* ముఖం చాటేసిన మాజీ ఎమ్మెల్యే
* పార్టీకి, ప్రజలకు దూరం దూరం
* ప్రత్యక్ష, పరోక్ష పాత్ర లేనే లేదు
* రెండు ఏళ్ళుగా జాడ లేని నేత
* ఇది స్వచ్ఛంద రాజకీయ విరమణేనా?

శంఖవరం, ఏప్రిల్ 25 (జనాసవార్త) ;

తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని
ప్రత్తిపాడు శాసన సభా నియోజక వర్గం
విలక్షణమైన, విశిష్టమైన రాజకీయాలకు వేదిక. రాష్ట్ర అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ కి చెందిన ఓ నేత ఈ రాజకీయ వేదిక నుంచి అనూహ్యంగా కనుమరుగు అయ్యారు. ఈ కనుమరుగు ఘటన ఒక పక్షం రోజులో, మాసమో, ఏడాది కాలానిదో కాదు. ఏకంగా రెండేళ్ళు కాలం పాటు ఆయన ప్రత్యక్ష, పరోక్ష రాజకీయాల్ని నుంచే గాకుండా తనను ప్రభువును చేసి పల్లకిలో ఊరేగించిన, రాజకీయ ఆపద సమయంలో ఆయన వెన్నంటి ఉండి, వెన్ను దన్నుగా నిలచి, నైతిక మద్దతుతో పాటు విజయాన్ని పువ్వుల్లో పెట్టి అందించిన విశాల హృదయం ఉన్న నియోజకవర్గ సువిశాల ప్రజా సమూహాల నుంచే ఏకంగా ఆయన కనుమరుగు అయ్యారు. రాజకీయ పలాయనం చిత్తగించారు. ఎందుకో తెలియదు కానీ … నియోజకవర్గ ప్రజలకు ముఖం చాటేసిన ఆ నేత మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు. ఇంతటి మహాభినిష్క్రమణకు మాత్రం ఖచ్చితమైన కారణాలు కానరావడం లేదు. ఈ పరిణామంపై ప్రజల్లో కూడా అంతగా ఆసక్తి, చర్చ కానరాలేదు.

1975 లో సొంతూరు లింగంపర్తి పంచాయితీ సర్పంచ్ అయ్యి, 1978 లో శంఖవరం సమితి ఎన్నికల్లో పర్వత సుబ్బారావుతో తలపడి పరాజితులైనప్పటి నుంచి నియోజకవర్గ స్థాయి రాజకీయాల్లో వరుపుల సుబ్బారావు ప్రముఖంగా కనపడుతూ… వినపడుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నియోజక వర్గంలో వరుసగా 1955, 1962, 1967,1972, 1978, 1983, 1985, 1991, 1994, 1999, 2004, 2009, 2014, 2019 సంవత్సరాలలో మొత్తం పద్నాలుగు దఫాలుగా  అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఇందులో 2004 లో భారత జాాతీయ కాంగ్రెస్ (ఐ) పార్టీ నుంచి, 2014 లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నెగ్గిన వరుపుల సుబ్బారావు రాజకీయ జీవితం తన పదవీ కాలంలో ఓ వెలుగు వెలిగింది.

ఈయన 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలుగు దేశం పార్టీ నుంచి ముచ్చటగా మూడో సారి కూడా ఎమ్మెల్యే అయ్యి హ్యాట్రిక్ సాధించి చంద్రబాబు తెలుగు దేశం పాలనలో మంత్రి కొలువును సొంతం చేసుకో వచ్చుని ఆశ పడ్డారు. ఐతే అందుకు భిన్నంగా ఆ సమయంలో ఆ పార్టీ ఎమ్మెల్యే టికెట్ చివరి వరకూ ఊరిస్తూ వచ్చి వరుపుల సుబ్బారావుకు స్వయానా మనుమడైన వరుపుల రాజాకు దక్కింది. అదే చివరి నిమిషంలో వరుపుల సుబ్బారావు అధికార తెలుగు దేశం పార్టీని వీడి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, తన మనుమడు రాజా త్రయంపై సుబ్బారావు కారాలు మిరియాలు నూరారు. రాజా అపజయానికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం సమన్వయకర్త, ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, వరుసకు అల్లుడైన పర్వత శ్రీపూర్ణచంద్ర ప్రసాద్ విజయానికి కృషి చేస్తానని ప్రతిన పూనారు. తన మనవడు రాజా పరాజయమే నా విజయమని సుబ్బారావు శపథం చేసారు. అంతా ఆయన అనుకున్నట్లే జరిగింది.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  151 మంది ఎమ్మెల్యేలతో 23 మే 2019న ఘన విజయం సాధించింది. అనంతరం జూన్ నెల నుంచే వరుపుల సుబ్బారావు పార్టీకి, రాజకీయానికి, కడకు ప్రజలకూ దూరంగా ఉంటూ వస్తున్నారు. దీంతో వరుపుల సుబ్బారావు రాజకీయ జీవితం హఠాత్తుగా 2019 జూన్ మాసంతోనే ముగిసి పోయినట్లైంది. ఇప్పటికి 2021 మే నెల నాటికి రెండేళ్ళు పూర్తి కావస్తోంది. ఈ కాలంలో మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ప్రత్యక్ష, పరోక్ష అవసరం, ప్రమేయం కానీ నియోజకవర్గ పార్టీకి అఖ్ఖర లేకుండా పోయాయి. ఫలితంగా నియోజకవర్గ పార్టీలో ద్వితీయ నాయకత్వం, సమాంతర నాయకత్వం అనేవి లేకుండా ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఏకీకృత నేతృత్వంలో ఏకచత్రాధిపత్యంతో ఐక్యతా రాగంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి సూది మొనంత అవకాశం కూడా ఇవ్వకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పధంలో ప్రజాక్షేత్రంలో దూసుకు పోతోంది. వరుపుల సుబ్బారావు రాజకీయం పలాయనం స్వచ్ఛంద రాజకీయ విరమణేనా..? లేక రాజకీయ సన్యాసమా…? అన్నవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలుగా మిగిలి పోయాయి. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *