ఎస్,జగ్గంపేట, 20 ఏప్రిల్  2021 .

తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజక వర్గం శంఖవరం మండలంలోని వివిధ గ్రామాల్లోని శ్రీసీతారామ ఆలయాల వద్ద శ్రీరామనవమి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. కల్యాణ శోభతో కళకళలాడు తున్నాయి. ఈనెల 21వ తేదీన శ్రీరామనవమి పురస్కరించుకొని మండలంలోని ఎస్ జగంపేట పంచాయతన సీతారామచంద్ర మూర్తి ఆలయం వద్ద కళ్యాణానికి ఏర్పాట్లు పూర్తి చేసామని ఆలయ ధర్మకర్త మోగంటి తిరుపతి రాజు మీడియాకు తెలిపారు. ఈ ఆలయం చరిత్రాత్మక మైనది. 1900 సంవత్సరంలో మోగంటి కొండరాజు, మల్లపురాజు అన్నదమ్ములు ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయం అభివృద్ధికి, ఉత్సవాల నిర్వహణ, దూప దీప నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చేందుకు మూల నిధిగా శంఖవరం వేళంగి సమీపంలో 47 ఎకరాలు, రౌతులపూడి మండలం గుమ్మరేగుల పరిధిలో 11 ఎకరాలు, శంఖవరం మండలం ఎస్ జగ్గంపేట పరిధిలో మరో 17 ఎకరాల చొప్పున మొత్తం 75 ఎకరాల భూములను ఈ ఆలయానికి దానం చేస్తూ రాసిచ్చారు. వేళంగి సమీపంలోనే 47 ఎకరాల భూమిని అప్పట్లో పీపుల్స్ వార్ నక్సలైట్లు స్వాధీనం చేసుకుని అక్కడి పేదలకు పంచి పెట్టేసారు. దీంతో ఆలయానికి ఏటా వచ్చే ఆదాయం భారీగా తగ్గి పోయింది. మిగిలిన 30 ఎకరాల భూములపై సంవత్సరానికి సుమారు రూ. 3.43 లక్షలు ఆదాయం వస్తున్నది. ఇటీవల కొంతంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి జగ్గంపేట పరిధిలో ఆలయానికి చెందిన కొంత భూమిని ఆక్రమించు కున్నారు. ఈ ఆక్రమణల చెర నుంచి భూములను విడిపించి వాటిపై కూడా ఆదాయం తెచ్చేందుకు ధర్మకర్త కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ ధర్మకర్త వంశీకులు స్థానిక రెవెన్యూ అధికారులకు ఆక్రమణల గురించి చెప్పినా భూమిని సర్వే చేయలేదని అంటూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు పట్టించుకుని ఆక్రమిత భూములను ప్రభుత్వం విడిపించి దాతల ఆశయాన్ని నెర వేర్చాలని భక్తులు కోరుతూ ఉన్నారు. కరోనానేపధ్యంలో కళ్యాణానికి వచ్చే భక్తులు మాస్కులు ధరించి రావాలని ఆలయ ప్రోత్సాహకులు మోగంటి మురళి ఓ ప్రకటనలో కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *