* ఉత్తర్వులను జారీచేసిన ప్రభుత్వం

శంఖవరం, 27 మార్చి 2021
——————————————
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పంచాయితీల నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఏప్రిల్ 3న శుభ ముహూర్తంగా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ కమీషనరు ఎం.గిరిజా శంకర్ ఈ నెల 25 న సంఖ్య 1352699 / సీపీఆర్ / ఎన్నికలు/ 2021 తో ఉత్తర్వులను, మార్గదర్శకాలను విడుదల చేసారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గ్రామ పంచాయితీలు మొదటి సమావేశాన్ని 03.04.2021 న నిర్వహించాలని ఆదేశించారు. నాటి కార్యక్రమానికి గ్రామ పందాయితీ కార్యాలయమును అలంకరించి శుభ్రముగా వుండాలని, సర్పంచ్ రూమ్ అవసరమైన పర్నిచర్ తో తయారుగా వుండాలని, నూతనముగా ఎన్నికైన గ్రామ పంచాయితీ సర్పంచ్, వార్డ్ సభ్యులను ఆహ్వానిస్తూ బ్యానర్ ఏర్పాటు చేయాలని, గ్రామ పంచాయితీ సిబ్బంది . అందరూ కుడా తప్పక హాజరు కావాలని ఆ ఉత్తర్వుల్లో ఆయన నిర్దేశించారు. 3న ఉదయం 10:30 గంటలకు గ్రామ పందాయితీ సర్పంచులు, వార్డు సభ్యులు కార్యాలయమునకు హాజరు కావాలని, 10:45 గంటలకు మహాత్మా గాందీ, బి.ఆర్. అంబేద్కర్ చిత్రాలను పూల మాలలతో అలంకరించాలని, 11 గంటలకు సర్పంచ్ ప్రమాణ స్వీకారం, తదుపరి వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం చేయాలని నిర్దేశించారు. నవరత్నాలు, పారిశుద్యం, మొక్కల పెంపకం, మంచినీటి సరఫరా, ఎల్.ఇ.డి (వీధి దీపాలు) జల శక్తి అభియాన్ ( నీటి సంరక్షణ ) లపై మధ్యాహ్నం 11 గంటలకు సర్పంచులు, వార్డ్ సభ్యులు సంకల్పా స్వీకారించాలని, మధ్యాహ్నం 12:15 గంటలకు పంచాయితీ కార్యదర్శి, సిబ్బందితో పరిచయ కార్యక్రమం చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.
తదుపరి గ్రామ పందాయితీ మొదటి సమావేశాన్ని నిర్వహించాలని, మధ్యాహ్నం 3:00 గంటలకు పాలకవర్గ సభ్యులు గ్రామ సందర్శన చేపట్టి మంచి నీటి సౌకర్యం, పారిశుధ్యం అంగన్వాడీ కేంద్రాలు, హెల్త్ సబ్ సెంటర్లను పరిశీలించాలి, సాయంత్రం 5:00 గంటలకు గ్రామ పంచాయితీలో సమావేశమై ఏప్రిల్ నెలలో నిర్వహించు కార్యక్రమాలపై చర్చించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని కమీషనరు సూచించారు. అనంతరం ప్రజా ప్రతినిధులమైన మేము గ్రామ పందాయితీలో ప్రభుత్వ కార్యక్రమాలైన నవరత్నాలు, పారిశుధ్యం, మొక్కల పెంపకం , మంచినీటి సరఫరా, ఎల్.ఇ.డి (వీధి దీపాల), జల శక్తి అభియాన్ – నీటి సంరక్షణ కార్యక్రమాలను త్రికరణ శుద్ధితో, అంకిత భావంతో ప్రణాళికా బద్ధముగా అమలు పరిచి గ్రామాభివృద్ధికి తోడ్పడతామని గ్రామ పందాయితీ సర్పంచులు, వార్డు సభ్యులు సంకల్పాన్ని స్వీకరిస్తున్నామని ప్రమాణం చేయాలని పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ కమీషనరు ఎం.గిరిజా శంకర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మా వ్యాఖ్య
——————–
1 ఏప్రిల్ నుంచి కొత్త ఆర్ధిక సంవత్సరం మొదలు కానున్నందున ఈ కొత్త సంవత్సరంలో స్థానిక సంస్థల పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వస్తే బాగుంటుంది అన్న సదుద్దేశ్యంతోనే ఉద్దేశ పూర్వకంగానే అప్పటి వరకూ ఈ పదవీ ప్రమాణ స్వీకారం మహోత్సవాన్ని ప్రభుత్వం ఆలస్యం చేసినట్లు అవగతం అవుతోంది.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *