* తూర్పు గోదావరిలో అత్యధిక ప్రభావం
* అర లక్ష దాటిన కరోనా రోగులు
* 343 కు చేరిన కరోనా మరణాలు
* అత్యధిక ప్రజానీకం నిర్లక్ష్యం నీడలోనే
* యధేచ్ఛగా సామూహిక కార్యకలాపాలు
* ప్రకటనలూ, వైద్య సేవలకే పరిమితం
* నిర్భంద నిర్దిష్ట కార్యాచరణ శూన్యం
* టీకాల్లేవంటూ ఫిర్యాదులు

శంఖవరం, 27 ఏప్రిల్ 2021
——————————————
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అదే మాదిరిగా తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కల్లోలలం అధికం అయ్యింది. దీంతో జిల్లా జనుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉండగా అందులో సహజంగానే విస్తీర్ణం, జన సాంద్రత అధికంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లా అత్యంత ప్రభావిత ప్రాంతంగా నమోదు అయింది. ఫలితంగా ఈ జిల్లాలో పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం నాటికి గడచిన 24 గంటల్లో 1,353 కొత్త కేసులు నమోదు కాగా దాంతో ఇప్పటికి జిల్లా మొత్తం కేసుల సంఖ్య 52,039 కి చేరింది. వీరిలో 33,946 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 17,750 మంది మాత్రం చికిత్సను తీసుకుంటూ ఉన్నారు. కాగా జిల్లాలో వైరస్ సోకి చనిపోయిన వారి సంఖ్య 343 కి చేరింది. జిల్లా వ్యాప్తంగా కరోనా నియంత్రణకు ప్రభుత్వ అధికార యంత్రాంగం మంగళవారం వరకూ చేసింది ప్రకటనలూ, ప్రచారం, పరీక్షలు, టీకాలు వేయడం వంటి కంటి తుడుపు చర్యలు మాత్రమే తప్ప ప్రజలను, జన సమూహాలను, ప్రజల సామూహిక కార్యకలాపాలను నిర్భంధంగా క్రియా శీలకంగా నియంత్రించింది లేదు. మసీదులు, చర్చిలు, దేవాలయాల్లో యధావిధిగా ఉమ్మడి కార్యకలాపాలు యధావిధిగా జరుగుతున్నాయి. అటు ప్రజా ప్రతినిధులు, ఇటు ప్రభుత్వ అధికారులు ప్రజలను అప్రమత్తం చేయడానికి ఏసి గదులను, కార్యాలయాలను వీడి ప్రజాక్షేత్రంలోకి వచ్చింది లేదు. జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగుతుంటే తెగించి వీధుల్లోకొచ్చి ఎన్నికలను సజావుగా నిర్వహించిన ఈ రెండు తరహా యంత్రాంగాలూ ఎన్నికల అనంతరం కరోనా స్వీయ నియంత్రణలోకి వెళ్ళిపోయి బ్రతుకు జీవుడా అంటూ ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారే తప్ప ఏ ప్రజల యోగ క్షేమాలను చూడడానికి ఈ వ్యవస్థలు ఉన్నాయో ఆ ప్రజలనే ఉద్దేశ పూర్వకంగా విస్మరించాయి. పైగా ఉదక మండూక శబ్దంలా ప్రకటనలను మాత్రం పైకి గుప్పిస్తూ తమ ఉనికిని చాటు కుంటూ ఉన్నాయి. ఫలితంగా అంగన్వాడీ సిబ్బంది, గురుతర భాధ్యత కలిగిన ఉపాధ్యాయులు తెలిసుండి కూడా సామూహిక ధర్నాలకు దిగుతున్నారు. కరోనా బాధితులు సైతం స్వీయ గృహ నిర్బంధం పాటించకుండా జన సమూహాల్లో కలసి పోతున్నారు. ఇటువంటి వారిపై ఎటువంటి నిఘా లేదు. కరోనా రోగుల నుంచి ప్రధమ, ద్వితీయ శ్రేణి స్పర్శ కలిగిన వారిని గుర్తించి నిరంతరం వారికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయడం తలకు మించిన భారంగా మారింది. ప్రత్తిపాడు ప్రభుత్వ ఆస్పత్రిలో సుమారు నలబై రోజుల క్రితం కరోనా మొదటి దఫా టీకా వేసుకొని 28 రోజుల తరువాత వేయాల్సిన రెండో దఫా టీకా వేయవలసి ఉన్నది. కానీ ఇంత వరకు టీకాలు రాక ఆందోళన చెందుతూ ప్రభుత్వ ఆసుపత్రుల చుట్టూ తిరుగు తున్నారు. ఈ టీకాను ప్రభుత్వ ఆసుపత్రులకు వెంటనే సరఫరా చేయాలని ప్రత్తిపాడు తాహశీల్దార్ గోపాలకృష్ణకు ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకులు శింగిలిదేవి సత్తిరాజు ఫిర్యాదు చేశారు. ఇదీ టీకాల ప్రస్తుత వాస్తవ పరిస్థితి. అవగాహన ఉన్న కొద్ది మంది ప్రజలు మాత్రమే స్వీయ నియంత్రణ పాటిస్తుండగా అత్యధిక ప్రజానీకం అవగాహన లేకనో నిర్లక్ష్యంతోనే బహిరంగ ప్రదేశాల్లో యధేచ్ఛగా అజాగ్రత్తగా సామూహిక కార్యకలాపాలను నిర్వహిస్తూ తెలియని రీతిలో కరోనా బారిన పడి ప్రాణాలను బలిస్తున్నారు.

ఫొటో రైట్ అప్ ;

కరోనా నివారణా రెండో డోసు ఇంజెక్షన్ల కొరతపై ప్రత్తిపాడు తాసిల్దారుకు బిజేపీ ఫిర్యాదు దృశ్యం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *