* పంచాయితీ రాజ్ చట్టంపై చిత్తశుద్ధి లేదా…?
* గ్రామ సభల లక్ష్యం నానాటికీ తీసికట్టు…!
* ప్రజా ప్రయోజన గండిలో ప్రభుత్వ పట్టు…!

శంఖవరం, 12 ఏప్రిల్ 2021
—————————————-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరి పాలనా దినాలలో ఏప్రిల్ 14, అక్టోబర్ 2 అత్యంత ప్రాముఖ్యమైన, ఎంతో శ్రేష్ఠమైన, విలువైన రోజులు. ఏప్రిల్ 14 భారత రత్న డాక్టర్ భీమారావ్ రాంజీ అంబేద్కర్ జయంతి ఐతే, అక్టోబర్ 2 మహాత్మా మోహన్ దాస్ కరంచంద్ గాంధీ జయంతి. ఈ రెండు రోజులూ ఆయా జాతి నేతల జయంతిని బట్టి ఒక రకంగానూ, భారత దేశ పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం రాజ్యంగ బద్దంగా ఈ రెండు రొజుల్లోనూ ప్రతి పంచాయితీలోనూ విధిగా గ్రామ సభలను నిర్వహించాల్సి ఉన్నందున అత్యంత ప్రాముఖ్యతను సంతరించు కున్నాయి. ప్రతీ ఆరు నెలలకు ఓ సారి వచ్చే ఈ గ్రామ సభలు అతి అరుదైనవి, అతి విశిష్టమనవి. ఏటేటా పంచాయితీలు నిర్వహించే గ్రామ సభల్లోకెల్లా ఈ రెండు రోజుల్లో నిర్వహించే గ్రామ సభలే అగ్ర భాగాన నిలిచే గ్రామ సభలు. అంతేకాదు…, నూతన పంచాయితీ రాజ్ చట్టం ప్రకారం విధిగా వీటికి అగ్రతాంబూలం ఇవ్వాలి కూడా. ఇంతటి ఔన్నత్యం, ప్రాధాన్యం ఉన్న ఈ గ్రామ సభలను పంచాయితీ అధికారులు, పాలక వర్గంతో సక్రమంగా నిర్వహించి, పంచాయితీ ఆదాయ వనరులు, వినియోగం, జమా, ఖర్చులను చిట్టాలను విప్పి గ్రామ సభలో పౌరులకు వివరించి, నిధులను సక్రమంగా వినియోగించారో లేదో ప్రజా తనిఖీలు సహిత సభికుల అభిప్రాయాలలో తీర్మానాలు చేయించడం, అధికారులు చెప్పిన ఖర్చుల వ్యయంతో విభేదించే అంశాలను తీర్మాన పుస్తకం (మినిట్స్) రాయడం, గ్రామ పౌరుల ఆమోదం పొందడం, తదుపరి దినం చర్యగా గ్రామ సభ విభేదించిన అభ్యంతర అంశాలపై పంచాయితీరాజ్ శాఖ ఉన్నత అధికారులతో విచారణ చేయించి, నిధుల వినియోగం నిగ్గు తేల్చడం వంటి క్రియాశీల కార్యాచరణ చేయాలనే రాజ్యాంగం, రాజ్యాంగ నిర్మాతలు, పంచాయితీ రాజ్ చట్టం లక్ష్యం పరిపుష్ఠికి పాటుపడాల్సిన భాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ఐతే ఈ సభలను కేవలం ఆయా జాతి నేతల విగ్రహాలకు పూలదండలు వేయడం, వారి స్మృతికి నివాళుల సమర్పణ, స్థానిక ప్రజా ప్రతినిధులను గౌరవించడంతో పాటుగా, సభా నియమం, ప్రోటోకాల్ ను ఉల్లంఘించి మరి కొందరు రాజకీయ నేతలు, ఛోటా మోటాలకు, వారి చెంచాలు, అయోగ్యులను సభా వేదికలపైకి సాదరంగా ఆహ్వానించడంతో పాటుగా వారికి కూడా అడుగులకు మడుగులద్ది బాకాలు ఊదడంతో సరిపుచ్చి గ్రామ సభలను తూతూ మంత్రంగా నిర్వహించి,  సభా లక్ష్యాన్ని ఉద్దేశ పూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. నేతలకు బాకాలు ఊది భుజాలు చరచు కుంటున్నారు. దానికే తామేదో ఘన కార్యం చేసినట్టు, హఠాత్తుగా తమకేదో భుజకీర్తి వచ్చి పడినట్టు గాల్లో తేలిపోతున్నారు. దీనికి తోడు అవగాహన లేని ప్రభుత్వాలు లేని పోని గొప్పలకు పోయి ఈ రెండు రోజుల్లోనే టీకా ఉత్సవ్ వంటి ఇతరత్రా కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామ సభలు, వాటి లక్ష్యానికి గండి కొడుతున్నారు. ఆ రోజుల్లో కొత్త కార్యక్రమాలను పెట్టి గ్రామ సభలను సక్రమంగా నిర్వహించ కుండా, పంచాయితీల అభివృద్ధిని వివరించే అవకాశం లేకుండా చేసి, నిధుల వినియోగం, అవినీతి బహిర్గతం కాకుండా జాగ్రత్త పడేలా పంచాయితీలను సాక్షాత్తూ ప్రభుత్వాలే పక్క దారి పట్టిస్తున్నాయి. కనీసం ఈ గ్రామ సభలను ముందు రోజులకు కూడా గౌరవ ప్రదంగా బదలాయించక పోవడాన్ని బట్టి చూస్తే రాజ్యాంగ బద్ధమైన ఈ గ్రామ సభల లక్ష్యం నెరవేరడంపై ప్రభుత్వాలకు ఉన్న అవగాహన, చిత్తశుద్ధి తేటతెల్లం ఔతోంది. ప్రభుత్వాలు తమ దమన నీతిని చెప్పకనే చెప్పు కుంటున్నాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *