* ఉత్సవ ఏర్పాట్లు పూర్తి

శంఖవరం, 9 ఏప్రిల్ 2020
————————————-
కొత్త అమావాస్య వస్త్తోందంటే చాలు నూకాలమ్మ భక్తులకు ఎంతో ఆనందం. గ్రామాల్లోని ఈ అమ్మ వారి ఆలయ ప్రాంగణాలే కాకుండా ఈరంతా పండుగ వాతావరణం సంతరించు కుంటుంది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గంలోని మండలం కేంద్రమైన శంఖవరం బస్టాండ్ సెంటర్లో కొలువైన ఈ నూకాలమ్మను
దర్శించు కునేందుకు పరిసర గ్రామాల నుంచి వందలాది మంది భక్తులు ఏటేటా ఇక్కడకు వస్తుంటారు. ఈ నేపథ్యంలో అమ్మ జాతరకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నెల 11వ తేదీ ఆదివారం రాత్రి అమ్మ వారి జాగారంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. సోమవారం జాతరను నిర్వహిస్తారు. ఈ నూకాలమ్మ వారి ఆలయానికి ఈ ప్రాంతంలో ఎంతో చారిత్రాత్మక ప్రాముఖ్యత ఉంది. ఆధ్యాత్మిక చింతనతోను, భక్తి తత్పరతతోను, పలు గ్రామాల భక్తులకు అమ్మ వారి దర్శన భాగ్యం కల్పించే బలమైన సంకల్పంతోనూ పర్వత కుటుంబీకులు ఈ అమ్మను ఇక్కడ 150 ఏళ్ల క్రితం నెలకొల్పారు. అలాగే అమ్మ వారికి సోదరుడైన పోతురాజు ప్రతిమను కూడా అప్పట్లోనే ఆలయం ఎదురుగా అమ్మ వారికి అభిముఖంగా ప్రతిష్టించారు. నాటి నుంచి ఈ అమ్మ వారు మహిమ గల తల్లిగా పూజలు అందు కుంటున్నారు. పర్వత కుటుంబీకుల ఆడ పడచుగా పేరుగాంచిన ఈ అమ్మ వారు ఏటేటా ఈ ఉత్సవాల్లో వారి కుటుంబం నుంచే ప్రత్యేకంగా తొలి పూజలను అందుకుంటూ వస్తున్నారు. ఒక్కో ఏట పర్వత వంశంలోని ఒక్కో కుటుంబం పెద్ద ఈ ఉత్సవాలకు నేతృత్వం వహిస్తూ బాధ్యతగా పవిత్రంగా నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తున్నది. ఈ ఏటి ఈ బాధ్యతలను స్థానిక ప్రముఖ వడ్రంగి వ్యాపారి పర్వత వెంకటేశ్వర రావు (చంటిబాబు) నిర్వహిస్తున్నారు. ఉత్సవం సందర్భంగా అమ్మ వారని చంటిబాబు ఇంటికి
ఓ ఆడపడుచుగ తోడ్కొని వస్తారు. అక్కడ అమ్మ వారికి పానుపు వేసి, మురుకులు, పసుపు కుంకుమలను సమర్పిస్తారు.

ఇక ఉత్సవ ప్రాధాన్యత విషయానికి వస్తే… అమ్మ వారి ప్రతిరూపమైన గరగలను సముద్ర స్నానానికి జాతరకు వారం రోజులు ముందుగానే తరలించి, స్నాన ఘట్టం పూర్తయ్యాక భక్తులు అమ్మ వారిని శంఖవరం తోడ్కొని వస్తారు. పిదపనే అమ్మ వారిని ప్రత్యేక అలంకరించి, అమ్మ వారిని పల్లకీలో ఆసీనురాలిని చేసి ప్రజల సందర్శనార్థం గ్రామంలో ఊరేగిస్తారు. జాతర రోజు శంఖవరం ఓ తిరునాళ్ళలా ఉంటుంది. తీర్థం జరుగుతుంది. ఊళ్ళోని భక్తులు అందరూ పసుపు, కుంకుమ, చీర, రవికె, టెంకాయలు, ఫల పుష్పాలతో బయలుదేరి అమ్మను పూజిస్తారు. అమావాస్య చీకట్లను పారద్రోలి వెలుగులను ప్రసరింప చేసేందుకు పిల్లా పెద్దలు అంతా ఆముదపు తైల గింజలతో చేసిన ఆముదపు దీప పుల్ల కాగడాలను వెంటబెట్టుకొని వస్తారు. అమ్మ వారి ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షిలను చేసి తదుపరి అమ్మ వార్ని దర్శించు కుంటారు. పాత మొక్కుబడులను చెల్లించుకుని కొత్త మొక్కులు కోరుకుంటారు. శెనగపప్పు, అరటి పళ్ళను ఆలయంపైకి విసిరి కింద పడిన వాటిని స్వీకరించి వాటినే అమ్మ వారి ప్రసాదంగా స్వీకరిస్తారు. దీనినే మహా ప్రసాదంగా ఇరుగు పొరుగు వారికి కూడా పంచి తమ భక్తిని చాటుకుంటారు. శంఖవరంలోని ఈ జాతరకు శంఖవరం గ్రామస్తులు పొరుగూళ్ళలోని తమ బంధువులను ఆహ్వానించడం, వారు కూడా అమ్మ వార్ని దర్శించు కోడం ఎన్నో ఏళ్లుగా సంప్రదాయంగా కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *