* శ్రీరామ నవమి తగవుకు ఎస్ఐ. పరిష్కారం
* రెండు రాజకీయ పక్షాలకు చెంప పెట్టు

కర్రివానిపాలెం, 21 ఏప్రిల్ 2021
———————————————–
ఆ ఎస్సై దంపతులే శ్రీ సీతారాముల పెళ్ళి పెద్దలు అయ్యారు… ఊరు జనం రెండు పార్టీలుగా చీలి దేవుడి పెళ్లికి మా వర్గమే పెద్దలం అని ఓ పార్టీ వర్గం …, ఆ…ఆ… కాదు…కాదు… మా వర్గమే పెళ్ళి పెద్దలం … మా చేతులు మీదుగానే పెళ్ళి జరగాలని మరో పార్టీ వర్గం… తమ తమ వర్గాల వారీగా సొంత ఏర్పాట్లు చేసుకుని పట్టు పట్టి కూర్చుని దేవుడి పెళ్ళికే ఆటంకం కల్పించే పరిస్థితి తెచ్చారు. చివరికి గ్రామ పెళ్ళి పెద్దల స్థానంలో ఎస్సై దంపతులు ఆసీనులై కాగల కార్యం గంధర్వులే చేసారు అన్న సామెత మాదిరిగా ఊరుమ్మడి దేవుడి పెళ్లి సమస్యను పరిష్కరించారు. ఈ అనూహ్య అరుదైన సంఘటన విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం యస్.రాయవరం మండలం కర్రివానిపాలెం గ్రామంలో బుధవారం జరిగింది. స్థానిక శ్రీసీతారామాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవానికి ఇరు పార్టీలు పంతానికి పోగా  ఏర్పడిన ప్రతిష్టoభనను యస్.రాయవరం ఏస్.ఐ వి.చక్రధర్ స్వబుద్దితో చాకచక్యంగా జన సమ్మతంగా పరిష్కరించారు.

సీతా రాముల పెళ్ళికి ఆటంకం ఏంటంటే…
——————————————————
ప్రతీ ఏడాది శ్రీరామనవమి  మహోత్సవాలు ఘనంగా నిర్వహించడం సహజమే. సాధారణంగా మొక్కులు తీర్చు కొనేందుకు, తమ కోరికలు నెరవేరతాయనే నమ్మకంతో సీతారామ కళ్యాణంలో ఓ జంట దంపతులు కూర్చొని వారి చేతుల మీదుగా కళ్యాణం చేయిస్తారు. ఇదే సంప్రదాయం ప్రకారం… గత ఏడాది వరకు వైస్సార్ పార్టీ నాయకుడు, మాజీ సర్పంచ్ మోకిన బుల్లిబాబు దంపతులు నవమి కళ్యాణ దంపతులుగా కూర్చునేవారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో కర్రి హేమలత సర్పంచ్ గా ఎన్నిక కావడంతో గ్రామ ప్రదమ పౌరురాలు హోదాలో ఆమె, తన భర్త వరహారావుతో కళ్యాణ దంపతులుగా కూర్చోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసిన బుల్లిబాబు, తమ దంపతులమే కూర్చుంటామని తెలుపుతూ వేరుగా సొంత ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ విధంగా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు పంతానికి పోవడంతో కళ్యాణంలో కూర్చొనే దంపతుల విషయంలో వివాదం తలెత్తి చివరికి బుధవారం జరగవలసిన శ్రీ సీతా రాముల పెళ్ళికే ప్రతిష్టంభన ఏర్పడింది.

దేవుడి పెళ్లికి జీవుల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు …
———————————————————–
దీంతో సర్పంచ్, ఉప సర్పంచ్, గ్రామస్తులు శుక్రవారం యస్.రాయవరం ఎస్.ఐ చక్రధర్ కు ఫిర్యాదు చేసారు. తాము శనివారం కళ్యాణ రాట ముహూర్తం పెట్టుకున్నామని, అయితే బుల్లిబాబు కూడా రాట ముహూర్తంకు వేరుగా సన్నాహాలు చేస్తున్నాడని చట్ట ప్రకారం రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. దీనిపై శనివారం ఇరు పార్టీలు రాట వేయవద్దని, ఇరు పార్టీలు సామరస్య పూర్వక అంగీకారానికి వచ్చే వరకు ఎటువంటి కార్యక్రమాలు చేపట్టవద్దని ఎస్.ఐ. సూచించారు. మంగళవారం అర్ధ రాత్రి వరకు పంచాయతీ జరిపినా ఫలితం లేకపోయింది. ఇరు పార్టీల మధ్య రాజీ కుదర లేదు. సమస్య పరిష్కారం కాలేదు. ఆఖరుకు సి.ఐ విజయ కుమార్ కూడా వచ్చి 5 పరిష్కార మార్గాలను సూచించినా పరిస్థితి దారికి రాలేదు.

మంగళవారం అర్థ రాత్రి వరకు యస్.రాయవరం యస్.ఐ చక్రధర్, తరువాత సి.ఐ కె.విజయ కుమార్ వద్ద పెట్టిన పంచాయతీ ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా ఏమి జరుగుతుందో అని బుధవారం ఉదయం వరకు గ్రామస్తులు అందరూ  ఉత్కంఠతో ఎదురు చూశారు. ఆ ఉదయం అనూహ్యంగా ఎస్.ఐ. తన సతీ సమేంగా సంప్రదాయ దుస్తుల్లో హాజరై గ్రామస్తుల సమక్షంలో శ్రీరామ నవమిని కల్యాణ మహోత్సవాన్ని తమ దంపతుల చేతుల మీదుగా సంప్రదాయం ప్రకారం జరిపించారు. యస్.ఐ. సాహసోపేత నిర్ణయానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా రెండు పార్టీల మధ్య వివాదానికి శుభం కార్డు పడింది. ఆఖరికి కళ్యాణానికి ఏ వర్గానికి ఆ వర్గం తాము ముందుగా వేర్వేరుగా తెచ్చుకున్న మందుగుండు బాణా సంచాను కాల్చి అక్కడికీ తామేదో విజయం సాధించినట్లు సరిపెట్టు కున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సమస్య పరిష్కారానికి, శ్రీరామ నవమి ఉత్సవం నిర్విఘ్నంగా కొనసాగ డానికి యస్.ఐ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ఇరు పార్టీలకు ఓ గుణపాఠమని జన వ్యాఖ్యానం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *