఆయా కూలీల సంఘాల మిగతా సభ్యుల తీర్మానం చేయాలన్నారు. ఇప్పటి వరకూ ఒక్కో సంఘంలో 10 నుంచి 20 మంది వరకూ కూలీ సభ్యులు ఉండగా ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం ఇకపై 30 మందికి తక్కువ కాకుండా సభ్యులు ఉండాలని రాజగోపాల్ నిర్దేశించారు. ఉపాధి కూలీల జాబ్ కార్డు వివరాల్లో మార్పులు, చేర్పులను మునుపటిలా మండల స్థాయి ఏకైక ఉపాధి కేంద్రంలో కాకుండా దానికి బదులుగా స్థానిక సచివాలయాల్లో మాత్రమే చేయించు కోవాలని ఆయన సూచిస్తూ, ఆ సేవలను మండల ఉపాధి కేంద్రంలో అందించ మని, ఈ మార్పులను ప్రతీ కూలీ గుర్తించాలని ఆయన వివరించారు. జాబ్ కార్డ్ నెంబర్ కు ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలను తప్పని సరిగా నమోదు చేయించు కోవాలని ఆయన వివరించారు. వేసవి కాలం వల్ల దినసరి కూలి వేతనంలో 30 శాతాన్ని అదనంగా చెల్లిస్తామని, అందువల్ల సమయం కోసం చూడకుండా నిర్ణీత కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు ₹ 230 ఖచ్చిత వేతనం గిట్టుబాటు అవుతుందని ఏపీఓ. రాజ గోపాల్ వివరించారు. కూలీల సమస్యలను అడిగి తెలుసు కున్నారు. ఇప్పటి వరకూ పనిచేసిన మేస్త్రీలకు మేట్ అలవెన్సులు రాలేదని సినియర్ మేట్ / కూలీ జక్కల నాగసత్యనారాయణ ఫిర్యాదు చేయగా ఒకప్పుడు అమలు చేసిన మేట్ అలవెన్సుల చెల్లింపులను ఇప్పుడు కంప్యూటర్ సాంకేతికత ఆమోదించటం లేదని ఆయన వివరించారు. కొత్తగా మరిన్ని ఉపాధి పనులు మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదించామని, అవన్నీ మంజూరైతే చేపట్టుకోవచ్చని, అప్పుడు శంఖవరం నకు పనుల కొరత ఉండదు అని ఏపీఓ. రాజగోపాల్ వెల్లడించారు. ఆయన వెంట మండల ఇంజనీర్ కార్తీక్, టిఏ. అమర్ నాథ్, ఎఫ్ఏ. బీరా నాగసత్యనారాయణ (నాగు) ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *