* ఆందోళనలో వ్యాపారులు
* ఆగ్రహిస్తున్న కొనుగోలు దారులు

గొల్లప్రోలు, 28 ఏప్రిల్ 2021
—————————————
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజక వర్గం గొల్లప్రోలు పట్టణ నడిబొడ్డున ఉన్న మార్కెట్ ను తరలించేందుకు నగరపంచాయితి పాలకవర్గం చేస్తున్న ప్రయత్నాలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పంచాయితి ఏర్పడి సుమారు 80 సంవత్సరాలు కావస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకూ కూరగాయలు, చేపలు, మాంసం, దుకాణాలు ఇక్కడే ఉన్నాయి. మార్కెట్ ను తరలిస్తే తమ గతి ఏమిటని పలువురు వ్యాపారాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. నగర పంచాయితి కార్యాలయానికి సొంత భవనం లేక పోవడంతో రక్షిత మంచినీటి సరఫరా విభాగం ప్రక్కన ఉన్న మార్కెట్ స్థలాన్ని నగర పంచాయితి భవన నిర్మాణానికి ఎంపిక చేశారు. ఇదే స్థలంలో సుమారు 80 సంవత్సరాలకుపైగా మాంసం, చేపలు, దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. అలాగే కూరగాయల దుకాణాలు కూడా ఇక్కడే ఉండటంతో పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు కూడా మార్కెట్ అందుబాటులో ఉంటుంది. అయితే నగర పంచాయితి భవనం నిర్మిస్తే చేపలు, మాంసం విక్రయ దారులు , కూరగాయల వర్తకులు కూడా ఉపాధి కోల్పోయి, తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. క్షౌర శాలల సముదాయాన్ని కూడా తొలగిస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాంసం, చేపలు, కూరగాయల దుకాణాలకు రాజు చెరువు గట్టుపై షెడ్ లు నిర్మిస్తారని పేర్కోంటున్నారు. ఈ స్తలం పట్టణానికి ఒక మూలగా ఉండటం, శ్మశానానికి వెళ్ళే దారి కావడంతో పలువురు తీవ్ర   అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పట్టణ వాసులతో పాటు పరిసర గ్రామాలైన బి.ప్రత్తిపాడు, భోగాపురం, తాటిపర్తి, చినజగ్గంపేట గ్రామాలకు చెందిన ప్రజలకు కూడా ఇదే ఏకైక మార్కెట్ కావడంతో ఆ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంది. నగర పంచాయితి భవనాన్నే రాజు చెరువు గట్టు స్థలంలో నిర్మించవచ్చు కదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రజల సౌకర్యం కోసం కాకుండా రాజకీయ దుక్పదంతోనే మార్కేట్ ను మార్చి వేస్తున్నారని పలువురు ఘాటుగా విమర్శిస్తున్నారు. పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, నగర పంచాయితి అధికారులు తక్షణమే స్పందించి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా మార్కెట్ తరలించకుండా నిర్ణయం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *