* ఎన్నికలు వాయిదాతో ఆగిన ఏర్పాట్లు
* ఆంద్రా ఎన్నికల జాప్యం ఆనవాయితీయే
* ఆంధ్రలో ప్రజాస్వామ్య పరిహాసం

శంఖవరం, 6 ఏప్రిల్ 2021
————————————–
రో రెండు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో జరగాల్సిన మండల పరిషత్తు, జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల ప్రజా ప్రాతినిధ్య పదవులను అలంకరించే నేతల ఎంపికకు జరగాల్సిన ఎన్నికలు అనూహ్యంగా వాయిదా పడ్డాయి. దీంతో ఎన్నికలకు స్థానిక సంస్థల్లో జరుగుతున్న ముందస్తు ఏర్పాట్లు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్‌లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడి ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల నిర్వహణకు ముందుగా నాలుగు వారాల పాటు విధిగా ఎన్నికల కోడ్‌ ను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు లోగడ జారీ చేసిన మార్గదర్శక ఆదేశాలను ప్రభుత్వం, ఎన్నికల సంఘం అమలు చేయలేదని, కోర్టు ఆదేశాల మేరకు నాలుగు వారాల ఎన్నికల కోడ్ ను విధించలేదని తెలుగు దేశం పార్టీ హైకోర్టులో ఫిర్యాదు చేసీంది. పరిషత్‌ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే స్టే విధిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. తెలుగు దేశం పార్టీ ఫిర్యాదులో పేర్కొన్నట్లుగా ఎన్నికల సంఘం కోడ్ ను పాటించ లేదని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ఆక్షేపించింది. దీనిపై ఈనెల 15వ తేదీలోగా అఫిడవిట్‌ ను దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలుగు దేశం పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయస్థానం ఈ ఎన్నికలను నాలుగు వారాలు పాటు తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ, ఎన్నికల కోడ్ ను పక్కాగా అమలు చేస్తూ, ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు ఉత్తర్వులను జారీ చేస్తూ తీర్పు చెప్పింది. అంతేగాకుండా ఈ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ ఉత్తర్వులను ఎన్నికల సంఘం తు.చ. తప్పకుండా పాటించాల్సి ఉన్నందున, ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా ఆగినందున ఈ ఉత్తర్వులకు ముందు నుంచీ పంచాయితీల స్థాయిలో కొద్ది రోజులుజా జరుగుతున్న ఎన్నికలు ఏర్పాట్లైన బ్యాలెట్ పేపర్లు, ఎన్నికల సామాగ్రి ఏర్పాట్ల సంసిద్ధత వంటి ప్రాధమిక ఏర్పాట్లు అన్ని హైకోర్టు ఆదేశాల తదనంతర ప్రతిచర్యగా తాత్కాలికంగా అప్రకటితంగా ఆగిపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు పదే పదే వాయిదా పడుతూ ఆగుతూ వస్తున్నాయి. ఐతే ఏదో ఒక కారణంతో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు వాయిదా పడుతున్న ఆనవాయితీ గత తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలోని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా కాలం 2018 సంవత్సరం నుంచీ నేటి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాలన వరకూ ఓ ఆనవాయితీగా రావడం ఓ విశేషమైతే… పార్టీ నేతలు, పాలకులు, ప్రభుత్వం, ఎన్నికల సంఘం అనుసరిస్తున్న తప్పుడు విధానాలు మాత్రం ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేయడంతో పాటు ప్రజాస్వామ్య ప్రియులను మనోవేదనకు గురి చేస్తోన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *